అన్ని మతాల ప్రజలూ సహకరించండి

ABN , First Publish Date - 2020-03-23T10:04:00+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుం డా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని మతాల ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆయా వర్గాలను కోరారు.

అన్ని మతాల ప్రజలూ సహకరించండి

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం, మార్చి22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుం డా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని మతాల ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆయా వర్గాలను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లాలోని హిందూ, ముస్లిం, క్రిష్టియన్‌ మతపెద్దలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ ఏ విధంగా వ్యాప్తి చెందుతోందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అందుకు సం బంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో మత పెద్దలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెం దకుండా అన్ని చర్చిలు, దేవాలయాలు, మసీదుల్లో మూకుమ్మడి ప్రార్థనలు చేయరాదన్నారు. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ వాటన్నింటినీ మూసివేయాలన్నారు.


సీఆర్‌ఐటీలో 250 పడకలతో క్వారంటైన్‌ కేంద్రం: కలెక్టర్‌

కరోనా వైరస్‌ ప్రకంపనల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఇందులో భాగంగా సీఆర్‌ఐటీ కళాశాలలో 250 పడకలతో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు అధికారులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్‌ఓను ఆయన ఆదేశించారు.


అందరికీ మాస్కులు, శానిటైజర్లు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్కేయూలోనూ క్వారంటైన్‌ బ్లాక్‌ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కంట్రోల్‌ రూమ్‌లో అన్ని వివరాలు నమోదు చేయాలని డీఆర్వో గాయత్రీదేవికి సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మైకుల్లో ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో అన్ని దుకాణాలు, హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నామన్నారు.  


అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు:  జేసీ ఢిల్లీరావు

కరోనా వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా  ప్రజలకు అవసరమైన మాస్కులు. శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని జేసీ ఢిల్లీరావు హెచ్చరించారు. 200 మి.లీ హ్యాండ్‌ శానిటైజర్‌ రూ. 100లు, రెండు పొరల నాన్‌ ఒవెన్‌ ఫ్యాబ్రిక్‌ మాస్కు రూ. 8లు, మూడు పొరల నాన్‌ ఒవెన్‌ ఫ్యాబ్రిక్‌ మాస్కు రూ. 10లకు మాత్రమే విక్రయించాలన్నారు. అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Updated Date - 2020-03-23T10:04:00+05:30 IST