లేఅవుట్లను సిద్ధం చేసి.. ఇళ్ల పట్టాలిస్తాం

ABN , First Publish Date - 2020-12-06T06:13:14+05:30 IST

జిల్లాలో అన్ని సదుపాయాలతో లేఅవుట్లను సిద్ధం చేసి, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలిస్తామని కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు.

లేఅవుట్లను సిద్ధం చేసి.. ఇళ్ల పట్టాలిస్తాం
మాట్లాడుత్ను కలెక్టర్‌ గంధం చంద్రుడు

ప్రతి ఇంటికీ 20 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉచితం 

మార్కెట్‌ ధర కన్నా తక్కువకే 92 బస్తాల సిమెంట్‌ 

కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని సదుపాయాలతో లేఅవుట్లను సిద్ధం చేసి, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలిస్తామని కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సబ్‌ కలెక్టర్‌ నిశాంతి, ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులు, మండలస్థాయి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇళ్లపట్టాల పంపిణీపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 25న పేదలందరికీ ఇళ్ల్లు పథకంలో భాగంగా జిల్లాలో 2,03,199 మందికి నివేశస్థల పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1,11,099 మంది లబ్ధిదారులకు గృహనిర్మాణాల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతి లబ్ధిదారుడికీ 340 చదరపు అడుగుల ఇంటిపట్టాను అందించటంతోపాటు అందులో 272 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మిస్తామన్నారు. ఇందులో లివింగ్‌ రూమ్‌, కిచెన్‌, బాత్‌రూమ్‌, టాయ్‌లెట్‌ ఉంటాయన్నారు. మొదటి విడతలో పట్టణ ప్రాంత లబ్ధిదారులు, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ పరిధిలోని మండలాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలిస్తామన్నారు. రెండో విడతలో గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ప్రతి ఇంటిని 1.80 లక్షల ఖర్చుతో నిర్మిస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్‌ టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు. రవాణాచార్జీలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి 92 సిమెంటు బస్తాలు మార్కెట్‌  ధర కన్నా తక్కువకే అంటే రూ.235కే ప్రభుత్వం అందిస్తుందన్నారు. మొదటి విడతలో పట్టణ ప్రాంతాల్లో 44,945, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ పరిధిలోని మండలాల్లో 66,154 ఇళ్లు నిర్మిస్తామన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 988 లేఅవుట్లలో 509 కి.మీ., అంతర్గత రహదారులు, 58 కి.మీ., అప్రోచ్‌ రోడ్లు వేశామన్నారు. లబ్ధిదారులందరికీ సౌకర్యవంతంగా ఉండేలా లేఅవుట్ల నిర్మాణాలను నాణ్యతతోపాటు పచ్చదనం కోసం మొక్కలు నాటి ట్రీ గార్డ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు నిశాంత్‌కుమార్‌, డాక్టర్‌ సిరి, గంగాధర్‌ గౌడ్‌, డీఆర్వో గాయత్రీదేవితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


అసైన్డ్‌ భూములకు చివరి ప్రాధాన్యం

జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి చేపట్టనున్న భూసేకరణలో అసైన్డ్‌భూములకు చివరి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ భూములకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రభుత్వ భూములు లేనిచోట ప్రైవేట్‌ భూములను తీసుకోవాలన్నారు. ఈ రెండు లేని ప్రాంతాల్లో మాత్రమే చివరి ప్రాధాన్యతగా అసైన్డ్‌ భూములను సేకరించాలన్నారు. భూసేకరణకు సంబంధించి కోర్టుల్లో 187 కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని వేసిన వారితో మాట్లాడి, విత్‌డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే ప్రక్రియను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ముందుగా లాగిన్‌ సౌకర్యం పొందేందుకు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలన్నారు.

Updated Date - 2020-12-06T06:13:14+05:30 IST