అనంతపురం జిల్లాలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎంతమందికి అంటే..

ABN , First Publish Date - 2020-12-10T06:41:24+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. మూడు రోజులుగా 10లోపే తేలిన కేసులు బుధవారం 50 నిర్ధారణ కావటం గమనార్హం. వర్షాలు కురవటం, వాతావరణంలో మార్పుల కారణంగా చలి తీవ్రత పెరుగుతోంది.

అనంతపురం జిల్లాలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎంతమందికి అంటే..

50 మందికి నిర్ధారణ


అనంతపురం వైద్యం, డిసెంబరు 9: జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. మూడు రోజులుగా 10లోపే తేలిన కేసులు బుధవారం 50 నిర్ధారణ కావటం గమనార్హం. వర్షాలు కురవటం, వాతావరణంలో మార్పుల కారణంగా చలి తీవ్రత పెరుగుతోంది. శ్వాస సంబంధిత జబ్బులున్న వారు మరింత ఆందోళన చెందుతున్నారు. అన్ని వయసుల వారు జలుబు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో జలుబు, దగ్గు బాధితులు ఆస్పత్రులకు భారీగా వస్తున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం నగరంలో 14, పుట్టపర్తి 12, హిందూపురం, తాడిపత్రి 5, లేపాక్షి 3, గోరంట్ల, కదిరి, కంబదూరు 2, ధర్మవరం, ముదిగుబ్బ, నల్లమాడ, ఓడీసీ, పరిగి మండలాలలో ఒక్కో కేసు నిర్ధారణ అయ్యాయి. మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 66929 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 594 మంది చనిపోగా.. 66115 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 220 మంది చికిత్స పొందుతున్నారు.


బడికి పంపాలా.. వద్దా..?

ప్రస్తుతం పాఠశాలలు తెరిచారు. అక్కడక్కడా ఉపాధ్యాయులు, పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జిల్లాలో రెండు, మూడు కేజీబీవీల్లో విద్యార్థినులకు వైరస్‌ సోకింది. దీంతో పిల్లలను బడికి పంపించాలా.. వద్దా.. అనే మీమాంసలో తల్లిదండ్రులున్నారు. ఒక విద్యార్థికి కరోనా సోకినా ప్రస్తుత వాతావరణంలో పక్కవారికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపటానికి తల్లిదండ్రులు వెనకడుగేస్తున్నారు. యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-12-10T06:41:24+05:30 IST