ముఖ్యమంత్రీ..! నీ పౌరుషం ఏమైంది ?

ABN , First Publish Date - 2020-10-31T09:53:17+05:30 IST

మాట తప్పం మడమ తిప్పం అని చెప్పే ముఖ్యమంత్రీ.. పోలవరం విషయంలో నీ పౌరుషం ఏమైంది’ అని వైఎస్‌ జగన్‌ను అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు.

ముఖ్యమంత్రీ..! నీ పౌరుషం ఏమైంది ?

సీఎం స్వార్థం వల్లే ఉరికంబానికి పోలవరం 

వైసీపీ విషప్రచారమే జీవనాడికి శాపం

మాజీ మంత్రి కాలవ ఫైర్‌

కేసుల భయం పక్కన పెట్టి కేంద్రాన్ని 

నిలదీయాలని హితవు


అనంతపురం వైద్యం, అక్టోబరు 30 : మాట తప్పం మడమ తిప్పం అని చెప్పే ముఖ్యమంత్రీ.. పోలవరం విషయంలో నీ పౌరుషం ఏమైంది’ అని వైఎస్‌ జగన్‌ను అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు ఆలం నరసానాయుడు, ఎంఎస్‌ రాజు, బీవీ వెంకటరాముడులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ స్వార్థం, అనాలోచిత నిర్ణయాలు, కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్థత వల్ల జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్‌ భవిష్యత్‌ ఉరికంబానికి ఎక్కిందన్నారు. స్వయంగా కేంద్రం ఒప్పుకున్న ప్రతిపాదనలు కూడా ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రాజెక్టు నిర్మాణనికి రూ.57 వేల కోట్లు అవసరమని టీడీపీ హయాంలో ప్రతిపాదించగా కేంద్రం రూ.47725 కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు. తాజాగా కేంద్రం ఈ అంచనాను భారీగా తగ్గించడం రాష్ట్ర భవిష్యత్‌కు గొడ్డలిపెట్టు అన్నారు. కేంద్రం ఇంతటి దుర్మార్గం, అన్యాయం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించలేదు. 22 మంది వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరంలో అవినీతి అంటూ తొలి నుంచి వైసీపీ చేసిన విష ప్రచారం వల్లే ఈ రోజు  కేంద్రం నిధులు తగ్గించినా సీఎం నోరు మెదపలేకపోతున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పెరగడంతో పునరావాస పరిహారం అంచనా పెరిగిందన్నారు. చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని తప్పుడు ఆరోపణలతో ఈరోజు పోలవరంను నాశనం చేశారని వైసీపీపై కాలవ మండిపడ్డారు. నీ స్వార్థం,  కేసుల భయం పక్కన బెట్టి కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి. నిధులు రాబట్టి జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ను కాలవ డిమాండ్‌ చేశారు.

Read more