మార్కెట్ కమిటీల ద్వారా అరటి కొనుగోలు చేయండి
ABN , First Publish Date - 2020-04-08T09:49:04+05:30 IST
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతుల నుంచి అరటి పంట కొనుగోలు చేయాలని కలెక్టర్ గంధం

అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం, ఏప్రిల్7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతుల నుంచి అరటి పంట కొనుగోలు చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన అరటిని స్థానికంగా విక్రయించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అరటి సాగు చేస్తున్న రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. అరటి కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్ జేడీ, చైర్మన్, ఏడీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చెందిన ఎస్హెచ్జీలతోపాటు మెప్మా, డీఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు.
వీరంతా రైతుల నుంచి అరటి కొనుగోలు చేసి, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందుకు సంబంధించి ఏ మార్కెట్ కమిటీలకు ఎంత అరటి అవసరమవుతుందో డీఆర్డీఏ, మెప్మా ఏపీఎంల ద్వారా ఇండెంట్ తీసుకోవాలని మార్కెటింగ్ ఏడీని ఆదేశించారు. మెప్మా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ మెప్మా పరిధిలోని టీఎంసీలతో ఇండెంట్ తీసుకుని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు అందజేస్తామని కలెక్టర్‌కు వివరించారు. తమవద్ద 160 మంది దాకా స్ర్టీట్ వెండర్స్ ఉన్నారన్నారు. వారందరికి ఇదివరకే గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. వారు అరటి పండ్లు అమ్ముకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 30 మండలాల్లో అరటి పండిస్తున్నారన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్ణయించిన ధరకన్నా రైతులు తక్కువకే అమ్ముతున్నారన్నారు.
ప్రస్తుతం రవాణాతో కలిపి టన్ను అరటి రూ.8000గా వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్ణయించిందని కలెక్టర్‌కు వివరించారు. టన్ను అరటి విలేజ్ ఆర్గనైజేషన్ పాయింట్‌కు వచ్చేసరికి రూ.10720గా ఉంటుందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్ణయించిన ధరకన్నా తక్కువకే అన్ని రవాణా చార్జీలతో కలిపి టన్ను రూ.5500కే రైతులు వీవో పాయింట్ దగ్గర అందించేందుకు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెటింగ్, ఏఎంసీ అధికారుల సమన్వయంతో అరటిని సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజూ ఉదయం, సాయంత్రం, జిల్లాలో సేకరించే అరటి వివరాలను నివేదిక రూపంలో పంపాలని మార్కెటింగ్ ఏడీని ఆదేశించారు.