టీడీపీలో పదవుల కాక !

ABN , First Publish Date - 2020-07-28T10:31:03+05:30 IST

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత నిరాశ చెందకుండా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రధాన ప్రతి పక్షంగా తెలుగుదేశం పోరాటం చేస్తూనే ..

టీడీపీలో పదవుల కాక !

పార్లమెంట్‌ నియోజవర్గంగా అధ్యక్ష స్థానం విభజన

రెండు స్థానాలకు అధ్యక్షుల నియామకంపై కసరత్తు

పోటీలో పలువురు బీసీ నేతలు

అతి త్వరలో నియామకం


రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత నిరాశ చెందకుండా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రధాన ప్రతి పక్షంగా తెలుగుదేశం పోరాటం చేస్తూనే ఉంది. అయితే పార్టీలో కొన్ని విభాగాలను ప్రక్షాళన చేసి, నూతన రక్తం ఎక్కించి, శ్రేణులను మరింతగా పోరుబాట పట్టించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే జనాభాపరంగా బీసీల ప్రాబల్యం అధికంగా ఉన్న జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలకు వేర్వేరుగా పార్టీ అధ్యక్షులను నియమించాలని నిర్ణయించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తమను నిర్లక్ష్యం చేశారనే భావనతో పార్టీ ఆవిర్భావం నుంచి వెంట ఉన్న కొన్ని సామాజిక వర్గాలు దూరం జరిగాయి. ఈక్రమంలో వారిని మళ్లీ అక్కున చేర్చుకునేం దుకు బీసీ వర్గాలకే  రెండు పార్లమెంట్‌ అధ్యక్ష స్థానాలను కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఆయా స్థానాలను ఆశిస్తున్నవారిలో కాక మొదలైంది.


అనంతపురం, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలకు పార్టీ అధ్యక్షులను నియమించాలని అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో  పదవుల కాక పుట్టిస్తోంది. రెండు పార్లమెంటు స్థానాలకు బీసీ వర్గాలకు చెందిన నాయకులను అధ్యక్షులుగా నియ మించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందడంతో ఆ మేరకు ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో బలహీన వర్గాలకు చెందిన పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు  ఆ పార్టీ ముఖ్య వర్గాల సమాచారం. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో ముగ్గురి పేర్లు, హిందూపురం పార్లమెంటు పరిధిలో నలుగురి పేర్లు పరిశీలిస్తున్నారు. 


ఆ బీసీ నేతలెవరంటే....!

అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలకు బీసీ నేతలను అధ్యక్షులుగా నియమించడానికి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు సమాలోచనలు చేసి కొందరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. హిం దూపురం పార్లమెంటు నుంచి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, అహుడా మాజీ చైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ, కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ సవిత పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.


అనంతపురం పార్లమెంటు నుంచి మాజీ జడ్పీ చైౖర్మన్‌ పూల నాగరాజు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ఆదినారాయణ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్‌ల పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. అనంతపురం పార్లమెంటు అధ్యక్ష స్థానాన్ని ఆ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబులను కలిసి విన్నవించుకున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త సారథులెవరో త్వరలోనే అధిష్టానం వెల్లడి చేయనుంది.  


హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష రేసులో....గుండుమల తిప్పేస్వామి

హిందూపురం పార్లమెంటు అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆసక్తి చూపుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆయన జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాష్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా అసెంబ్లీ బీసీ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. అధికార మార్పిడి జరిగి వైసీపీ కొలువుదీరిన నేపథ్యంలోనూ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. 


నిమ్మల కిష్టప్ప

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నిమ్మల కిష్టప్ప ఆ పార్టీలో పనిచేస్తున్నారు. తన 26 ఏళ్ల వయస్సు నుంచే పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలో ఆయన అనేక పదవులు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోరంట్ల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై పశుసంవర్థక శాఖ మంత్రిగా పనిచేశారు. హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లోనూ ఆయన హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం ఆయన హిందూపురం పార్లమెంటు అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు. 


అంబికా లక్ష్మీనారాయణ

హిందూపురం పార్లమెంటు అధ్యక్ష పదవి ఆశిస్తున్న అహుడా మాజీ చైౖర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున హిందూపురం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. రాష్ట్ర వాల్మీకి సేవాదళ్‌ వ్యవస్థాపకుడైన అంబికా 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో అహుడా చైౖర్మన్‌గా ఆయనను నియమించారు. బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే 2019 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆయన ఆ పదవిలో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయారు. 


సవిత

మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కుమార్తె సవిత హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష స్థానాన్ని ఆశి స్తున్నారు. ఆమె 2014 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తన తండ్రి పేరున ట్రస్టు ఏర్పాటు చేసి ఆ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో ఆమెను కురుబ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆ పదవిలో ఆమె రెండు నెలల పాటు కొనసాగారు. ఆ తరువాత ఎన్నికలు రావడం, పార్టీ అధికారం కోల్పోవడంతో ఆమె మాజీ అయ్యారు. తాజాగా ఆమె హిందూపురం పార్లమెంటు పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.  


అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్ష రేసులో.. పూల నాగరాజు

అనంతపురం పార్లమెంటు అధ్యక్ష పదవిని రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజు ఆశిస్తు న్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన క్రియాశీలక కార్యకర్తగా ఉంటున్నారు. 2014లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం, జిల్లా పరిషత్‌ పీఠం ఆ పార్టీకి దక్కిన నేపథ్యంలో గుమ్మఘట్ట జడ్పీటీసీగా కొనసాగుతున్న నాగరాజును ముందస్తు ఒప్పందంలో భాగంగా 2017లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా నియమించారు. 2019 ఎన్నికల నోటిఫికేషన్‌ వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. 


వెంకటశివుడు యాదవ్‌ 

గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నా రు. 1999 నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. జిల్లా కార్యనిర్వహక కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పార్టీ పదవుల్లో పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.... ఆఖరి క్షణాల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని కోల్పోతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. 


ఆదినారాయణ 

విద్యార్థి దశ నుంచే ఆదినారాయణ తెలుగుదేశం పార్టీ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయ వాది. ఆ పార్టీలో ఆయన అనేక పదవులు అలంకరిం చారు. అనంతపురం మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా మార్చిన తరువాత జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఈ క్రమంలోనే కౌన్సిల్‌ ప్రతిపక్ష నాయకు డిగా పనిచేశారు. ఆ తరువాత అనంతపురం మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా కూడా పనిచేశారు. అనంతపురం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఐదు దఫాలుగా ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని ఆశిస్తున్నారు. 


ఎంఎస్‌ రాజు 

హిందూపురం, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ అధ్యక్ష పదవులు  బీసీలకేనని పార్టీ  నిర్ణయిం చినప్పటికీ ఆ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు అనంతపురం పార్లమెంటు అధ్యక్ష స్థానాన్ని ఆశి స్తున్నారు. జిల్లాలో ఎస్సీలను పరిగణనలోకి తీసుకుంటే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎంఎస్‌రాజు ఇప్పటికే అనంత పురం పార్లమెంటు పరిధిలోని పలువురు నేతలను కలిసి అధ్యక్ష స్థానం ఆశిస్తున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. 


ఫైవ్‌మెన్‌ కమిటీ ఏర్పాటుకు యోచన

అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవ ర్గాల అధ్యక్షుల నియామకం అయిన తరువాత జిల్లాలో ముఖ్య నేతలతో 5 మెన్‌ కమిటీని ఏర్పాటు చేసే యో చనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్టు తెలిసింది. ఆ 5 మెన్‌ కమిటీలో రెండు పార్లమెంటు స్థానాల నుంచి ము ఖ్య నేతలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట సాగించడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ఆ 5మెన్‌ కమిటీపైనే అధినాయకత్వం బాధ్యత ను మోపనున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-07-28T10:31:03+05:30 IST