రబీ బీమాపై అయోమయం

ABN , First Publish Date - 2020-06-22T10:30:11+05:30 IST

కరువు జిల్లాకు విడుదలైన 2018-19 రబీ పంటల బీమాపై అయోమయం కొనసాగుతోంది. పది రోజుల క్రితం జిల్లాలోని

రబీ బీమాపై  అయోమయం

పది రోజుల క్రితం రూ.46.84 కోట్ల విడుదల 

ఇప్పటిదాకా రైతుల వారిగా జాబితా ఇవ్వని వైనం 

ఆందోళనలో అన్నదాతలు 


అనంతపురం వ్యవసాయం, జూన్‌ 21 : కరువు జిల్లాకు విడుదలైన 2018-19  రబీ పంటల బీమాపై అయోమయం కొనసాగుతోంది. పది రోజుల క్రితం జిల్లాలోని పప్పుశనగ రైతులకు రూ.46.84 కోట్ల బీమా నగదు బజాజ్‌ కంపెనీ విడుదల చేసింది. అయితే ఇప్పటిదాకా రైతుల వారిగా జాబితా ఇవ్వకపోవడం గమనార్హం. నేరుగా రైతుల ఖాతాలకు సొమ్ము జమచేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఏఏ రైతుకు ఎంత సొమ్ము వర్తింపజేశారు, ఇంతవరకు ఎంత మంది రైతులకు జమ చేశారన్న వివరాలు వెల్లడించడం లేదు.


జేడీఏ కార్యాలయ వర్గాలు కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా స్పందన లేకపోయింది. నేరుగా రాష్ట్ర స్థాయికి రైతుల వారిగా జాబితా పంపిస్తామంటూ బుకాయిస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల తర్వాత ఆలస్యంగానైనా బీమా వర్తింపజేసినా... తమకు ఎంత సొమ్ము వర్తింపజేశారో తెలియని సందిగ్ధంలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు. 


ఫిర్యాదులిచ్చేదెలా?

జిల్లావ్యాప్తంగా 50 మండలాల పరిధిలోని 75,355 మంది రైతులకు సంబంధించి 56,795 హెక్టార్ల పప్పుశనగకు రూ.46.84 కోట్లు పంటల బీమా వర్తింపజేశారు. అందులోనూ జిల్లాలోని ఒక్కో మండలానికి ఒక్కో రకంగా వర్తింపజేయడంతో రైతులు అన్యాయానికి గురయ్యారు. మరోవైపు బెళుగుప్ప మండలంలో 3831 మంది పప్పుశనగ రైతులు ప్రీమియం చెల్లించినా ఒక్క పైసా బీమా వర్తింపజేయకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. మిస్‌మ్యాచ్చెస్‌, ఆధార్‌ సమస్యలతో పలువురు రైతులకు సొమ్ము పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.


ఇప్పటిదాకా రైతుల జాబితానే ఇవ్వకపోతే ఫిర్యాదులు ఎలా ఇవ్వాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఎప్పటిలోగా తమకు సొమ్ము అందుతుందోనంటూ నిట్టూరుస్తున్నారు. మరోవైపు రబీ సీజన్‌లో వేరుశనగ, వరి, జొన్న, పొద్దుతిరుగుడు తదితర పంటలకు 17,016 మంది రైతులు తమ వాటాతో పాటు ప్రభుత్వ వాటా కింద  రూ.5.75 కోట్లు సంస్థకు ప్రీమియం రూపంలో చెల్లించారు. ఆయా పంటలు తీవ్రంగా నష్టపోయినా బీమా వర్తింపజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-06-22T10:30:11+05:30 IST