డీపీఓలో కాంట్రాక్టర్‌ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-10T10:20:47+05:30 IST

నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ)లో గురువారం ఓ కాంట్రాక్టర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించటం ..

డీపీఓలో కాంట్రాక్టర్‌ ఆత్మహత్యాయత్నం

అనంతపురం క్రైం, జూలై9: నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ)లో గురువారం ఓ కాంట్రాక్టర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది. వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని రాంనగర్‌కు చెందిన వెంకటరాముడు కొన్నినెలల కిందట బుక్కరాయసముద్రం మండలంలోని గుత్తిరోడ్డు సమీపాన తన పొలంలో వెంచర్‌ వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నగర శివారులోని తపోవనానికి చెందిన కాంట్రాక్టర్‌ రమేష్‌ ఆ వెంచర్‌లో పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని, కొంత అడ్వాన్స్‌ తీసుకున్నాడు. పనులు చేస్తుండగానే వెంకటరాముడుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఈ ఏడాది మే నెలలో మనస్పర్థలు తలెత్తాయి.  వెంకటరాముడు అప్పట్లో బుక్కరాయసముద్రం పోలీసులకు ఫిర్యా దు చేయటంతో కాంట్రాక్టర్‌ రమే్‌షపై కేసు నమోదు చేశారు.


కాం ట్రాక్టర్‌ రమేష్‌.. సోదరితో కలిసి తనకు న్యాయం చేయాలని గురువారం ఎస్పీ సత్యయేసుబాబుకు విన్నవించేందు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చాడు. అక్కడి సిబ్బంది అడ్డగించే ప్రయత్నం చేయటంతో  వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని, ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అక్కడి సిబ్బంది అడ్డుకోవటంతో ప్రమాదం తప్పింది. కాగా..  కాంట్రాక్టర్‌ రమే్‌షను అదుపులోకి తీసుకుని, దీనిపై విచారణ చేయాలని సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసులును ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశించారు. అతడితోపాటు అతడి సోదరిని సీసీఎస్‌ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి, విచారిస్తున్నారు. తమకు సంబంధించిన 20 సెంట్ల స్థలాన్ని బుక్కరాయసముద్రం సీఐ బెదిరించి, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, న్యాయం కోసం ఎస్పీని ఆశ్రయించామని మీడియాతో కాంట్రాక్టర్‌ రమేష్‌, సోదరి చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువర్గాలతో విచారించి, కేసు నమోదు చేశామనీ, స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని సీఐ సాయిప్రసాద్‌ చెబుతున్నారు. 

Updated Date - 2020-07-10T10:20:47+05:30 IST