హెచ్చెల్సీపై నిర్లక్ష్యం !
ABN , First Publish Date - 2020-12-03T06:16:17+05:30 IST
పాలకులు, అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి, ముందుచూపు లేకపోవడంతో జిల్లా రెండు టీఎంసీల నీటిని నష్టపోవాల్సి వచ్చింది. నీటి యాజమాన్యంపై సమగ్ర అవగాహన లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నట్టు విమర్శలు వినవస్తున్నాయి.

ఆఫ్ అండ్ ఆన్ పద్ధతితో తీవ్ర నష్టం
రెండు టీఎంసీల నీటి వాటాకు గండి
కర్ణాటక ఉచ్చులో ఏపీ యంత్రాంగం
ముందుచూపు లేని అధికారులు
నీటి యాజమాన్యంపై అవగాహనలేని ప్రజాప్రతినిధులు
న్యాయమైన నీటి వాటా కూడా అందుకోలేని దుస్థితి
రాయదుర్గం, డిసెంబరు 2 : పాలకులు, అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి, ముందుచూపు లేకపోవడంతో జిల్లా రెండు టీఎంసీల నీటిని నష్టపోవాల్సి వచ్చింది. నీటి యాజమాన్యంపై సమగ్ర అవగాహన లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నట్టు విమర్శలు వినవస్తున్నాయి. కర్ణాటక తన వాటాను కొంత నిలుపుకుని ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో నీటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తే అదే ఉచ్చులో పడి వారి పద్ధతినే అనుసరించి మరింత నష్టాన్ని చేకూర్చుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు అందాల్సిన నీటిని సకాలంలో తీసుకోవడంలో విఫలమవుతున్నారు. రోజులు పెరుగుతున్నాయే తప్ప కాలువలో నీటి మట్టం పెంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ తీసుకోవాలనే ఆలోచన చేయడం లేదు. దీంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రజాప్రతినిధులకు కాలువ వైపు కన్నెత్తి చూసే తీరిక, ఓపిక లేకపోవడంతో పూర్తిగా ఈ యేడాది నీటి యాజమాన్యంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడుతోంది. ఇప్పటికే తుంగభద్ర జలాశయం 45 రోజుల పాటు నిండుకుండలా ఉండి నదికి వదిలే పరిస్థితి ఉన్నప్పటికీ కనీసం ఆ సమయంలో రెండు వేల క్యూసెక్కు లు కూడా ఆంధ్ర సరిహద్దులో తీసుకోలేని దయనీయ పరిస్థితిలో యంత్రాంగం ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి.
120 రోజుల్లో 18 టీఎంసీలు
తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నుంచి 120 రోజుల్లో 18 టీఎంసీల నీటిని జిల్లాకు తీసుకురాగలిగారు. జూలై 30న జలాశయంలో ఇరు రాష్ట్రాల ఇండెంట్ నీటిని విడుదల చేయ గా ఆగస్టు 2 నుంచి ఆంధ్ర సరిహద్దులో 105వ కిలోమీటర్ వద్ద వాటా నీటిని తీసుకోవడం ప్రారంభించారు. డిసెంబరు ఒకటో తేదీ వరకు సరిహద్దులో నష్టాలుపోను 18 టీఎంసీల నీరు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ యేడాది జలాశయంలో 168 టీఎంసీల నీరు లభ్యమవుతాయని అందులో హెచ్చెల్సీ వాటాగా 25.755 టీఎంసీల నీరు కేటాయించారు. దీని ప్ర కారం రోజుకు రెండు వేల క్యూసెక్కుల మేరకు సరిహద్దులో తీసుకుని ఉంటే 120 రోజుల్లో 21 టీఎంసీలకు పైగా ఆంధ్ర సరి హద్దులో జిల్లాకు నీరందేవి. దీంతో మూడు టీఎంసీల వరకు నీటిని తీసుకోలేకపోయారు. నాలుగు నెలల కాలం లో 1500 క్యూసెక్కుల ప్రకారమే సరిహద్దులో నీరు తీసుకోవటమే ఇందుకు కారణం. రోజుకు 500 నుంచి 700 క్యూసెక్కుల వరకు నీటి పరిమాణాన్ని తగ్గించారు. బో ర్డుకు 1500 క్యూసెక్కులను సరిహద్దులో ఇవ్వాలని ఇం డెంట్ ఇచ్చినట్లు తెలియవచ్చింది. దీంతో సరిహద్దులో ఆంధ్ర అధికారులు కోరినంత ఇండెంట్నే ఇచ్చారు. ఈ యేడాది జలాశయంలో 294 టీఎంసీల నీరు ఇప్పటివరకు అందాయి. అందులో 110 టీఎంసీల వరకు నదికి వదిలారు. 45 రోజుల పాటు నదికి వదిలే స మయంలో హెచ్చెల్సీకి మాత్రం 1500 క్యూసెక్కులకు మించి తీసుకోలేదు. ఆ సందర్భంలో 1500 క్యూసెక్కులు కాకుండా రెండు వేల క్యూసెక్కుల ప్రకారం తీసుకుని ఉంటే నీటి సరఫరాలో జాప్యం జరిగేది కాదని స్పష్టమవుతోంది.
ఆఫ్అండ్ఆన్తో మరింత ఆలస్యం
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో 105 కిలోమీటర్ల పొడవులో ప్రవహించే హెచ్చెల్సీ కింద పంట కోత దశకు చేరడంతో ఆఫ్అండ్ఆన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రధానంగా కర్ణాటకకు హెచ్చెల్సీ ద్వారా కేటాయించిన 13 టీఎంసీల నీటిలో ఇప్పటికే 12 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఒక్క టీఎంసీ మాత్రమే మిగిలి ఉంది. దీంతో పదవ తేదీ వరకు తమకు నీటి అవసరం లేదని కర్ణాటక కోరింది. అదే దారిలో హెచ్చెల్సీ ద్వారా ఆంధ్ర వాటా నీటిని కూడా పది రోజుల పాటు నిలిపివేయాలని ఇరిగేషన్ జిల్లా యంత్రాంగం కూడా కోరింది. దీంతో బోర్డు రెండు రాష్ట్రాల ఇండెంట్ నీటిని పది రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆంధ్రా వాటాలో ఇంకా ఏడు టీఎంసీల దాకా నీటిని తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు కేసీ కెనాల్ వాటా నీరు కూడా తీసుకోవాలి. సరాసరి తొమ్మిది టీఎంసీల నీరు జిల్లాకు రావాల్సి ఉంది. కానీ ఒక్క టీఎంసీ వాటా ఉన్న కర్ణాటక నెల రోజుల్లో తన వాటాతో పాటు అదనంగా మరో టీఎంసీ అవసరమైతే దీనిని కూడా రెండు విడతల ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిని ప్రవేశపెట్టుకుని తీసుకుంటుం ది. కానీ తొమ్మిది టీఎంసీలు తీసుకోవాల్సిన ఆంధ్రా వాటాని జనవరి చివరి వరకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక నీటి వాటా పూర్తి కాగానే అప్పుడైనా ఆంధ్రా తన వాటాను సింగిల్ ఇండెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం ఈ పది రోజుల ఆఫ్ అండ్ ఆన్ సమయంలోనైనా సంపూర్ణంగా రెండు వేల క్యూసెక్కుల నీటిని తీసుకుని ఉంటే కొంత సమయం కలిసివచ్చే అవకాశం ఉండేది. కానీ కర్ణాటక వేసిన ఉచ్చులో జిల్లా హెచ్చెల్సీ యంత్రాంగం పడిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో జాప్యం జరిగే కొద్దీ జిల్లాకు నీటి అన్యాయం తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు.
కన్నెత్తి చూడని పాలకులు
తుంగభద్ర ఎగువ కాలువ వైపు ప్రజాప్రతినిధులు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు జలాలకు సంబంధించి సమీక్ష కూడా చేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ఐఏబీ సమావేశాన్ని నిర్వహించి తూతూమంత్రంగా వదిలేసినట్లు ఆరోపణలున్నాయి. నీటి యాజమాన్యంపై అవగాహన లేకపోవడంతో ప్రజాప్రతినిధులు అటువైపు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్ అండ్ ఆన్ పద్ధతి ద్వారా వాటిల్లే నష్టంతో పాటు ఈ యేడాది హెచ్చెల్సీ ద్వారా జలాలను సకాలంలో తీసుకునేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయాలు, అందులోని లోపాలతో పాటు జిల్లా ప్రయోజనాల గురించి కూడా అడిగే నాథుడు కరువవ్వడంతో ఆది నుంచి నీటి సరఫరాలో లోపాలు బయటపడుతున్నాయని తెలుస్తోంది. బోర్డు అధికారులు నీటిని సరిహద్దులో తగినంత తీసుకోవాల్సిందిగా కోరినా స్పందించే పరిస్థితిలో లేకపోవడంపై కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ యేడాది జలాశయంలో నీరు స మృద్ధిగా లభించినప్పటికీ సకాలంలో ఎందుకు తీసుకురా లేక పోతున్నారనే అంశాలను పరిశీలించాల్సి ఉంది. పైగా అధికారులు ఎందుకు నిర్లక్ష్యధోరణిలో వ్యవహరిస్తున్నారని, వారి మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని కూడా సమీక్షించి జిల్లా ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఇప్పటివరకు ఆ విధమైన అడుగులు లేకపోగా నిద్రావస్థలో ఉండి హెచ్చెల్సీని పట్టించుకోకుండా గాలికి వదిలేశారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి.