‘నివర్‌’పై అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-11-25T06:43:22+05:30 IST

నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. యంత్రాంగాన్ని ఆదేశించారు.

‘నివర్‌’పై అప్రమత్తంగా ఉండండి
నివర్‌ తుఫాన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

జిల్లాలో ప్రాణనష్టం వాటిల్లకూడదు

అధికారులకు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం

అనంతపురం, నవంబరు24(ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌ నుంచి వివిధ శాఖల అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. బుధ, గురువారాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దు మండలాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాన్‌ ప్రభావంతో గంటకు 40 నుంచి 80 కి.మీ., వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రెండ్రోజుల పాటు పంటకోతల్లేకుండా చూడాలన్నారు. ఇప్పటికే పంటలు కోత పడిఉంటే వాటిని జాగ్రత్త పరుచుకునే విధంగా రైతులకు సమాచారమందించాలన్నారు. తుఫాన్‌ సమాచారం అందించేందుకు జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌, మండల స్థాయిల్లో కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు 08554-220009, 8500292992ను సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, తదితర పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సత్యఏసుబాబు, జేసీలు డాక్టర్‌ సిరి, గంగాధర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Read more