కమీషన్ల పర్వం!
ABN , First Publish Date - 2020-07-08T10:21:41+05:30 IST
రోడ్లు, భవనాల శాఖ పరిధిలో అభివృద్ధి కంటే ఆమ్యామ్యాల వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు బహిరంగంగానే

ఆర్అండ్బీ శాఖలో వసూళ్ల పర్వం
పెట్రోల్ బంకుల అనుమతికి పైసావసూల్
కాంట్రాక్టర్ల రిజిస్ర్టేషన్లలోనూ దండుకుంటున్న వైనం
ఆ వివాదానికి కారణమేమిటో?
అనంతపురం కార్పొరేషన్, జూలై 7: రోడ్లు, భవనాల శాఖ పరిధిలో అభివృద్ధి కంటే ఆమ్యామ్యాల వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కె,ౖ ఇష్టారాజ్యంగా దోపిడీ సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. టీడీపీ హయాంలో ఆ శాఖ పరిధిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఫర్నీచర్, లాన్ కోసం రూ.50 లక్షల మేర ఖర్చు చేశారు. ఆ తరువాత మరోసారి ఫర్నీచర్ కొనుగోలుకు టెండర్ పిలవటం వివాదాస్పదమైంది. ఇక్కడ కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి లక్షలాది రూపాయలు స్వాహా చేసేందుకు యత్నించారు. వ్యవహారం బెడిసి కొట్టింది. వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ ద్వారా ఓ ప్రజాప్రతినిధి చెప్పిన ఇద్దరు కాంట్రాక్టర్లకు అధికారులు పనులు అప్పగించారు. దీనిపైనా అప్పట్లో విమర్శలు వచ్చాయి.
ఇక సాధారణ రోడ్ల పనుల విషయంలో అధికారుల కమీషన్ల గురించి చెప్పనక్కర్లేదు. కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరి సొమ్ము వారి ఖాతాల్లోకి వెళ్తుందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఏడాదిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందల కోట్ల పనులు రద్దవటంతో అధికారులు రూటు మార్చారు. పెట్రోల్ బంకుల అనుమతి, కాంట్రాక్టర్ల రిజిస్ర్టేషన్ల విషయంలో వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. ప్రతి బంకుకీ ఒక రేటు పెట్టి, ఆ మేరకు వసూలు చేసినట్లు సమాచారం. తాజాగా ఆ శాఖలో ఉన్నతాధికారి వ్యవహారంపై ఉద్యోగులు ఆందోళన చేయటం వివాదాస్పదమైంది.
దోపిడీ పర్వమిలా..
రోడ్లు, భవనాల శాఖ అంటేనే గుర్తొచ్చేది కోట్లాది రూపాయల పనులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కల్పించుకుంటుంటారు. ఆ స్థాయిలో జరిగే పనుల్లో అధికారులకు భారీగానే మడుపులు అందుతుంటాయి. కొంతకాలంగా పనులు లేకపోవటంతో ఆ శాఖాధికారులు ఆదాయం వచ్చే మరో విభాగంపై కన్నేశారు. పెట్రోల్ బంకులు వారికి కలిసొచ్చాయి. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడానికి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖతోపాటు ఆర్అండ్బీ అనుమతి తప్పనిసరి.
ఇతర శాఖల మాటెలావున్నా ఆర్అండ్బీ అధికారులు మాత్రం తమదైన స్థాయిలో చక్రం తిప్పుతారు. జిల్లా వ్యాప్తంగా ఈ మధ్యకాలంలోనే 40 పెట్రోల్ బంకుల వరకూ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో బంకు నుంచి రూ.40 నుంచి 70 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇక్కడ సాంకేతిక విభాగానికి సంబంధించి ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈయన ద్వారానే పైస్థాయి అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టినట్లు సమాచారం. కాంట్రాక్టర్లు ఈ శాఖ పరిధిలో పనులు చేయడానికి ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పెద్దమొత్తంలో పనులు చేసే క్లాస్-1, క్లాస్-2 కాంట్రాక్టర్లు ఆ శాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) కార్యాలయంలోనే రిజిస్ర్టేషన్ చేయించుకోవాలి.
క్లాస్-3, క్లాస్-4 కాంట్రాక్టర్లు జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారి సర్కిల్ పరిధిలో రిజిస్ర్టేషన్ చేయించుకుంటారు. క్లాస్-5 కాంట్రాక్టర్లు డివిజన్ స్థాయిలో రిజిస్ర్టేషన్ చేసుకుంటారు. కింది మూడు స్థాయిల కాంట్రాక్టర్లు రిజిస్ర్టేషన్ చేయించుకోవడానికి అధికారులకు రూ.60 వేల చొప్పున ముట్టజెప్పాలనే అనధికార నిబంధనను తీసుకువచ్చినట్లు బాధితులు వాపోతున్నారు. గడిచిన ఆరు ఏడు నెలల్లోనే 20 మందికిపైగా కాంట్రాక్టర్లు రిజిస్ర్టేషన్ చేయించినట్లు సమాచారం. ఈ సందర్భంలోనూ జిల్లా కేంద్రంలోని సర్కిల్ ఆఫీస్‌లో పనిచేసే ఓ అధికారి ఇలాంటి వ్యవహారాలను ముందుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ వివాదం వెనుక?
ఉన్నదాధికారి తీరుపై ఆ శాఖ ఉద్యోగులు పది రోజుల క్రితం ఆందోళన చేయటం కలకలం రేపింది. రాత్రి సమయంలో కిందిస్థాయి ఉద్యోగులకు మెసేజ్‌లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆందోళనకు ముందు ఇద్దరు మహిళా ఏఈలు సెలవులోకి వెళ్లగా.. తాజాగా మరో మహిళా ఏఈ కూడా ఆదేబాట పట్టారు. ఎప్పుడూలేని విధంగా ఈ శాఖలో తలెత్తిన వివాదం ఇతర శాఖల్లో చర్చకు దారితీసింది. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన మహిళా ఏఈని సస్పెండ్ చేయాలని కోరుతూ ఆ ఉన్నతాధికారి.. పైఅధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. కొత్తగా పనులు వచ్చినప్పటి నుంచి ఈ వివాదం రేకెత్తినట్లు తెలుస్తోంది.
దాదాపు 40 పనులకు సంబంధించి అంచనా, టెండర్ల ప్రక్రియ వర్క్ ఆర్డర్ల తయారీ తదితరాలను త్వరగా పూర్తి చేయాలని పైస్థాయి నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు పనిచేయలేక చేతులు ఎత్తేయటంతో ఉన్నతాధికారికి ఇతర అధికారుల మధ్య వివాదం తలెత్తిందన్న చర్చ సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఎస్ఈ శ్రీనివా్‌సను వివరణ కోరటానికి ప్రయత్నించగా ఆయన ఫోన్ తీయలేదు.