జూనియర్‌ అసిస్టెంట్‌ లంచావతారం

ABN , First Publish Date - 2020-11-06T07:17:47+05:30 IST

స్థానిక పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ లంచావతారం గురువారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అదే కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న సంజీవకు సంబంధించిన జీతం మంజూరుకు లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు అందులో రికార్డయింది.

జూనియర్‌ అసిస్టెంట్‌ లంచావతారం

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌  

మూడు నెలల జీతం మంజూరుకు కక్కుర్తి

బహిర్గతం చేసిన యాడికి పంచాయతీ స్వీపర్‌ 


యాడికి, నవంబరు 5 : స్థానిక పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ లంచావతారం గురువారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అదే కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న సంజీవకు సంబంధించిన జీతం మంజూరుకు లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు అందులో రికార్డయింది. గతంలో కూడా కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందడానికి రూ.లక్షలు సమర్పించినట్టు బాధితుడు పేర్కొంటున్నాడు. వివరాలివి. యాడికి గ్రామ పంచాయతీలో స్వీపర్‌గా పనిచేస్తూ 2015లో మృతి చెందిన తల్లి నారాయణమ్మ ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని సంజీవ దరఖాస్తు చేసుకున్నాడు. పలుసార్లు ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి రూ.4 లక్షలను ఎంపీడీఓ కార్యాల యం అధికారులకు లంచంగా చెల్లించి 2019లో ఉ ద్యోగ నియామక పత్రం పొందాడు. అప్పట్లో లంచం కింద డబ్బులు ఇస్తున్న సమయంలో సంజీవ సెల్‌ఫోనలో వీడియో తీశాడు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తంకావడంతో పెద్ద మనుషుల సమక్షంలో డబ్బు ఇచ్చేవిధంగా సమస్యను పరిష్కరించుకున్నాడు. ఇటీవల తన జీతం చేయాలని జూనియర్‌ అసిస్టెంట్‌ను కోరాడు. ‘పంచాయతీ పేరుతో ఉద్యోగాన్ని రక్షించుకునేందుకు ఎవరికో రూ.4 లక్షలు ఇస్తున్నావంట కదా... ఆ డబ్బులు నాకిస్తే నీ ఉద్యోగం ఎక్కడికి పోకుండా నేను చూసుకుంటా, పెండింగ్‌ జీతం కూడా చే యిస్తా’ అని ఆ అధికారి హామీ ఇచ్చినట్లు సంజీవ వాపోయాడు. జీతం చేయడానికి బ్లాక్‌మెయిల్‌కు పా ల్పడుతుండడంతో విసిగివేసారిపోయిన సంజీవ గతంలో ఉద్యోగ నియామక పత్రం కోసం లంచం ఇస్తున్న సమయంలో తీసిన వీడియో రికార్డును బహిర్గతం చేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టడం సంచలనం రేపింది. ‘ఏంది అన్నీ చిల్లర నోట్లు తెచ్చావ్‌, వీటిని ఎలా తీసుకుపోవాలి’ అంటూ జూనియర్‌ అసిస్టెంట్‌ మాటలు, నోట్ల కట్టలు తీసుకోవడం ఈవీడియోలో రికార్డు కావడం గమనార్హం. ఈ ఆడియోవీడియోలను గురువారం సోషల్‌ మీడియాలో పెట్టడంతో మండలంలో జూనియర్‌ అసిస్టెంట్‌ లం చావతారం తేటతెల్లమైందన్న ఆరోపణలున్నాయి. పంచాయతీలో పనిచేస్తున్న మరొక మహిళా స్వీపర్‌ మమత నుంచి కూడా గతంలో లంచం తీసుకున్నాడన్న ఆరోపణలున్నాయి.


వేధింపులు తట్టుకోలేకనే... :  సంజీవ, స్వీపర్‌

జీతం చేయమని జూనియర్‌ అసిస్టెంట్‌ సార్‌ని అడిగితే లంచం అడుగుతున్నాడు. ఇప్పటికే చాలా ఇచ్చాను సార్‌ ఇంక నేనిచ్చుకోలేను అంటే ఎవరికో డబ్బులు ఇస్తున్నావంట కదా, ఆ డబ్బులు నాకు ఇవ్వు అని వేధిస్తున్నాడు. చేసేదేమిలేక సెల్‌ఫోనలో రికార్డుచేసిన వీడియో, ఆడియోలను బహిర్గతం చేశా. 


ఆ డబ్బులు పింఛనకు సంబంధించినవి  : గంగాధర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌

వీడియోలో డబ్బులు ఇస్తున్నవి పింఛనకు సంబంధించినవి. మిగిలిన పింఛన డబ్బులు వాపసు చేస్తుండగా వీడియో తీశారు. 


నా హయాంలో జరిగినది కాదు : అనిల్‌కుమార్‌, ఇనచార్జి ఎంపీడీఓ

సోషల్‌ మీడియాలో జూనియర్‌ అసిస్టెంట్‌కు సంబంధించిన వీడియోలో వ్యక్తమవుతున్న వ్యవహారం నా హయాంలో జరిగినది కాదు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు.


Updated Date - 2020-11-06T07:17:47+05:30 IST