ఇదేమి.. విచిత్రం..!

ABN , First Publish Date - 2020-10-13T10:38:37+05:30 IST

వ్యవసాయ శాఖాధికారుల విచిత్ర నిబంధనలు నల్లరేగడి భూముల రైతులకు శాపంగా మారాయి. రబీ సీజన్‌లో..

ఇదేమి.. విచిత్రం..!

 రెండు పంటలు సాగు చేసుకోవడం తప్పా..

 ప్రోత్సహించాల్సిందిపోయి.. నిరాశపరచడమా..

 నల్లరేగడి భూముల్లో ఖరీఫ్‌లో పంట పెట్టిన రైతులు

 ఆ సాకుతో సబ్సిడీ పప్పుశనగ విత్తనానికి మొండిచేయి

 రబీలో పంట వేస్తామన్నా.. విత్తనం ఇవ్వమంటున్న అధికారులు

 ఖరీ్‌ఫలో పంటను ముంచేసిన వర్షాలు

 ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు..

 పట్టించుకోని ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు


 అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 12:  వ్యవసాయ శాఖాధికారుల విచిత్ర నిబంధనలు నల్లరేగడి భూముల రైతులకు శాపంగా మారాయి. రబీ సీజన్‌లో పప్పుశనగ సాగు చేసుకునే అసలైన రైతులకు సబ్సిడీ విత్తనం దక్కకుండా పోతోంది. ఖరీఫ్‌ సీజన్‌లో ఇతర పంటలు సాగు చేశారన్న సాకుతో తాజాగా పప్పుశనగ పంపిణీకి వ్యవసాయాధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో పప్పుశనగ సాగు చేయాలకునే చిన్న, సన్నకారు రైతులు సబ్సిడీ విత్తనానికి దూరమయ్యే దుస్థితి నెలకొంది.


తాము రబీ సీజన్‌లో పప్పుశనగ సాగు చేసుకుంటామనీ, అందుకు పొలాన్ని కూడా సిద్ధం చేసుకున్నామనీ, అనుమానాలుంటే గ్రామాల్లో విచారించాలని కోరినా అధికారులు స్పందించట్లేదు. దీంతో ఏం చేయాలో తోచని అయోమయంలో అన్నదాతలు పడ్డారు. కరువు జిల్లాలో రెండు సీజన్లలో పంటలు సాగు చేసుకుంటున్న రైతులను ప్రోత్సహించాల్సిన యంత్రాంగం.. ఖరీ్‌ఫలో పంట వేయటమే నేరంగా నిబంధనలు విధించటం విడ్డూరం. ఇదివరకు రైతులకు కావాల్సిన విత్తనాలను సబ్సిడీపై అందించారు.


రబీ సీజన్‌లో పప్పుశనగ సాగు తగ్గించేందుకు ఇతర రకాల పంటల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది రబీ సీజన్‌లో 90 వేల హెక్టార్లలో పప్పుశనగ పంట పెట్టారు. ఈసారి 25 శాతం సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ఇతర రకాల పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనుగుణంగా జిల్లాకు పప్పుశనగ విత్తన కేటాయింపులు తగ్గించారు. గతంలో ఏటా 75వేల క్వింటాళ్లకుపైగా పప్పుశనగ కేటాయిస్తూ వచ్చారు. 70 వేల క్వింటాళ్ల వరకు రైతులకు పంపిణీ చేశారు. ఈ ఏడాది 51 వేల క్వింటాళ్లు కేటాయించటంతోనే సరిపెట్టారు. ఈ పరిస్థితుల్లో లేనిపోని నిబంధనలు తెరపైకి తెచ్చి, రైతుల జాబితాను కుదించేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారన్న వాదనలున్నాయి.


ఇదెక్కడి న్యాయమంటూ అన్నదాతల నిట్టూర్పు

నల్లరేగడి భూముల్లో పప్పుశనగ సాగు చేసే ప్రతి రైతుకీ సబ్సిడీ విత్తనం అందించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కొన్ని మండలాల్లో వ్యవసాయాధికారులు వ్యవహరిస్తున్నారు. యల్లనూరు మండలం వెన్నపూస పల్లిలో 200 మందికిపైగా రైతులు నల్లరేగడి భూముల్లో ఖరీఫ్‌ సీజన్‌లో స్వల్పకాలిక పంటలు సాగు చేసుకున్నారు. కొందరు రైతులకు అరకొర దిగుబడి రాగా.. మరికొందరు నష్టపోయారు.


వరుస వర్షాలతో చేతికొచ్చే పంటలు దెబ్బతినటంతో ఏకంగా దున్నేశారు. తాజాగా రైతు భరోసా కేంద్రాల్లో పప్పుశనగ విత్తనాల కోసం వెళితే ఖరీ్‌ఫలో ఇతర పంటలు వేశారన్న సాకుతో ఆయా రైతుల పేర్లు నమోదు చేయించుకోలేదు. ఖరీ్‌ఫలో పంట వేసినా రబీలోనూ తాము పప్పుశనగ విత్తుకుంటామని అధికారుల ఎదుట మొరపెట్టుకున్నా.. ఏ మాత్రం స్పందించట్లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విచిత్ర నిబంధనలతో వేలాది మంది నల్లరేగడి రైతులు సబ్సిడీ విత్తనానికి దూరమయ్యే దుస్థితి తలెత్తింది.


ప్రభుత్వం సబ్సిడీ ధరలు ఖరారు చేశాక బహిరంగ మార్కెట్‌లో పప్పుశనగ ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం బయట క్వింటాల్‌ ధర రూ.6వేలకు పైమాటే. ఈసారి ప్రభుత్వం సబ్సిడీని 30 శాతం కుదించింది. సబ్సిడీపోను రైతువాటా కింద రూ.5250 చెల్లించాలని నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌లో విత్తన ధరలు ఎక్కువగా ఉండటంతో కొనలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీ్‌ఫలో పంట వేసుకుంటే పప్పుశనగ విత్తనం ఇవ్వమని చెప్పటం అన్యాయమని  నిట్టూరుస్తున్నారు. 


పట్టించుకోని ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం

జిల్లాకు పప్పుశనగ కేటాయింపులు తగ్గించిన నేపథ్యంలో ఎన్నడూలేని కొత్త నిబంధనలు తెరపైకి తేవటాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచిత్ర నిబంధనలు అమలు చేసి, అర్హులైన రైతులకు సబ్సిడీ విత్తనానికి దూరం చేస్తున్నా ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా నల్లరేగడి భూముల్లో నిజంగా పంట సాగు చేసే రైతులకు పప్పుశనగ విత్తనం అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరి ఏ మేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.


నా పేరు నమోదు చేసుకోలేదు: సాంబశివారెడ్డి, రైతు, వెన్నపూసపల్లి, యల్లనూరు మండలం

నాకు 7 ఎకరాల నల్లరేగడి భూమి ఉం ది. ఖరీ్‌ఫలో నాలుగెకరాల్లో పెసర పంట వేశా. రూ.30 వేల దాకా ఖ ర్చు పెట్టినా.. పంట చేతికొచ్చే స మయంలో వర్షాలు పడటంతో ది గుబడి రాలేదు. దీంతో పంటను దు న్నేశా. అదే భూమిలో రబీలో పప్పుశనగ సాగు చేసేందుకు సిద్ధమయ్యా. రైతు భరోసా కేంద్రానికి వెళితే ఖరీ్‌ఫలో పెసర పంట వేసినందుకు విత్తనం ఇవ్వమంటున్నారు. నా పేరు కూడా నమోదు చేసుకోలేదు. సబ్సిడీ విత్తనంపైనే ఆశలు పెట్టుకున్నా. అధికారులేమో ఇవ్వమంటున్నారు. బయట మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.


రైతుల ఆందోళన

నల్లరేగడి భూముల్లో పప్పుశనగ సాగు చేసే ప్రతి రైతుకు పప్పుశనగ విత్తనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని కొన్ని మండలాల్లో అందుకు విరుద్ధంగా వ్యవసాయాధికారులు వ్యవహరిస్తున్నారు. ఖరీ్‌ఫలో పంటల సాగుపై ఈ-కర్షక్‌ యాప్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేశారు. వాటి ఆధారంగా ఖరీ్‌ఫలో ఇతర రకాల పంటలు సాగు చేసిన రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. ఆ జాబితాలోని రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ పప్పుశనగ విత్తనాలు ఇవ్వమని ఖరాకండిగా చెబుతున్నారు.


వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా వి చిత్ర నిబంధనలు అమలు చేయటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 26 మండలా ల్లో నల్లరేగడి భూములున్నాయి. ఆయా పొలాల్లో రబీ సీజన్‌లో పప్పుశనగ సాగు చేస్తున్నారు. కొందరు రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో నల్లరేగడి భూముల్లో స్వల్పకాలిక, చిరుధాన్యాలు సాగు చేశారు. పలు మండలాల్లో పెసర, ఉద్దులు, కొర్రలు, సోయాబీన్‌ తదితర పంటలు సాగు చేశారు.


ఈసారి ముందస్తు వర్షాలు పడటంతో వేరుశనగ సాగు చేశారు. ఆ తర్వాత వరుస వర్షాలతో పంట నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ఖరీ్‌ఫలో పంటను కొందరు రైతులు తొలగించారు. మరికొందరికి అరకొరగా దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఖరీ్‌ఫలో వేసిన పంటను తొలగించి, రబీలో పప్పుశనగ విత్తుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు కూడా పూర్తి చేసుకున్నారు.

Updated Date - 2020-10-13T10:38:37+05:30 IST