పేదల ప్లాట్లు అన్యులకు కోట్లు

ABN , First Publish Date - 2020-12-28T06:24:46+05:30 IST

నిరుపేదలకు ఇచ్చిన పట్టాల ఆనవాళ్లను చెరిపేసి, వ్యవసాయ భూమిగా మార్చుకుని కొందరు పబ్బం గడుపుకుంటున్నారు.

పేదల ప్లాట్లు అన్యులకు కోట్లు
లేఅవుట్‌ రాళ్లను తొలగించి, సాగు చేస్తున్న భూమి

20 ఏళ్ల కిందట పంచిన నివేశన స్థలాలు మాయం

లే-అవుట్‌ రాళ్లను తొలగించి, సాగుభూమిగా మార్పు

 రూ.కోట్ల ధర పలుకుతున్న ప్రభుత్వ భూమి

కళ్లు మూసుకున్న రెవెన్యూ శాఖ

గుంతకల్లు, డిసెంబరు 27: నిరుపేదలకు ఇచ్చిన పట్టాల ఆనవాళ్లను చెరిపేసి, వ్యవసాయ భూమిగా మార్చుకుని కొందరు పబ్బం గడుపుకుంటున్నారు. పేదలకు ఆ స్థలాలను అప్పగించాల్సిన రెవెన్యూ శాఖ కళ్లకు గంతలు కట్టుకుంది. దాదాపు 250 ఇళ్ల స్థలాలు అక్కడ పంపిణీ చేశారు. ఇప్పుడక్కడ ఏమాత్రం ఆనవాళ్లు లే కుండా చేశారు. అసలు అక్కడ లే-అవుట్‌ అనేదే లేకుం డా మాయం చేశారు. ఇప్పుడా భూమికి విలువ పెరిగిపోవటంతో పట్టాలు పొందిన పేదలకు అన్యాయం వాటిల్లుతోంది.


అనువుగానిచోట స్థలాలిచ్చి..

ప్రభుత్వం 1999 సంవత్సరంలో పట్టణ పేదలకు అను వు గాని చోట కసాపురం రోడ్డులోని మైనార్టీ కాలనీ వెనుక రైల్వే లైన్‌కు అనుకుని ప్రైవేటు భూమిని కొని, పట్టాలు పంపిణీ చేసింది. 259-డీ సర్వే నెంబరులో ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో రిజర్వు సైట్‌, రోడ్లకు స్థలాన్ని వదలగా దాదాపు 250 నివేశన స్థలాలను పేదలకు కేటాయించారు. ఏడడుగులు తవ్వినా గట్టి నేల రాకపోవటంతో ఆ నల్లరేగడి భూమిలో పేదలు కనీసం బేస్‌మెంట్‌ కూడా వేసుకోలేకపోయారు. హౌసింగ్‌ రుణాలు కూడా మం జూరు కాకపోవడంతో పట్టాలను పొందిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను చేపట్టలేదు. దీంతో లే-అవుట్లలో కంప చెట్లు పెరిగిపోయి, కనీసం తమ ప్లాటు ఏదో తెలుసుకోవడానికి సైతం లబ్ధిదారులు లోపలికి వెళ్ల లేని పరిస్థితి ఏర్పడింది. అదే అదనుగా కొందరు అక్కడ పాగావేశారు. కంపలు తొలగించి, భూమిని చదును చేశారు. లే-అవుట్‌ రాళ్లను తొలగించి, ఆక్రమించారు.


రూ.కోట్లకు చేరిన భూమి విలువ

ఇరవై ఏళ్లలో పట్టణ శివారులో భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. ఎకరా దాదాపు రూ.3 కోట్లకు చేరుకుంది. దీంతో ఈ భూమి విలువ రూ.20 కోట్లకు పైబడి పలుకుతోంది. అంత విలువైన భూమిలో తమ పట్టా ఎక్కడో తెలియక నివేశన స్థలాలు పొందిన లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయా రు. దీనికి తోడు రెవెన్యూ కార్యాలయంలో గతంలో పంపిణీ చేసిన భూములకు సంబంధించిన రికార్డులన్నీ గల్లంతయ్యాయి. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారులు తమ వద్ద నివేశన స్థ లాలకు సంబంధించిన పట్టాలను చేతిలో పెట్టుకుని, దిక్కులు చూస్తున్నారు. కబ్జాదారులు మాత్రం యఽథేచ్ఛగా పబ్బం గడుపుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ రామును వివరణ కోరగా.. ఆ సర్వే నెంబరుకు సంబంధించిన సమాచారం తనకు తెలియదనీ, పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Updated Date - 2020-12-28T06:24:46+05:30 IST