10 వేలు దాటేశాయ్‌!

ABN , First Publish Date - 2020-07-28T10:32:21+05:30 IST

జిల్లాలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. బాధితుల సంఖ్య ఏకంగా 10 వేలు దాటిపోయింది.

10 వేలు దాటేశాయ్‌!

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు..

కొత్తగా 524 మందికి పాజిటివ్‌..

ముగ్గురి మృతి.. 86కి చేరిన మరణాలు..

వసతులపై అధికారుల తలమునకలు..


అనంతపురం వైద్యం, జూలై27: జిల్లాలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. బాధితుల సంఖ్య ఏకంగా 10 వేలు దాటిపోయింది. సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 524 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 10247కి చేరింది. వీరిలో 5029 మంది కోలుకున్నారు. ఇంకా 5132 మంది చికిత్స పొందుతున్నారు. మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. జూన్‌ 30వ తేదీ వరకూ జిల్లాలో 8 మంది మాత్రమే చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జూలై 1వ తేదీ నుంచి కరోనా కేసులతోపాటు మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికి జిల్లాలో 86 మంది కరోనాతో ప్రాణాలొదిలారు. సోమవారం ముగ్గురు మరణించారు. ఈ లెక్కన రోజుకు ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.


వసతులపై అధికారుల తర్జనభర్జన

కరోనా కేసులు పెరుగుతుండటంతో బాధితులకు చికిత్సలు అందించటం కష్టతరంగా మారింది. బాధితులను ఆస్పత్రులకు చేర్పించి, చికిత్సలు అందించాలంటే ముచ్చెమటలు పడుతున్నాయి. బాధితులు తమను ఆస్పత్రులకు తీసుకెళ్లాలని వేడుకోవటం.. ఆస్పత్రులకు వచ్చినా బెడ్లు లేక పడిగాపులు కాస్తూ వైద్యం అందక చనిపోవటం సర్వసాధారణమయ్యాయి. ఇవి అధికారులను ఆందోళనలకు లోను చేస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సైతం అనంత ఘటనలపై సీరియ్‌స అవుతున్నారు. దీంతో కరోనా బాధితులకు అవసరమైన వసతులు, చికిత్సలు అందించేందుకు పరుగులు తీస్తున్నారు. కలెక్టర్‌, జేసీ, వైద్యాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి, ఏర్పాట్లపై కుస్తీ పడుతున్నారు.


అనుమానితుల క్యూ..

కేసులు పెరగటంతో జిల్లాలో అనుమానితుల సంఖ్య పెరిగిపోతోంది. పాజిటివ్‌ కుటుంబసభ్యులతోపాటు కాంటాక్ట్‌ అయిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇలా శాంపిళ్లు ఇచ్చేందుకు ప్రతిచోటా వందలాది మంది క్యూ కడుతున్నారు. సోమవారం జిల్లాలో దాదాపు 15 ప్రాంతాల్లో శాంపిళ్ల సేకరణ కొనసాగింది. జిల్లా కేంద్రంలో కూడా నాలుగు చోట్ల శాంపిళ్లు సేకరించారు. ఆయా ప్రాంతాలకు వందలాది మంది తరలివచ్చారు. గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతూ కనిపించారు. 60 ఏళ్లుపైబడిన వారికే తీసుకుంటుండటంతో పలువురు అనుమానితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


అన్నేఫెర్రర్‌కు కరోనా పాజిటివ్‌

బత్తలపల్లి ఆస్పత్రిలో చికిత్స 

పరామర్శించిన జిల్లా కలెక్టర్‌

ధర్మవరం, జూలై27: ఆర్డీటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అన్నేఫెర్రర్‌కు కరోనా పాజిటివ్‌ రావటంతో సోమవారం సాయంత్రం బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చేరారు. విషయం తెలియగానే జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. ఆస్పత్రికి చేరుకుని, అన్నేఫెర్రర్‌ను పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకుని, సామాజిక సేవ చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-07-28T10:32:21+05:30 IST