25న 2.03 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-11T06:00:37+05:30 IST

: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో ఈనెల 25వ తేదీన 2.03 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు.

25న 2.03 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ

కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో ఈనెల 25వ తేదీన 2.03 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. అదేరోజున 1.11 లక్షల ఇళ్ల నిర్మాణాలకు పరిపాలన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, హౌసింగ్‌ పీడీ వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసే లేఅవుట్లలో రోడ్డు వసతి, ఏ ప్లాట్‌ ఎక్కడుందో సూచించే విధంగా రాళ్లను ఏర్పాటు చేశామన్నారు. మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో సొంతంగా స్థలమున్న గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలు, ఇతరులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.50 లక్షలు మంజూరు చేసేవారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల పట్టాలను అందిస్తోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 1.50 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1.05 సెంట్లు ఇస్తోందన్నారు. సెంటు భూమి ధర సుమారు రూ.లక్ష ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, మొత్తం రూ.2.80 లక్షల విలువ కలిగిన ఇంటి పట్టా అందిస్తున్నామన్నారు. జిల్లాస్థాయిలో మెటీరియల్‌ సరఫరాకు టెండర్‌ కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. జిల్లాస్థాయి టెండర్‌ కమిటీలో తాను చైర్మన్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ సిరి ఉపాధ్యక్షురాలిగా, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ, డీపీఓ, కార్మికశాఖ డీసీ, భూగర్బజల శాఖ డీడీ సభ్యులుగా ఉంటారన్నారు. గృహనిర్మాణ శాఖ పీడీ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. 


తక్కువ ధరకే ఇంటి నిర్మాణ సామగ్రి అందించాలి

పేదల ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరకే సామగ్రి అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన.. జిల్లాస్థాయి టెండర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 1.11 లక్షల ఇళ్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అందులోని 57100 ఇళ్లకు సంబంధించి నిర్మాణ సామగ్రిని టెండర్ల ద్వారా చేపట్టాలన్నారు. ప్రస్తుతం మంజూరైన 50 శాతం ఇళ్లకు టెండర్‌ కమిటీ ద్వారా నిర్మాణ సామగ్రి కొనుగోలు చేసేందుకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, డీపీఓ పార్వతి, డీఐసీ జనరల్‌ మేనేజర్‌ సుదర్శన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:00:37+05:30 IST