హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తున్న వైవీ

ABN , First Publish Date - 2020-09-21T09:37:30+05:30 IST

హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తున్న వైవీ

హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తున్న వైవీ

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 20 : తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చే ఏ మతం వారైనా డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్యమతస్తులు దర్శనానికి ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద తప్పనిసరిగా డిక్లరేషన్‌ ఇచ్చి దర్శనం చేసుకోవచ్చన్నారు. దశాబ్దాల కాలంగా ఈ పద్ధతి కొనసాగుతోందన్నారు. ఎంతటి వారైనా శ్రీవారి వద్ద ఆచారాలు, సాంప్రదాయాలు పాటించాల్సిందేనన్నారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా అన్యమతస్తుల డిక్లరేషన్‌ ఎత్తివేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందన్నారు. వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉందని తెలియజెప్పడం కోసమే అన్యమతస్తులు డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనం చేసుకుంటారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కోసం టీటీడీ నియమాలు, నిబంధనలకు వైవీ తూట్లు పొడుస్తున్నారన్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ శ్రీవారి ప్రసాదం తీసుకోకుండా అవమానించారని, ఇప్పుడు డిక్లరేషన్‌ ఎత్తేసి తిరుమల సంప్రదాయాలను మంట కలుపుతున్నారని మండిపడ్డారు. పవిత్ర టీటీడీ చైర్మన్‌ కుర్చీలో కూర్చొని వైవీ తప్పుడు మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. స్వామి నిధులపై ఉన్న శ్రద్ధ, ఆలయ ఆచారాలు, సంప్రదాయాలపై ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అన్యమతస్తులు స్వామిని దర్శించుకోవడానికి డిక్లరేషన్‌ ఇచ్చే విధానం పునరుద్ధరించే వరకూ టీడీపీ పోరాడుతుందని బీకే హెచ్చరించారు.

Updated Date - 2020-09-21T09:37:30+05:30 IST