రబీపై గంపెడాశలు..!

ABN , First Publish Date - 2020-10-03T11:33:59+05:30 IST

ఆశించిన స్థాయిలో ఖరీఫ్‌ ఫలితాన్ని ఇవ్వకపోవటంతో జిల్లా రైతులు రబీపై గంపెడాశలు పెట్టుకున్నారు. రబీ సీజన్‌ ప్రారంభమైంది.

రబీపై గంపెడాశలు..!

 మొదలైన సీజన్‌..

 పదును వర్షాలతో అన్నదాతల్లో ఆనందం 

 పొలం ఆరితే విత్తుకు సన్నద్ధం 

 ఖరారు కాని పప్పుశనగ ధరలు

  పంపిణీపై తొలగని సందిగ్ధం..


 అనంతపురం వ్యవసాయం, అక్టోబరు2: ఆశించిన స్థాయిలో ఖరీఫ్‌ ఫలితాన్ని ఇవ్వకపోవటంతో జిల్లా రైతులు రబీపై గంపెడాశలు పెట్టుకున్నారు. రబీ సీజన్‌ ప్రారంభమైంది. ఈసారి సీజన్‌కు ముందస్తుగానే వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పొలాలు పదునయ్యాయి. తేమ ఆరితే విత్తనం వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రబీ సీజన్‌లో జిల్లాలోని 27 మండలాల్లో నల్లరేగడి భూముల్లో ఎక్కువ శాతం పప్పుశనగ సాగు చేస్తారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.20 లక్షల హెక్టార్లు.


అందులో పప్పుశనగ 75 వేల హెక్టార్లుగా ఉంది. గతేడాది 90 వేల హెక్టార్లల్లో పప్పుశనగ సాగు చేశారు. ఈసారి కూడా అదేస్థాయిలో సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు అభిప్రాయ పడుతున్నారు.


పప్పుశనగ విత్తన పంపిణీపై వీడని సందిగ్ధం

ఏటా అక్టోబరు మొదటి వారంలో సబ్సిడీ విత్తన పప్పుశనగ పంపిణీ చేసేవారు. ఈసారి సబ్సిడీ తగ్గించటంతో రైతులపై అదనపు భారం పడనుంది. గతేడాది క్వింటాల్‌ పప్పుశనగ పూర్తి ధర రూ.6,200గా ఉంది. అందులో 40 శాతం సబ్సిడీ రూ.2480పోను క్విం టాల్‌ విత్తనానికి రైతు వాటా కింద రూ.3720 కట్టించుకున్నారు. రబీ సీజన్‌ ఆరంభమవుతున్నా ఈ ఏడాది ఇంకా విత్తన ధరలు ఖరారు చేయలేదు. ముందస్తుగా సబ్సిడీ ధరను నిర్ణయించారు. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే విత్తనం పంపిణీ చేయాలని నిర్ణయించారు.


ఏపీ సీడ్స్‌కు విత్తన సరఫరా బాధ్యతలు అప్పగించారు. ధరలు ఎప్పుడు ఖరారు చేస్తారో, విత్తన పంపిణీ ఎప్పుడు చేపడతారో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొందరు రైతులు బహిరంగ మార్కెట్‌లో విత్తనాలు కొని, సిద్ధం చేసుకున్నారు. మరికొందరు సబ్సిడీ విత్తనం కోసం ఎదురు చూస్తున్నారు.


వ్యవసాయ శాఖ ప్రణాళికలు ఫలించేనా..? 

రబీ సీజన్‌లో పప్పుశనగకు బదులు 25 శాతం విస్తీర్ణంలో ఇతర రకాల పంటలు సాగు చేయించాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధ చేసింది. ఆ మేరకు రైతుల్లో అవగాహన కల్పించి, క్షేత్రస్థాయిలో అమలు చేయటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రబీ సీజన్‌లో 90496 హెక్టార్లలో పప్పుశనగ సాగు చేశారు. ఈ ఏడాది 75 శాతం విస్తీర్ణంలో పప్పుశనగ వేసుకుని, మిగిలిన 25 శాతం విస్తీర్ణంలో జొన్నలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, తెల్లకుసాలు, ధనియాలు, స్వల్ప కాలిక కంది, పెసలు విత్తుకోవాలని ప్రతిపాదించారు.


ఇందులో భాగంగా జిల్లాలో 22624 హెక్టార్లలో (25 శాతం విస్తీర్ణం) సాగు చేసేందుకు ఇతర రకాల పంటల విత్తనాలు 2198 క్వింటాళ్లు అవసరమని భావిస్తున్నారు. ఇందులో 9955 హెక్టార్లలో జొన్నలు 747, 1148 హెక్టార్లలో మొక్కజొన్న 230, 3103 హెక్టార్లల్లో పొద్దుతిరుగుడు 202, 2725 హెక్టార్లల్లో తెల్లకుసాలు 272, 2675 హెక్టార్లలో ధనియాలు 401, 2635 హెక్టార్లల్లో స్వల్ప కాలిక కంది 263, 410 హెక్టార్లలో పెసలు 82 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదించారు. ఆ మేరకు ఇతర రకాల పంటల విత్తనాలు సబ్సిడీతో పంపిణీ చేయటంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ప్రణాళికలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Updated Date - 2020-10-03T11:33:59+05:30 IST