నేటి నుంచి అంగన్‌వాడీల ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2020-12-28T06:25:53+05:30 IST

అంగన్‌ వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు భర్తీకి సోమవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

నేటి నుంచి అంగన్‌వాడీల ఇంటర్వ్యూలు

పోస్టులు దక్కించుకునేందుకు పైరవీలు

ప్రజాప్రతినిధి ఆమోదమే కీలకం

రంగంలోకి ద్వితీయశ్రేణి నేతలు, దళారీలు

అభ్యర్థులతో బేరసారాలు

అనంతపురం వైద్యం, డిసెంబరు 27:  అంగన్‌ వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు భర్తీకి సోమవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. వివిధ కారణాలతో గతంలో ఇచ్చిన మూడు నోటిఫికేషన్లు రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నా లుగోసారి నోటిఫికేషన్‌ ఇచ్చి నియామకాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 855 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రధాన కార్యకర్త 132, మినీ కార్యకర్తల 67, ఆయా పో స్టులు 656 ఉన్నాయి. వీటికి 2605 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరికి సోమవారం నుంచి ఈనెల 31 వరకు డివిజన్ల వారీగా ఇంటర్వ్యూలు చేపట్టనున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపామని ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి తెలిపారు.


పారదర్శకమా.. రాజకీయ ఆమోదమా?

అంగన్‌వాడీ పోస్టులు అంగట్లో సరుకుల్లా మారిపోయాయన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఎలాగైనా పోస్టులు దక్కించుకోవాలని అభ్యర్థులు ఆరాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇంటర్వ్యూల నిర్వహణకు సిద్ధమైంది. ఆశావహులు పోస్టులు దక్కించుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎంపికలో ఆ నియోజకవర్గ ప్రధాన ప్రజాప్రతినిధి ఆమోదమే కీలకంగా మారనుంది. దీం తో అభ్యర్థులు రాజకీయ దళారీలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి కే రెండుసార్లు ఇంటర్వ్యూల వరకు వచ్చి నియామకాలు ఆగిపోయాయి. ఆ సమయంలోనూ అనేక మంది అభ్యర్థులు దళారీలను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం పోస్టుల రోస్టర్‌ మారిపోయింది. ఆయా ప్రాంతాలకు రోస్టర్‌ కేటాయింపు ఆధారంగా అభ్యర్థుల నియామకం జరుగుతోంది. దీంతో కొత్తగా మళ్లీ అభ్యర్థులు కీలక ప్రజాప్రతినిధి ఆమోదం కోసం ద్వితీయశ్రేణి నాయ కులు, దళారీలను ఆశ్రయించి, పైరవీలు సాగిస్తున్నారు. ఇక్కడ కూడా పోస్టుకు ధరపెట్టి అందులో అడ్వాన్స్‌ కింద సొమ్ము అప్పచెప్పిన తర్వాతే వారిపేర్లు ప్రజాప్రతినిధితో ఆమోదం వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఒక్కో పోస్టుకు ఒక్కో ప్రాంతంలో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కీలక ప్రజాప్రతినిఽధులు కూడా ఆయా ప్రాంతాల ద్వితీయశ్రేణి నేతలకు ఈ పోస్టుల వ్యవహారం కట్టబెట్టినట్టు అధికార పార్టీ శ్రేణులతోపాటు అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అ భ్యర్థులు, వారి తల్లిదండ్రులు బహిరంగంగా మాట్లాడుకుంటు న్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలు, నియామకాలు పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానాలు అభ్యర్థుల్లో వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం పారదర్శకతకు పెద్దపీట వేస్తామంటున్నారు. ఎక్కడైనా దళారీలు.. పోస్టులు ఇప్పిస్తామని డబ్బు వసూలుచేస్తే తమ దృష్టికి తీసుకురావాలనీ, ఇందుకోసం హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. జేసీ సిరి, ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి సైతం ఈ పోస్టుల ఎంపిక విషయంలో అర్హత ఉన్నవారికే అవకాశం కల్పిస్తామనీ, ఇందులో అనుమానపడాల్సిన అవసరం లేదంటున్నారు. రాజకీయ నేతలు, దళారీలు మాత్రం తాము చెప్పి న వారికే పోస్టులు వస్తాయని చాలెంజ్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో అంగన్‌వాడీల ఇంటర్వ్యూలు, ఎంపికపై అందరూ ఉ త్కంఠగా చూస్తున్నారు.


ఇంటర్వ్యూల రోజే పోస్టింగ్‌ ఉత్తర్వులు

అంగన్‌వాడీ నియామకాల్లో పొరబాట్లు, అక్రమాలకు తావులేకుండా కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్వ్యూల రోజే అర్హత పొందిన అభ్యర్థులకు పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటు న్నాం. కొన్ని కారణాలతో ఆలస్యమైనా 31వ తేదీ ముగింపు నాటికి అందరికీ ఉత్తర్వులు అందజేస్తాం. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. దళారీలను నమ్మి మోసపోకండి. 

- విజయలక్ష్మి  పీడీ, ఐసీడీఎస్‌

Updated Date - 2020-12-28T06:25:53+05:30 IST