ఆస్తికి అడ్డుపడుతోందనే...

ABN , First Publish Date - 2020-12-28T05:57:10+05:30 IST

తమ ఆస్తిని విక్రయించుకోవడానికి అడ్డుపడుతోందని పినతల్లిపై కొడవలితో దాడిచేసి, ఆమె మృతికి కారణమైన కుమారుడు, మరో నిందితుడిని నగరంలోని టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు కొడవళ్లతోపాటు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఆస్తికి అడ్డుపడుతోందనే...
వివరాలు వెల్లడిస్తున్న సీఐ జాకీర్‌ హుస్సేన్‌

కొడవలితో పినతల్లిపై దాడి.. చికిత్సపొందుతూ మృతి 

అనంతపురం క్రైం, డిసెంబరు27: తమ ఆస్తిని విక్రయించుకోవడానికి అడ్డుపడుతోందని పినతల్లిపై కొడవలితో దాడిచేసి, ఆమె మృతికి కారణమైన కుమారుడు, మరో నిందితుడిని నగరంలోని టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు కొడవళ్లతోపాటు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సీఐ జాకీర్‌హుస్సేన్‌, ఎస్‌ఐలు రాఘవరెడ్డి, రాంప్రసాద్‌, సిబ్బందితో కలిసి ఆదివారం వివరాలను వెల్లడించారు. నగరంలోని ఆదర్శనగర్‌లో నారాయణస్వామి నిర్మలమ్మ దంపతులు ఉన్నారు. నారాయణస్వామి మొదటి భార్య పాపమ్మ చనిపోవడంతో నిర్మలమ్మను 1997లో రెండవ వివాహం చేసుకున్నాడు. పాపమ్మ బతికున్న సమయంలో మనోజ్‌కుమార్‌ అనే బాలుడిని రెండేళ్ల వ యసులో దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ స్వామి నగరంలోని హౌసింగ్‌బోర్డులో 5సెంట్ల స్థలం రెండుసెంట్లు కలిగిన ఇళ్లతో పాటు బళ్లారిలో 10 సెంట్లు స్థలాన్ని మనోజ్‌కుమార్‌ మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. కొన్నేళ్ల కిందట మనోజ్‌కుమార్‌కు తాడేపల్లిగూడెంకు చెందిన ఓ మహిళతో వివాహం అయింది. ఈ క్రమంలో గత కొన్నినెలలుగా తమ పేరుమీద ఉన్న ఇంటితో పాటు ఇంటిస్థలాలను విక్రయించేందుకు సిద్ధం అయ్యాడు. ఇది గమనించిన పినతల్లి నిర్మలమ్మ తనకు ఆస్తిలో వాటా ఉందని కోర్టుకు వెళ్లింది. దీంతో పినతల్లి, కుమారుడు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తన ఆస్తుల విక్రయానికి అడ్డుగా ఉందని భావించిన మనోజ్‌కుమార్‌ తాడేపల్లిగూ డెంకు చెందిన తన ఇద్దరు స్నేహితులు వీరవెంకట్‌, సుబ్బరాజులతో కలిసి ఈనెల 2వ తేదీన హౌసింగ్‌బోర్డులోని తమ ఇంటిలో నిర్మలమ్మపై వేటకొడవలితో దాడిచేసి పరారైయ్యాడు. తీవ్రంగా గాయపడిన నిర్మలమ్మను  ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. పరిస్థితి విషమించి ఈనెల 16వ తేదీన నిర్మలమ్మ బెంగళూరులో మృతిచెందింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, మనోజ్‌కుమార్‌ను, వీరవెంకట్‌ను నగరశివారులోని ప్రసన్నాయపల్లి సమీపంలో ఎస్‌ఐలు ఆదివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సుబ్బరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.



Updated Date - 2020-12-28T05:57:10+05:30 IST