అంగట్లో అంగన్‌వాడీ పోస్టులు

ABN , First Publish Date - 2020-10-03T11:35:54+05:30 IST

అంగన్‌వాడీ పోస్టులు రాజకీయ దళారులకు కాసులు కురిపిస్తున్నాయి. తమ నేతల పేరు చెప్పి పోస్టులు ఇప్పిస్తామంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో అంగన్‌వాడీలు కీలకంగా మారాయి. సిబ్బందికి వేతనాలు పెంచారు.

అంగట్లో అంగన్‌వాడీ పోస్టులు

 మొదలైన పైరవీలు

 రంగంలోకి దిగిన రాజకీయ దళారీలు

  వర్కర్‌కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు

 హెల్పర్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు

 అభ్యర్థులతో బేరాలు


అనంతపురం వైద్యం, అక్టోబరు 2: అంగన్‌వాడీ పోస్టులు రాజకీయ దళారులకు కాసులు కురిపిస్తున్నాయి. తమ నేతల పేరు చెప్పి పోస్టులు ఇప్పిస్తామంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో అంగన్‌వాడీలు కీలకంగా మారాయి. సిబ్బందికి వేతనాలు పెంచారు. ఇతర వసతులు పొందుతున్నారు, దీంతో ఈ పోస్టుల  కోసం పోటీ పెరిగింది. ప్రభుత్వం జిల్లాలో ఖాళీగా ఉన్న 654 అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేస్తోంది. వీటిలో 92 ప్రధాన అంగన్‌వాడీ కార్యకర్తలు, 53 మినీ కార్యకర్తలు, 509 హెల్పర్‌ పోస్టులున్నాయి. వీటి ఎంపికకు ఈనెల 5వ తేదీ నుంచి డివిజన్ల వారీగా 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పోటీ పెరగటంతో పైరవీలు మొదలయ్యాయి. దీన్ని ఆసరా చేసుకొని, దళారులు రంగంలోకి దిగారు. పోస్టు కావాలంటే డబ్బు ఇవ్వాలని బేరాలు ఆడుతున్నారు.


పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులతో ఎంత ఎక్కువ వీలైతే అంత డబ్బు వసూలు చేసుకోవాలని దళారులు చూస్తున్నారు. వర్కర్‌ పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు, హెల్పర్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బేరాలు సాగిస్తున్నట్లు చర్చ సాగుతోంది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోస్టుల బేరాలు బహిరంగంగానే సాగుతున్నాయని చర్చించుకుంటున్నారు. దళారులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల పేరు చెప్పి, బేరం సాగిస్తుండటం గమనార్హం. హిందూపురం పార్లమెంటు పరిధిలో కూడా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాగే ఎ మ్మెల్యే పేరుతోనే అంగన్‌వాడీ పోస్టులకు రాజకీయ దళారులు బేరాలు సాగిస్తున్నట్లు సమాచారం.


  బేరం కుదుర్చుకున్న తర్వాత అభ్యర్థుల నుంచి అడ్వాన్స్‌గా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంటర్వ్యూలకు ముందే అభ్యర్థులను ఎంపిక చేసి, జాబితాను అధికారులకు నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ద్వారా పంపించేలా చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో అధికార యంత్రాంగం ప్రతిభ, నిబంధనలకు ప్రాధాన్యమిస్తుందా, పైరవీలకు తలొగ్గుతుందా అనే దానిపై అందరి దృష్టి పడింది.

Updated Date - 2020-10-03T11:35:54+05:30 IST