నిన్న-నేడు..!

ABN , First Publish Date - 2020-12-28T06:17:32+05:30 IST

టీడీపీ పాలనలో నాటి పాఠశాలల పరిస్థితిని నేడు మారుస్తామని వైసీపీ పాలకులు చేపట్టిన నాడు-నేడు పథకం నవ్వుల పాలవుతోంది. నిన్నటిదాకా ఎన్నెన్నో బీరాలు పలికిన ప్రభుత్వం నేడు చేతులెత్తేస్తోంది.

నిన్న-నేడు..!

నాడు-నేడు పనుల్లో  చేతులెత్తేసిన ప్రభుత్వం

గతంలో రాష్ట్రస్థాయి నుంచే సీపీ మెటీరియల్‌ సరఫరా..

నేడు చేయలేక స్థానికంగా కొనుగోలు చేయాలని ఆదేశాలు

సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు  రూ.124 కోట్లతో ఇండెంట్‌

ఇప్పటి వరకూ వచ్చింది.. రూ.22 కోట్లే..

ఆందోళనలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు

అనంతపురం విద్య, డిసెంబరు 27: టీడీపీ పాలనలో నాటి పాఠశాలల పరిస్థితిని నేడు మారుస్తామని వైసీపీ పాలకులు చేపట్టిన నాడు-నేడు పథకం నవ్వుల పాలవుతోంది. నిన్నటిదాకా ఎన్నెన్నో బీరాలు పలికిన ప్రభుత్వం నేడు చేతులెత్తేస్తోంది. నాడు-నేడు పనులకు సంబంధించిన సామగ్రిని రాష్ట్రస్థాయి నుంచే సరఫరా చేసిన ప్రభుత్వం.. నేడు ‘మీరే కొనుక్కోండి..’ అంటూ మాట తిరగేస్తోంది. దీంతో ఈ పథకం నాడు-నేడు కా దు.. వైసీపీ పాలనలోనే పూటకోమాటతో నిన్న-నేడుగా మారిపోయిందన్న వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ పరిణామంతో జిల్లా యంత్రాంగం అయోమయంలో పడింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పరిస్థితి మరీ దారుణం. ఇప్పటికే ఈ పనుల వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు ఇద్దరు బలయ్యారు. మెటీరియల్‌ బాధ్యతలు కూడా ఇక్కడికే అప్పజెబితే పరిస్థితిని ఊహించలేమన్న ఆందోళన వారి నుంచి వ్యక్తమవుతోంది. నాడు-నేడు పనుల విషయంలో ప్రభుత్వం రోజుకో మాట, పూటకో నిర్ణయం తీసుకుంటుండటంతో ప్రధానోపాధ్యాయులపై మరింత ఒత్తిడి పెరిగింది. గతంలో సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (సీపీ) మెటీరియల్‌ను రాష్ట్రస్థాయి నుంచే సరఫరా చేస్తామని చెప్పి, అరకొరగా అందించారు. ఇప్పుడు మీరే కొనుక్కోండంటూ కొత్త పలుకులు పలుకుతున్నారు. ఫలితంగా పనుల్లో మరింత గందరగళం ఏర్పడుతోంది. జిల్లావ్యాప్తంగా నాడు-నేడు స్కూళ్లకు సీపీ మెటీరియల్‌కు రూ.124 కోట్లతో ఇండెంట్‌ పంపగా.. ఇప్పటివరకూ రూ.22 కోట్ల విలువైన మెటీరియల్‌ మాత్రమే సరఫరా చేశారు. తాజాగా ఇంతవరకూ రాని మెటీరియల్‌ మీరే కొనుక్కోండంటూ చెబుతుండటంతో కొత్త సమస్యలు తలెత్తున్నాయి.


ఇచ్చింది గోరంత.. రావాల్సింది కొండంత..

నాడు-నేడుకు ఎంపికైన పాఠశాలలకు సెంట్రల్‌ ప్రొ క్యూర్‌మెంట్‌ కింద పలు రకాల మెటీరియల్‌ రాష్ట్రస్థాయి నుంచి సరఫరా చేస్తారు. నిబంధనల మేరకు సరఫరా చేయాల్సిన దాంట్లో కొంతే సరఫరా చేశారు. తాగునీటి ఆర్వో యూనిట్లు 873 స్కూళ్లకుగాను ఒక్కటి కూడా ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


రూ.22 కోట్ల మెటీరియల్‌

జిల్లావ్యాప్తంగా సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబం ధించి రూ.124 కోట్లతో ఇండెంట్‌ పంపారు. మొదటి నుంచి మెటీరియల్‌ సరఫరాపై విమర్శలు వస్తున్నాయి. సరఫరాదారులు మీనమేషాలు లెక్కించినా.. పైస్థాయి నుంచే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం స్కూళ్ల లో ఫిజికల్‌ వర్కులు పూర్తి కావస్తున్నా.. సీపీ మెటీరియల్‌ సరఫరా మాత్రం కొలిక్కి రావటం లేదు. రూ.124 కోట్ల మెటీరియల్‌కుగాను ఇప్పటి వరకూ రూ.22 కోట్ల మెటీరియల్‌ మాత్రమే జిల్లాకు చేరినట్లు సమగ్రశిక్ష అధికారులు చెబుతున్నారు. ఏడాదిగా జాప్యం చేస్తూ వచ్చి.. ఇప్పుడు స్థానికంగా మీరే కొనుక్కోవాలంటూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


మరింత ఒత్తిడి ఖాయం

నాడు-నేడు పనుల వల్ల ప్రధానోధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల ప్రజాప్రతినిధులు, అ ధికార పార్టీ నాయకులు గుడ్‌విల్‌, డబ్బు కోసం భారీగా బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అధికారుల నుంచి ఒత్తిడి, మరోవైపు అధికార పార్టీ నేతల బెదిరింపుల నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఇద్దరు ప్రధానోధ్యాయులు బలయ్యారు. తాజాగా సీపీ మెటీరియల్‌ కొనుగోలు చేయాలంటూ ఆదేశాల నేపథ్యంలో ఆ మెటీరియల్‌ సైతం తాము చెప్పిన వారి వద్దే కొనాలంటూ ఆ పార్టీ నేతలు, పీసీ చైర్మన్ల నుంచి ఒత్తిళ్లను భరించాల్సి వస్తుందంటూ నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-12-28T06:17:32+05:30 IST