గడువులోపు భవన నిర్మాణాలు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-11-21T06:19:31+05:30 IST

జిల్లాలో చేపడుతున్న వివిధ భవన నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

గడువులోపు భవన నిర్మాణాలు పూర్తి చేయాలి
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు

నాణ్యతాప్రమాణాలు తప్పక పాటించాలి.. 

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనంతపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న వివిధ భవన నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి సంబంధిత శాఖాధికారుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతు భరోసా, గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు, బల్క్‌మిల్క్‌ యూనిట్ల ఏర్పాటు స్థలం గుర్తింపు ఇతరత్రా ఇంజనీరింగ్‌ పనుల నాణ్యతపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు 2 వేల జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. వీటితో పాటు మిగిలిన ప్రభుత్వ భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఇప్పటివరకూ చేపట్టిన పనులకు చేసిన ఖర్చు మొత్తానికి సంబంధించిన బిల్లులను అప్‌లోడ్‌ చేయాలన్నారు. రానున్న నాలుగు రోజుల్లో భవన నిర్మాణాల్లో పురోగతి ఉండాలన్నారు. ప్రారంభంకాని పనులేవైనా ఉంటే నాలుగు రోజుల్లోపు మొదలెట్టేలా ఆర్డీఓలు, సబ్‌ కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. ఇంజనీరింగ్‌ సహాయకులు తప్పనిసరిగా ఎం బుక్కులు నమోదు చేయాలన్నారు. నాడు-నేడు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ.333 కోట్లకుగానూ రూ.161 కోట్లు ఖర్చు చేశారన్నారు. రానున్న నాలుగు రోజుల్లో ఆర్థిక పురోగతి 60 శాతానికి తీసుకు రావాలన్నారు. నాడు-నేడు పనులపై ఇంజనీరింగ్‌ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రెండ్రోజుల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో పాఠశాలలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా అందజేసిన షూలు కొందరికి సరిపోలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివి వెనక్కిచ్చి, సరైన కొలతల షూలను సంబంధిత ఏజెన్సీల నుంచి తెప్పించుకోవాలన్నారు. ఇతర పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో టీసీ ప్రామాణికం కాకుండా చేర్చుకోవాలన్నారు. కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలో 823 ప్రదేశాల్లో బల్క్‌మిల్క్‌ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ఐదు సెంట్లకు తక్కువ లేకుండా స్థలాలు సేకరించాలని సబ్‌ కలెక్టర్‌, ఆర్డీఓలు, తహసీల్దార్లకు సూచించారు. ఈనెల 25వ తేదీలోపు స్థలాలను గుర్తించాలన్నారు. డిసెంబరు 25న ఇళ్ల పట్టాలను అందజేసేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జేసీ డా.సిరితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read more