జిల్లాకు 7 వేల ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు
ABN , First Publish Date - 2020-04-21T08:48:58+05:30 IST
జిల్లాలో కొవిడ్-19 పరీక్షలు మరింత వేగవంతం కానున్నాయి. 15 నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ చేసే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు 7 వేల దాకా జిల్లాకు చేరాయి. ఈ కిట్ల వినియోగంపై కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం అవగాహన...

- 15 నిమిషాల్లో కరోనా వ్యాధి నిర్ధారణ
అనంతపురం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్-19 పరీక్షలు మరింత వేగవంతం కానున్నాయి. 15 నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ చేసే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు 7 వేల దాకా జిల్లాకు చేరాయి. ఈ కిట్ల వినియోగంపై కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం అవగాహన కల్పించారు. ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, వైద్యాధికారులు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు ఉపయోగించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు. ఈ కిట్ల ద్వారా జిల్లాలో ఉన్న మూడు కేటగిరీల వారికి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా కరోనా కట్టడిలో భాగంగా మొదటి వరుసలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, శాంపిల్స్ కలెక్షన్ సిబ్బంది, క్వారంటైన్ కేంద్రాల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, అక్కడ వంటచేసే వ్యక్తులు, పనిచేసే సిబ్బంది, పాజిటివ్ కేసుల సంబంధీకులకు ఈ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే కంటైన్మెంట్ క్లస్టర్లలోని కుటుంబాల్లో జ్వరం, జలుబు, ఇతర సంబంధిత లక్షణాలుంటే ఆ వ్యక్తులకు, బీపీ, షుగర్, కిడ్నీ, టీబీ తదితర వ్యాధిగ్రస్థులకు, పాజిటివ్ కేసులు నమోదైన కుటుంబాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 7 కి.మీ. పరిధిలో, పట్టణ ప్రాంతాల్లో 5 కి.మీ.లోపు నివసిస్తున్న బఫర్ జోన్‌లలోని ప్రజలకు పరీక్షలు నిర్వహించాలన్నారు.