ఆయకట్టుకు నీరేదీ?
ABN , First Publish Date - 2020-12-10T06:11:18+05:30 IST
గుంతకల్లు ఉపకాలువ (జీబీసీ)లో జలచౌర్యం మితిమీరింది. నాన్ ఆయకట్టు రైతులు అందరి కళ్లుకప్పి కాలువ అడుగుభాగం, లైనింగ్ గోడల లోపలి నుంచి పైపులు అమర్చుకుని అడ్డదారుల్లో నీటిని తోడుకుంటున్నారు. పాల్తూరు నుంచి పెంచలపాడు వరకు దాదాపుగా 600 మందికి పైగా నాన్ ఆయకట్టు రైతులు ఇదే రీతిలో జలచౌర్యానికి పాల్పడుతున్నారు.

గుంతకల్లు ఉప కాలువలో మితిమీరిన జలచౌర్యం
కాలువ అడుగుభాగంలో అక్రమంగా పైపుల ఏర్పాటు
చివరి ఆయకట్టుకు నీరందక రైతుల ఆందోళన
విడపనకల్లు, డిసెంబరు 9: గుంతకల్లు ఉపకాలువ (జీబీసీ)లో జలచౌర్యం మితిమీరింది. నాన్ ఆయకట్టు రైతులు అందరి కళ్లుకప్పి కాలువ అడుగుభాగం, లైనింగ్ గోడల లోపలి నుంచి పైపులు అమర్చుకుని అడ్డదారుల్లో నీటిని తోడుకుంటున్నారు. పాల్తూరు నుంచి పెంచలపాడు వరకు దాదాపుగా 600 మందికి పైగా నాన్ ఆయకట్టు రైతులు ఇదే రీతిలో జలచౌర్యానికి పాల్పడుతున్నారు. దీంతో కాలువ పరిధిలోని ఆయకట్టు రైతుల సాగుకు సరిపడా నీరు అందకుండా పోతోంది. ఈపరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. చివరి ఆయకట్టు రైతులు వంతుల వారిగా నీటిని వాడుకునే దుస్థితి వచ్చింది.
పట్టించుకోని అధికారులు
జీబీసీ జీరో బై జీరో నుంచి గుంతకల్లు వరకు కొంతమంది నాన్ ఆయకట్టు రైతులు యథేచ్ఛగా ప్రధాన కాలువకు అక్రమగా పైపులు వేసి నీటి చౌర్యం చేస్తున్నా జీబీసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కాలువ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన పైపుల తతంగాన్ని క్షుణంగా పరిశీలిస్తే తప్ప కనిపించవు. పాల్తూరు నుంచి పెంచలపాడు వరకు నాన్ ఆయకట్టు రైతులు వాణిజ్య పంటలు సాగుచేసి నీటి చౌర్యానికి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తు న్నారు. రెండు నెలలుగా కాలువపై గస్తీ తిరిగేందుకు కొత్తగా లష్కర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించినా ఫలితం లేకుండా పోతోంది. దాదాపుగా 10 మంది అధికారులు, సిబ్బంది ఉన్నా నీటిచౌరాన్ని అడ్డుకోలేకపోతున్నా రు. విడపనకల్లు, ఆర్ కొట్టాల, కడదరబెంచి, డొనేకల్లు గ్రామాల చివరి ఆ యకట్టు రైతులు రబీలో ఆరుతడి పంటలు సాగుచేశారు. రెండు నుంచి మూడు తడుల నీటిని వాడుకుంటారు. ఈ నీటిని వాడుకునేందుకు ఆయకట్టు రైతులు రాత్రి, పగలు కాలువపై గస్తీలు తిరుగుతుంటారు. నాన్ ఆ యకట్టు రైతులు నీటిచౌర్యానికి పాల్పడుతూ వారి కంటబడితే పైపులను కత్తిరించి, మోటార్లను జీబీసీ అధికారులకు అప్పగిస్తారు. వాటిని పంట కాలం పూర్తయ్యే వరకు నాన్ ఆయకట్టు రైతులకు ఇవ్వరు. ఈవిషయంగా ఇరు పక్షాల రైతులు ఘర్షణలు పడిన సందర్భాలూ లేకపోలేదు. పోలీసుస్టేషన్‌లో పలుసార్లు పంచాయితీలు కూడా చేశారు. భూమి శిస్తును వసూలుచేసే రెవెన్యూ అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడంలేదని ఆ యకట్టు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హావళిగి గ్రామాని చెందిన కొంతమంది రైతులు అధికార వైసీపీ నాయకుడి అండతో జీబీసీ అక్విడక్డు కు రంధ్రాలు వేసి కాలువకు గండికొట్టి పెద్దవంకకు నీటిని మళ్లించుకుని వెళ్లారు. జీబీసీ అధికారులు స్పదించి న్యాయం చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈవిషయమై జీబీసీ ఏఈ రాజశేఖర్‌ను వివరణ కోరగా, ప్రస్తుతం కాలువకు సాగు నీటిని బంద్ చేశామన్నారు. ఆన్ అండ్ ఆఫ్ ప ద్ధతిలో సాగునీటిని రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కాలువపై లష్కర్లచే గస్తీ నిర్వహించి నీటి చౌర్యం జరక్కుండా చర్యలు తీసు కుంటామని పేర్కొన్నారు.