అధికార దౌర్జన్యం!

ABN , First Publish Date - 2020-10-07T09:01:03+05:30 IST

మండలంలోని పులేటిపల్లిలో కొందరు అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది.

అధికార దౌర్జన్యం!

పులేటిపల్లిలో వైసీపీ నేతల ఆగడాలు

 పేదల ఇంటిస్థలాల ఆక్రమణ

 ప్రశ్నించిన వారిపై బెదిరింపుల పర్వం

 న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామంటున్న లబ్ధిదారులు

 స్థలాలు లాక్కోవటం అన్యాయం: టీడీపీ


చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 6: మండలంలోని పులేటిపల్లిలో కొందరు అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి ఏదో రకంగా టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడటం, శిలాఫలకాలను ధ్వంసం చేయడం వంటివి సాధారణమయ్యాయి. తాజాగా గ్రామంలో పేదల ఇంటి స్థలాలపై కన్నేశారు. వాటిని దౌర్జన్యంగా ఆక్రమించి, పునాదులు తవ్వేశారు.


విషయం తెలుసుకుని ప్రశ్నించిన పేద లబ్ధిదారులపై ఎదురుదాడికి దిగారు. 2017లో గ్రామంలో 100 మందికిపైగా పేదలకు ఇంటి స్థలాలను కేటాయించారు. అప్పట్లో ఇళ్లు మంజూరైన వారు గృహాలను నిర్మించుకోగా, మరికొందరు పునాదులు వేసుకున్నారు. ఇళ్లు మంజూరు కాని ఇంకొందరి ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటిపై కన్నేసిన కొందరు వైసీపీ నేతలు తమ అనుచరులకు కేటాయిస్తూ పునాదులు తవ్వించారు. వారిని అడ్డగించే ప్రయత్నం చేసిన తమపైన దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని లబ్ధిదారులు లక్ష్మీదేవి, రామలక్ష్మమ్మ, ధనలక్ష్మి, అనసూయమ్మ, లక్ష్మీదేవి, ముత్యాలమ్మ, యశోదమ్మ, చంద్రమ్మ, కవిత తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.


అధికారుల నుంచి నోటీసులు అందలేదనీ, అలాంటప్పుడు ఎలా ఆక్రమించుకుంటారని వారు ప్రశ్నించారు. గతంలో ఇళ్లు మంజూరు కాలేదనీ, ఇపుడైనా మంజూరుచేస్తే కట్టుకుంటామన్నారు. పేదవారికి అన్యాయం చేయడం తగునా అని వారు వాపోయారు. అధికారులైనా కలుగజేసుకుని, న్యాయం చేయకపోతే ఇచ్చిన స్థలాల్లోనే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. పేదల స్థలాలను లాక్కోవటంపై టీడీపీ స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చొరవ తీసుకుని, న్యాయం చేయకపోతే ఆందోళనలు చేపడతామని టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, రామస్వామి, వెంకటేశులు, గోపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి హెచ్చరించారు.


ఆత్మహత్యలే శరణ్యం: రామలక్ష్మమ్మ, బాధితురాలు

నాకు ఇంత వరకు పక్కా ఇల్లు లేదు. నాలుగేళ్ల క్రితం స్థలం ఇచ్చారు. ఇల్లు మంజూరు కానందున కట్టుకోలేకపోయా. నాకున్న స్థలాన్ని లాక్కుంటే పురుగులమందు తాగి, ఆత్మహత్య చేసుకోవటం తప్పా.. మరో మార్గం లేదు.


దౌర్జన్యంగా స్థలాలను లాక్కుంటున్నారు: చంద్రమ్మ, బాధితురాలు

నోటీసు ఇవ్వలేదు. మా స్థలాలను తీసుకుంటున్నట్టు అధికారులెవరూ చెప్పలేదు. గ్రామంలో కొందరు అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా స్థలాలను లాక్కుంటున్నారు.


అన్యాయం: రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌

2017లో పేదలకు పట్టాలిచ్చారు. ఇళ్లు మంజూరు కాకపోవడంతో పలువురు కట్టుకోలేకపోయారు. పేదలకు చెందిన స్థలాలను అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకోవడం తీవ్ర అన్యాయం. అధికారులు న్యాయం చేయాలి. లేకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం.


పట్టాలను రద్దు చేయలేదు: ప్రసన్నకుమార్‌, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌

పులేటిపల్లిలో ప్రభుత్వం ఇచ్చిన పాతపట్టాలను రద్దు చేయలేదు. వాటి స్థానంలో కొత్తవారికి ఇవ్వలేదు. ఇంటి స్థలాలను ఆక్రమించుకున్న విషయం మా దృష్టికి రాలేదు. ఫిర్యాదు వస్తే విచారణ చేపడతాం.

Updated Date - 2020-10-07T09:01:03+05:30 IST