సరిహద్దు తేలేనా..?

ABN , First Publish Date - 2020-10-28T09:26:41+05:30 IST

అంతర్రాష్ట్ర సరిహద్దుల వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటి వరకు కమిటీలు రావటం, కొండలు ఎక్కి చూడటం, వెనుదిరిగి వెళ్లటంతోనే సరిపెడుతున్నారు.

సరిహద్దు తేలేనా..?

 ఇరురాష్ట్రాల హద్దుల గుర్తింపునకు కసరత్తు..

 రావటం, పోవటంతో సరిపెట్టిన కమిటీ..

 గల్లంతైన పిల్లర్లు..

  ఐదు కిలోమీటర్ల వివాదానికి 17 కిలోమీటర్లతో ముడి..

  అడ్డు తగులుతున్న మైనింగ్‌ మాఫియా..

  కేంద్రం స్థాయిలో చక్రం తిప్పుతున్న సూత్రధారి..


రాయదుర్గం, అక్టోబరు 20: అంతర్రాష్ట్ర సరిహద్దుల వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటి వరకు కమిటీలు రావటం, కొండలు ఎక్కి చూడటం, వెనుదిరిగి వెళ్లటంతోనే సరిపెడుతున్నారు. పదేళ్లు దాటుతున్నా సరిహద్దు వివాదానికి మాత్రం తెరదించలేకపోతున్నారు. డీ హీరేహాళ్‌ వద్దగల ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు వివాదం విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదనే వాదన వినిపిస్తోంది. సరిహద్దులు తేలకుండా కీలక సూత్రధారి ఒకరు బలంగా చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుప్రీం కోర్టు విధించిన గడువులోగా సరిహద్దులను గుర్తించటంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఈ వివాదానికి కేంద్రం చెక్‌ పెట్టేందుకు ప్రయత్నించినా జాతీయస్థాయిలో నాన్చుడు ధోరణి దిశగా విశ్వ ప్రయత్నాలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  దీంతో ప్రస్తుతం చేపడుతున్న సర్వే ప్రక్రియ కూడా కొనసాగి, చివరలో తేల్చలేకపోయామనే స్వరం వినిపిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర కమిటీలు నాలుగు సార్లు పర్యటించి, సరిహద్దు గ్రామాలను పరిశీలించి, అధ్యయనం చేయటంతోనే సరిపెట్టినట్లు తెలుస్తోంది.


17 కిలోమీటర్ల పొడవు సరిహద్దు ప్రాంతం ఉన్నప్పటికీ ఐదు కిలోమీటర్లలో మాత్రమే పూర్తిగా హద్దులు చెల్లాచెదురైనట్లు కనిపిస్తోంది. లీజు పొందిన మైనింగ్‌ ప్రాంతంతో పాటు సరిహద్దులో ఉన్న ప్రాంతాలను కూడా తవ్వేసి హద్దులను చెరిపేయటంతో సమస్య తలెత్తింది. ఓబుళావురం మైనింగ్‌ ప్రాంతంలోని సరిహద్దు వివాదం తేల్చితే అక్రమాలు రుజువవుతాయనే కారణంతో నాన్పుడు ధోరణి అవలంబిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మళ్లీ మొదలుపెట్టిన సర్వే ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభిస్తుండటంతో గతంలో నియమించిన కమిటీలు, అప్పట్లో  చేసిన సర్వేల పరిస్థితిపై మాత్రం ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఎలాంటి స్పష్టత లేకపోవటం తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా వివాదం అలాగే ఉంటుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 


మైనింగ్‌ తవ్వకాలతో మొదలైన సమస్య

డీ హీరేహాళ్‌ మండలంలోని ఇనుప ముడి ఖనిజపు కొండల్లో ప్రభుత్వం తవ్వకాలకు అనుమతులిచ్చింది. ఇచ్చిన నాటి నుంచి ప్రశాంతంగా తవ్వకాలు సాగిస్తూ వచ్చారు. 2008 నుంచి దేశంలో ఇనుప ముడి ఖనిజానికి డిమాండ్‌ పెరగటంతో ఇక్కడి కొండల ప్రాధాన్యత పెరిగింది. ఒక్కసారిగా ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి చెందిన మూడు గనులతోపాటు బీఐఓపీ, అనంతపురం మైనింగ్‌ కార్పొరేషన్‌, వై మహాబళేశ్వరప్ప లాంటి కంపెనీలు లీజు తీసుకుని తవ్వకాలు చేపట్టాయి. లీజుల సరిహద్దులను ధ్వంసం చేసి, భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టడం, అక్రమాలకు పాల్పడటంతో గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్‌లో దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న సరిహద్దు ప్రాంతంలోని ఇనుప గనుల మైనింగ్‌ కొండల్లో సాగుతున్న అక్రమాలపై సమాజ్‌ పరివర్తన సముదాయ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది.


ఆ పాటికే లోకాయుక్త నివేదిక ప్రకారం అమలు చేయాలని కోరింది. కేంద్ర సాధికారిక కమిటీని ఆదేశిస్తూ లోకాయుక్త ప్రతిపాదించిన అంశాలను విచారించి, గనుల అక్రమాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. గనులన్నింటిలో తవ్వకాలు నిలిపేయాలని సూచించింది. ఆ పాటికే ప్రభుత్వాలిచ్చిన లీజు ప్రాంతాల్లోని గ్రామాలు, కొండలు, రాష్ట్రాల సరిహద్దులను సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. ఇష్టానుసారంగా తవ్వకాలు చేసి, రూ.వేలకోట్ల విలువైన ఖనిజాన్ని పోర్టులకు తరలించి, సొమ్ము చేసుకున్నారు. దీనిపై పెద్దఎత్తున దుమారం రేగినా అంతిమంగా సుప్రీం కోర్టులో ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదంతో ముడిపడి ఉందని చెప్పటంతో కోర్టు సరిహద్దు వివాదాన్ని తేల్చి హద్దులను గుర్తించాలని 2013లో ఆదేశించింది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల సమక్షంలో కేంద్ర సాధికారిక కమిటీ నేతృత్వంలో సర్వే ఆఫ్‌ ఇండియా హద్దులను తేల్చాలని ఆదేశించింది. కాగా  నాలుగు సార్లు సర్వే కోసం క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం రావటం, కొలవటం, సాధ్యం కాదని వెనక్కెళ్లటం పరిపాటిగా మారింది.


వివాదమంతా ఆ ఐదు కిలోమీటర్లే..

ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదం 17 కిలోమీటర్ల పొడవులో మాత్రమే ఉంది. అందులోనూ మైనింగ్‌ చేపట్టిన ఐదు కిలోమీటర్ల ప్రాంతం ప్రధానమైనది. బళ్లారి రిజర్వ్‌ ఫారెస్టు, మెంచిరి, డీ హీరేహాళ్‌ రిజర్వ్‌ ఫారెస్టులు మూడు కొండల్లో ఉన్నాయి. అంతర గంగమ్మ, తిమ్మప్ప, సుంకులమ్మ కొండల్లో 17 కిలోమీటర్ల పొడవులో సరిహద్దు ఉంది.  అంతరగంగమ్మ కొండలో ఓఎంసీ-3, సుంకులమ్మ కొండలో బీఐఓపీ, వైఎం, ఓఎంసీ 2, ఏఎంసీ, తిమ్మప్ప కొండలో మహబూబ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ, హింద్‌ ట్రేడర్స్‌, ఎన్‌ రత్నయ్య, టీ నారాయణరెడ్డి గనులున్నాయి. డీ హీరేహాళ్‌ మండలంలోని మల్పనగుడి, సిద్ధాపురం గ్రామాల సరిహద్దులో అంతరగంగమ్మ కొండ, ఓబుళాపురం, సిద్ధాపురం గ్రామాల సరిహద్దుల్లో సుంకులమ్మ కొండ ఉన్నాయి. కర్ణాటకలోని టుమిటి, విఠలాపురం గ్రామాలకు ఆనుకుని తిమ్మప్ప కొండ, అలకుంది, వన్నళ్లి, బెళగల్లు గ్రామాలకు సరిహద్దులో సుంకులమ్మ కొండలున్నాయి.


ఈ కొండ ప్రాంతాల్లో సరిహద్దు వివాదం కొనసాగుతోంది. అంతరగంగమ్మ, సుంకులమ్మ కొండల్లో ఐదు కిలోమీటర్ల పొడవులోని సరిహద్దు వివాదం ప్రధానమైనది. ఇది ఇరురాష్ట్రాల అధికారులకు సవాలుగా మారింది. ఈ ఐదు కిలోమీటర్లలో మైనింగ్‌ తవ్వకాలు చేపట్టడం, సరిహద్దు రాళ్లు గల్లంతవ్వటంతో ఏ మాత్రం హద్దులు తేల్చినా వందల కోట్ల ముడి ఖనిజానికి సంబంధించిన అక్రమాలు బట్టబయలయ్యే అవకాశముంది. దీంతో ఇక్కడకు వచ్చే పాటికి అధికారులు మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 17 కిలోమీటర్ల పొడవులో సరిహద్దు రాళ్లు 130 దాకా ఉన్నప్పటికీ.. వాటిలో 30కిపైగా పాయింట్లు పూర్తిగా గల్లంతైనట్లు తెలుస్తోంది.


కుదరని ఏకాభిప్రాయం

సరిహద్దు వివాదాన్ని తేల్చేందుకు జీపీఎస్‌ రీడింగ్‌పై ఆధారపడతారు. జీటీఎస్‌ పాయింట్ల ఆధారంగా ట్రైజంక్షన్‌, బై జంక్షన్‌ పాయింట్లతో ముడిపెట్టి జీటీఎస్‌ పాయింట్లను గుర్తిస్తారు. 1953లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచే మైనింగ్‌ తవ్వకాలకు ప్రభుత్వాలు లీజులిచ్చాయి. ఆ సమయంలోనే ఎవరికి ఎన్ని హెక్టార్ల లీజు అనే అంశాన్ని చిత్ర పటాల ద్వారా, క్షేత్రస్థాయిలో పిల్లర్లను ఏర్పాటు చేయించి, కేటాయిస్తారు. 2006 వరకు సరిహద్దు సమస్య తలెత్తలేదు. విలువైన ముడి ఖనిజం తవ్వకాల్లో లభించటంతో ఒక్కసారిగా సరిహద్దు వివాదం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఆంధ్ర, కర్ణాటకలో ఉన్న సరిహద్దు గ్రామాల హద్దులు కూడా తేల్చలేకపోతున్నారు. గ్రామాలు, కొండల సరిహద్దులు గుర్తించలేకపోతున్నారు. వీటిని తేల్చినా.. లీజు ప్రాంతాల సరిహద్దులు నిర్ధారించలేకపోతున్నారు. ఒకదానికొకటి హద్దులు ముడిపడి ఉండటంతో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి హద్దులు గుర్తించే విషయం పెను సవాలుగా మారింది.


ప్రాథమికంగా సర్వే చేయించి, గ్రామాల హద్దులు తేల్చే పనిలో అధికారులున్నారు. దీంతోపాటు సరిహద్దుల జీపీఎస్‌, ట్రైజంక్షన్‌, బై జంక్షన్‌ పాయింట్లను గుర్తించినా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. జీపీఎస్‌ రీడింగ్‌ను పరిశీలిస్తే క్షేత్రస్థాయి, చిత్రపటాలు, ఇరురాష్ట్రాల అధికారులతో ఉండే రీడింగులకు పొంతన లేక గతంలో అధికారులు తలలు పట్టుకున్నట్లు తెలిసింది. 17 కిలోమీటర్లలో సరిహద్దు వివాదం నిగ్గు తేలాల్సి ఉంది. ఇందులో ఎనిమిది కిలోమీటర్ల వరకు నో మైన్‌ జోన్‌ ఉండటంతో అందులో ఎలాంటి అభ్యంతరాలుండవు. సమస్య అంతా తవ్వకాలు చేసిన ప్రాంతంలోనే వస్తోంది.


చక్రం తిప్పుతున్న సూత్రధారి..

మైనింగ్‌ కొండల్లో నెలకొన్న సరిహద్దు వివాదం కొలిక్కిరాకుండా ఓ కీలక వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం తేలితే అవినీతి పూర్తిగా బట్టబయలై రుజువవుతుందనే భయంతో వివాదాన్ని సాగదీస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గడువులిచ్చినా.. వాటిని పొడిగించుకునేందుకు తగిన రీతిలో కారణాలను చూపి, వివాదం అలాగే ఉండేలా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం పూర్తిస్థాయిలో తేల్చే అవకాశం ఉండదని తెలుస్తోంది. రాజకీయ కోణంలో ఈ వివాదం కొందరిని లొంగదీసుకోవడానికి ఉపయోగపడుతుండటంతో దీనిని  ఆయుధంగా మలచుకుని ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. దీంతో కేంద్ర కమిటీ సభ్యులు ప్రస్తుతం చేస్తున్న సర్వే ప్రక్రియ ఒక  అడుగు ముందుకు.... రెండు అడుగులు వెనక్కు.. అన్నట్లు ఉందన్న వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది.  వేస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండేటట్లు అంతిమంగా నిర్ణయాలుంటాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Updated Date - 2020-10-28T09:26:41+05:30 IST