ఎమ్మెల్యేలు చెప్పిన వారికే మినీట్రక్కులు..!
ABN , First Publish Date - 2020-12-17T06:57:40+05:30 IST
మినీ ట్రక్కులకు అభ్యర్థుల ఎంపికలో అర్హతకు తిలోదకాలిచ్చి, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అన్నీ తమ వారికే దక్కాలనీ, ఇతరులకు అవకాశమిస్తే ఆ సీట్లలో ఉండరంటూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు.. అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో అధికారులు చేసేది లేక నామమాత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు.

అభ్యర్థుల ఎంపికలో అన్నీ సిఫార్సులే
రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యం
నామమాత్రంగా ఇంటర్వ్యూలు
అర్హులకు నిరాశ
ఎంపిక జాబితా ప్రకటించటంలో జాప్యం
జిల్లాకు 754 మినీ ట్రక్కుల కేటాయింపు
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 16: మినీ ట్రక్కులకు అభ్యర్థుల ఎంపికలో అర్హతకు తిలోదకాలిచ్చి, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అన్నీ తమ వారికే దక్కాలనీ, ఇతరులకు అవకాశమిస్తే ఆ సీట్లలో ఉండరంటూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు.. అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో అధికారులు చేసేది లేక నామమాత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాబితా మాత్రం ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల నుంచి రావటం గమనార్హం. ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా ఆమోదముద్ర వేసుకున్న ఎంపిక జాబితాను ప్రకటించటంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీనికి కారణం రెండు, మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను మార్చాలని ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు చేస్తుండటమే. దీంతో అధికారులు తలలు బాదుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా ప్రకటించవద్దనీ, పూర్తిస్థాయిలో అభ్యర్థుల పరిశీలన తరువాతే ప్రకటించాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులు.. అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఓ అధికారిని ఉన్నఫలంగా సొంత శాఖకు పంపారు. దీంతో అధికారుల్లో దడ మొదలైంది. పేదలకు జనవరి నుంచి ఇంటింటికీ సబ్సిడీ బియ్యం పంపిణీ చేసేందుకు అవసరమైన నాలుగు చక్రాల మినీ ట్రక్కు మొబైల్ వాహనాలను రాయితీపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు పంపిణీ చేయడానికి అభ్యర్థుల ఎంపికకు ప్రకటన ఇచ్చారు.
జిల్లాకు 754 మినీట్రక్కులు
జిల్లాకు 754 మినీట్రక్కులు కేటాయించారు. ఇందులో బీసీలకు 360, ఈబీసీలకు 126, ఎస్సీలకు 158, ఎస్టీలకు 39, మైనార్టీలకు 68, క్రైస్తవులకు 3 యూనిట్లు కేటాయించారు.. లబ్ధిదారులకు పలు నిబంధనలు విధించారు. మినీట్రక్కులకు సంబంధించి కార్పొరేషన్ సబ్సిడీ 60 శాతం, బ్యాంకు రుణం 30 శాతం, లబ్ధిదారుడి వాటా 10 శాతంగా ఉంటుంది. వాహన ఖరీదు రూ.5.18 లక్ష లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా మండలాల స్థాయిలో డిసెంబరు 4వ తేదీన గ్రామీణ ప్రాంతాల్లో ఆయా మండలాల్లో ఎంపీడీఓ, బ్యాంకరు, రవాణా శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల అధికారులు లబ్ధిదారుల ఎంపిక కమిటీలో ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎంపీడీఓల స్థానంలో కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేశారు. ఈబీసీకి కేటాయించిన 8 మంది అభ్యర్థులను ఇప్పటికీ ఎంపిక చేయలేదు. మిగిలిన అభ్యర్థుల ఎంపిక లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు.
జాబితా ప్రకటించటంలో జాప్యం
మినీ ట్రక్కు వాహనాల అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటించటంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈనెల 4వ తేదీన అభ్యర్థుల ఎంపికకు ఆయా ఎంపీడీఓలు, మున్సిపాలిటీల కమిషనర్ల కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మరుసటి రోజే ఎంపి క జాబితాను ప్రకటిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. 10 రోజులు గడిచినా పట్టించుకోవట్లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఎంపిక జాబితాను తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదు. అధికారులు జాబితా ప్రకటించటంలో వ్యవరిస్తున్న తీ రుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీలకు కేటాయించాల్సిన స్థానాల్లో బీసీలకు, బీసీల స్థానాల్లో ఎస్టీలకు, ఎస్టీలకు కేటాయించాల్సిన చోట్ల మైనార్టీలకు అవకాశం కల్పించి, అర్హులకు అన్యాయం చేస్తున్నారు. రోస్టర్ పాటించటంలో అధికారులు విఫలమయ్యారని తెలుస్తోంది. ఆయా శాఖల మధ్య సమన్వయలోపం అభ్యర్థులకు శాపంగా మారుతోంది. బియ్యం పంపిణీ చేసే పౌరసరఫరాల శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల మధ్య ఏ మాత్రం సమన్వయం కనబడట్లేదు. అర్హతలను పక్కనపెట్టి, ప్రజాప్రతినిధి ఫైనల్ చేసిన పేరే ఎంపిక జాబితాలో చేరుస్తున్నారు. ఇంత బహిరంగంగా అభ్యర్థుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారమే మినీ ట్రక్కులకు అభ్యర్థులను ఎంపిక చేశాం. త్వరలో ఎంపిక జాబితాను ప్రకటిస్తాం. ఎవరికీ అన్యాయం వాటిల్లదు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించేదిలేదు. ఎంపిక జాబితా ప్రకటించిన అనంతరం అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిశీలించి, న్యాయం చేస్తాం. ఎంపిక జాబితాపై సందేహాలు అనవసరం.
- నాగముని, యుగంధర్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ఈడీలు
