అన్నదాతలకు అండగా టీడీపీ: కాలవ, కేశవ్‌, బీకే

ABN , First Publish Date - 2020-12-11T06:07:48+05:30 IST

అనంత కరువు రైతుకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని టీడీపీ జిల్లా కీలక నేతలు కాలవ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌, బీకే పార్థసారథి పేర్కొన్నారు.

అన్నదాతలకు అండగా టీడీపీ: కాలవ, కేశవ్‌, బీకే

33 మండలాలకూ పంట నష్ట పరిహారం ఇవ్వాలి

టీడీపీ నేతలు కాలవ, కేశవ్‌, బీకే


అనంతపురం వైద్యం, డిసెంబరు 10 : అనంత కరువు రైతుకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని టీడీపీ జిల్లా కీలక నేతలు కాలవ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌, బీకే పార్థసారథి పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై అనంత పార్లమెంటు అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌, కళ్యాణదుర్గం, శింగనమల ఇన్‌చార్జ్‌లు ఉమా మహేశ్వరనాయుడు, శ్రావణిశ్రీ, జిల్లా సమన్వయకర్త బీటీ నాయుడు సమావేశమై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వేరుశనగ పంటను రైతులు నష్టపోయారన్నారు. అయితే 33 మండలాలకు బీమా లేకుండా వైసీపీ ప్రభుత్వం మొండిచేయి చూపించిందన్నారు. 2018 సంవత్సరం పంటనష్ట పరిహారం రూ.930 కోట్లు ఇప్పటికీ మంజూరు చేయలేదన్నారు. దీంతో అనంత రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. అలాంటి రైతులకు న్యాయం జరిగేలా టీడీపీ ముందుండి పోరాటం సాగించాలని నిర్ణయించిందన్నారు. 15 రోజుల పాటు తొలి విడతలో 33 మండలాలలో క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు భరోసా కల్పిస్తామన్నారు.


ఆ తర్వాత నియోజకవర్గాల స్థాయిలో పెద్దఎత్తున రైతులతో కలిసి ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. రాజకీయాలకతీతంగా కలిసివచ్చే ఇతర పార్టీలను ప్రజా, రైతు సంఘాలను కలుపుకొని పోరాటాలు చేస్తామ న్నారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ ఈక్రాప్‌ బుకింగ్‌లో ఉన్న రైతుల జాబితాను వెంటనే సచివాలయాలలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియంను ప్రభుత్వం చెల్లించలేదని శాసన సభలో మంత్రిని నిలదీశామన్నారు. దీంతో రైతులకు చేసిన అన్యాయం ఎక్కడ బయటపడుతుందోనని రాత్రికి రాత్రే రూ.500 కోట్లు ప్రీమియం చెల్లించారన్నారు.


ఇన్సూరెన్స్‌ రాని మండలాలకు పంటనష్ట పరిహారం ఇవ్వాలని కేశవ్‌ డిమాండ్‌ చేశారు. బీకే పార్థసారథి మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు కురవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 12 లక్షల హెక్టారులలో వేరుశనగ పంట సాగు చేశారన్నారు. అధిక వర్షాల వల్ల పచ్చి కరువుతో పూర్తిగా పంట దెబ్బతినిందన్నారు. అయినా జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు రైతుల కష్టాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఆ 33 మండలాలకు పంట నష్టపరిహారం ఇవ్వాలని, బకాయి ఉన్న 2018 నష్టపరిహారం సొమ్మును వెంటనే మంజూరు చే యాలన్నారు. అప్పటి వరకు రైతులకు అండగా రైతు కోసం పేరుతో పోరాటం సాగిస్తామన్నారు. 

Updated Date - 2020-12-11T06:07:48+05:30 IST