-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Complain to the Collector that the premises of the house are occupied
-
ఇంటి స్థలాలు ఆక్రమించారని కలెక్టర్‌కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-12-15T06:31:55+05:30 IST
మండలంలోని గోవిందవాడ గ్రామంలో వైసీపీ నాయకులు పేదల ఇళ్ల స్థలాలను ఆక్రమించారని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

బొమ్మనహాళ్, డిసెంబరు 14: మండలంలోని గోవిందవాడ గ్రామంలో వైసీపీ నాయకులు పేదల ఇళ్ల స్థలాలను ఆక్రమించారని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం అనంతపురంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో గ్రామానికి చెందిన హనుమంతప్ప, వన్నూరుస్వామి, సర్మస్ వలీ, వేమన్న తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామ వైసీపీ ప్రధాన నాయకుడు తన అనుచర వర్గానికే ఐదు సెంట్ల నుంచి పది సెంట్లకు పైగా ఇంటి స్థలాల పేరుతో స్థలాన్ని ఆక్రమించారని ఆరోపించారు. గ్రామంలోని 166 సర్వే నెంబర్‌లో 3.82 సెంట్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేఅవుట్లు వేసేందుకు పూనుకున్నారన్నారు. ఆ సర్వే నెంబర్‌పై కోర్టులో కేసు నడుస్తున్నా, అధికారులు వైసీపీ నాయకుడి మాటతో తన బంధువర్గాలకు, అనుచర వర్గానికి ఐదు సెంట్ల నుంచి పది సెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. 174 సర్వే నెంబర్‌లో 2.80 ఎకరాలలో సుమారు ఎకరా స్థలాన్ని వారి వాముదొడ్లకు కేటాయించారని, అధికారులు కూడా ఆ నాయకుడికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వంలో కళ్లుదేవనహళ్లి పొలంలోని 151 సర్వే నెంబర్‌లో 19.60 ఎకరాలలో ఇళ్ల ప్లాట్లు వేసి 450 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చారన్నారు. ఎన్నికలు రావడంతో స్థలాలు చూపి ఇళ్లు మంజూరు ఆగిపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆస్థలంలో ఇవ్వకుండా వాటిని విస్మరించి, గోవిందవాడ గ్రామంలో 174 సర్వే నెంబర్‌లో 2.80 ఎకరాలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తున్నారన్నారు.