‘స్టాండప్ ఇండియా’ ప్రయోజనాలను అందిద్దాం..
ABN , First Publish Date - 2020-10-24T10:04:01+05:30 IST
‘స్టాండప్ ఇండియా’ ప్రయోజనాలను అందిద్దాం..

కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం కార్పొరేషన్, అక్టోబరు23: స్టాండప్ ఇండియా పథకం ప్రయోజనాలను లబ్ధిదారులకు చేరవేద్దామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్టాండప్ ఇండియా పథకం కింద వీలైనంత మంది ఎస్సీ, ఎస్టీ, మహిళలు దరఖాస్తు చేసుకునేలా కృషి చేయాలని ఆదేశించారు. పథకంపై జిల్లాలోని ఎంపీడీఓలు, సంబంధిత గ్రామ సచివాలయ డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్లతో కలెక్టర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సచివాలయం పరిధిలో వ్యాపార దృక్పథం ఉన్న వారిని గుర్తించి, స్టాండప్ ఇండియా పథకం గురించి అవగాహన కల్పించాలన్నారు. వ్యాపార సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సహకరించి, రుణాలు ఇవ్వాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మహిళల నుంచి ప్రతి గ్రామ సచివాలయం నుంచి కనీసం మూడు, వార్డు సచివాలయం నుంచి ఐదు దరఖాస్తులకు తగ్గకుండా వారం రోజుల్లో ఆన్లైన్ ద్వారా స్టాండప్ ఇండియా పోర్టల్‌లో అప్లోడ్ చేయించాలని ఆదేశించారు. ఈ పథకం ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు మంజూరు చేస్తారన్నారు. 18 సంవత్సరాలు పైబడినవారు పథకానికి అర్హులన్నారు. స్టార్టప్ ప్రారంభించాలనుకునేవారు సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసుకుని, దరఖాస్తు చేసుకుంటే 75 శాతం ప్రాజెక్టు పెట్టుబడిని తక్కువ వడ్డీతో ప్రభుత్వం రుణంగా ఇస్తుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా యువత ఉపయోగించుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకర్లు ఈ అంశంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. దరఖాస్తులను రకరకాల కారణాలు చెప్పి, తిరస్కరించరాదన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ గంగాధర్‌గౌడ్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుదర్శన్‌బాబు, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ రమణారెడ్డి, లీడ్‌బ్యాంకు మేనేజర్ మోహన్‌మురళి పాల్గొన్నారు.