-
-
Home » Andhra Pradesh » Ananthapuram » atp accident story
-
ఘోరం
ABN , First Publish Date - 2020-12-19T07:05:57+05:30 IST
మండలంలోని రాఘవంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి...

బత్తలపల్లి మండలం రాఘవంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు
క్షతగాత్రుడికి సపర్యలు చేస్తున్న కూలీలపై దూసుకెళ్లిన లారీ
ఐదుగురు దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు
సాయం చేయబోవటమే నలుగురి మరణానికి కారణం
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కూలీలు వారు. ఉదయం లేవగానే అయినవారి మొహమైనా కళ్లారా చూశారో లేదో ! హడావుడిగా ఇంత చద్ది కట్టుకుని కూలి పనులకు వెళ్లారు. పగలంతా కష్టపడి పని చేసి పొద్దువాలకా ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో కారు ఢీకొని ఓ యువకుడు రోడ్డుపై పడి ఉండటం గమనించారు. అయ్యో ! పాపం అంటూ సపర్యలు చేయడానికి వెళ్లారు. ఆ కారుణ్యమే వారి పాలిట శాపమైంది. లారీ రూపంలో దూసుకొచ్చిన మృతువు గాయపడిన యువకుడితో పాటు అతడికి సపర్యలు చేయడానికి వచ్చిన మరో నలుగురు కూలీల ఊపిరి తీసింది. కన్నవారు ఇంటికొస్తారని ఎదురు చూసిన పిల్లలు, కుటుంబ సభ్యులు ఈ వార్త విని హతాశులయ్యారు. సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలపై పడి ఇక తమకు దిక్కెవ్వరంటూ గుండెలవిసేలా రోదించారు.
బత్తలపల్లి, డిసెంబరు 18 : మండలంలోని రాఘవంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి... రాఘవంపల్లికి చెందిన రైతు శ్రీకాంతప్ప ఒక్కగానొక్క కుమారుడు రాజశేఖర్(20) అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా రాఘవంపల్లి క్రాస్ వద్ద కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో కూలి పనులు ముగించుకొని తిరిగొస్తున్న కూలీలు ప్రమాదాన్ని గమనించి తమ వాహనాలు ఆపి క్షతగాత్రుడికి సపర్యలు చేయడానికి వెళ్లారు. బాధితుడికి సపర్యలు చేస్తుండగానే బత్తలపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న సిమెంట్ లారీ కూలీలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన కూలీ శ్రీనివాసులు(40) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ముష్టూరుకు చెందిన శివమ్మ(50) బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో, అనంతపురం ఆస్పత్రిలో సంజీవపురానికి చెందిన సూరి(45), వలి(50) చికిత్స పొందుతూ మృతి చెందారు. లింగారెడ్డిపల్లికి చెందిన రాజు అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయపడ్డవారిలో ప్రస్తుతానికి రాజు ఒక్కడే బతికి బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కారు, లారీ డ్రైవర్లు వాహనాలు వదిలేసి పరారయ్యారు. సీఐ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బదులు మమ్మల్ని తీసుకెళ్లినా బాగుండేదే !
రాఘవంపల్లికి చెందిన శ్రీకాంతప్పకు రాజశేఖర్ ఒక్కగానొక్క కుమారుడు. తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేసేవాడు. ప్రయోజకుడై ముసలి వయస్సులో మమ్మల్ని బాగా చూసుకుంటావనుకుంటే మమ్మల్ని వదిలేసి పైలోకాలకు పోతివా నాయనా. నీ బదులు మమ్మల్ని తీసుకెళ్లినా బాగుండేదే అంటూ తల్లిదండ్రులు రాజశేఖర్ మృతదేహంపై పడి రోదించటం పలువురిని కలిచివేసింది.
మరో మృతుడు శ్రీనివాసులుకు భార్య సువర్ణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబాన్ని పోషిం చే పెద్ద దిక్కు మృతి చెందటంతో భార్యాపిల్లలు వీధిన పడ్డారు.
మృతురాలు శివమ్మకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మృతి చెందడంతో రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబానికి ఇంటి పోషణ మరింత కష్టమవుతుందని పలువురు పేర్కొన్నారు. శివమ్మ మృతిచెందడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాద ఛాయలు అలుముకున్నాయి.
సంజీవపురానికి చెందిన వలికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వలి బేల్దారి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం బోరున విలపించింది.
సంజీవపురానికే చెందిన మరో మృతుడు సూరి భార్య వదిలేయడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. రోజు కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేవాడు. దినచర్యలో భాగంగా కూలి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది.
