విలయం

ABN , First Publish Date - 2020-06-19T10:40:32+05:30 IST

జిల్లాలో కరోనా విలయం సృష్టిస్తోంది. జెట్‌ స్పీడ్‌తో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు.

విలయం

జిల్లాలో కొత్తగా 67 కరోనా కేసులు..

జెట్‌ స్పీడ్‌తో వ్యాపిస్తున్న వైరస్‌..

అధికారుల వైఫల్యంపై విమర్శలు..


అనంతపురం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విలయం సృష్టిస్తోంది. జెట్‌ స్పీడ్‌తో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులకు ముందు జిల్లాలో  250 దాకా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సడలింపులు ఇవ్వటంతో వైరస్‌ విజృంభనకు ఎదురే లేకుండాపోతోంది. మే చివరి వారం నుంచే జిల్లాలో కరో నా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. గురువారం నమోదైన 67 పాజిటివ్‌ కేసులను కలుపుకుంటే ఇప్పటివరకూ  కరోనా బాధితుల సంఖ్య 647కు చేరింది. ఇందులో అధికారిక లెక్కల ప్రకారం ఆరుగురు చనిపోగా 208మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈలెక్కన 433 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


అనంతను వణికిస్తున్న వైరస్‌

కరోనా తొలిరోజుల్లో హిందూపురం ప్రజలను ఏవిధంగా  భయపెట్టిందో ప్రస్తుతం అనంతనగర వాసులను కూడా అలాగే వణికిస్తోంది. జిల్లా కేంద్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గురువారం నమోదైన కేసుల్లో అత్యధికం అనంతపురం నగరానికి చెందినవే. ప్రభాకర్‌ స్ర్టీట్‌, అంబేడ్కర్‌నగర్‌, వేణుగోపాల్‌నగర్‌, పాతవూరు, రాణినగర్‌, టవర్‌క్లాక్‌, కక్కలపల్లికాలనీ, నీరుగంటి వీధి, ఓబుళదేవనగర్‌, విద్యుత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో 45 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  మిగిలిన కేసులు జిల్లాలో పలుచోట్ల బయటపడ్డాయి. అనంతపురంలోని ఓ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి, అనంతపురం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో పనిచేసే మరో అధికారికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా వెల్లడికాలేదు.


వైఫల్యంపై విమర్శలు

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో జిల్లా అధికార యం త్రాంగం వైఫల్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  కరోనా అనుమానితుల నుంచి శాంపిళ్ల సేకరణ నత్తనడక న సాగుతుండటం వైరస్‌ వ్యాపికి ప్రధాన కారణమవు తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. శాంపిళ్లు వేగంగా సేకరించి, పరీక్షలు, ఫలితాలు అదేస్థాయిలో నిర్వ హించినట్లయితే జిల్లాలో ఇంత తీవ్రస్థాయిలో కరోనా ఉం డేది కాదన్న భావన బలంగా వినిపిస్తోంది.


గుంతకల్లులో ముగ్గురికి..

పట్టణం, మండలంలో మూడు కరోనా కేసులు నమోదైనట్లు కొవిడ్‌-19 ఇన్‌చార్జ్‌ వైద్యాధికారి కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. పట్టణంలోని ఆచారమ్మ కొట్టాలకి చెందిన ఓ వ్యక్తి, మోదినాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక, మండలంలోని దోనిముక్కల గ్రామానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు. వీరిలో ఇద్దరిని అనంతపురం తరలించి, ఒకరిని హోం క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు.


మడకశిరలో ఆరు..

మడకశిర/మడకశిర టౌన్‌:  పట్టణంలో  ఆరు కరో నా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. రెండు రోజుల క్రితం సాయినగర్‌లో కరోనా పాజిటివ్‌తో ఓ వ్యక్తి మృతిచెందాడు. అతడి కాంటాక్ట్‌కు సంబంధించి పలువురిని క్వారంటైన్‌కు తరలించి, కరోనా పరీక్షల నిమిత్తం పంపారు. వారిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. గురువారం సాయినగర్‌ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి, బారికేడ్లు ఏర్పాటుచేశారు.


బత్తలపల్లిలో ఇంకొకటి..

మండలకేంద్రంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. స్థానిక వడ్డె వీధిలో ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి తేజశ్రీ తెలిపారు. ఇతడి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.


ముదిగుబ్బలో ఇద్దరికే..

మండలకేంద్రంలో ఇద్దరికే కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నాయనీ, అధికార పార్టీ నాయకుడికి లేవని తహసీల్దార్‌ అన్వర్‌హుస్సేన్‌ తెలిపారు. కాంటాక్టులో ఉన్న వారిని హోంక్వారంటైన్‌లో ఉంచి, పరీక్షలు చేస్తామన్నారు. 


యాడికిలో మరో రెండు ..

స్థానిక సిండికేట్‌ బ్యాంకు వీధిలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఇందులో ఒకరు మహిళ (35), మరొకరు గ్రామ వలంటీర్‌ (20) ఉన్నట్లు తెలిపారు. వారిని ఐసోలేషన్‌కు తరలించారు. వీరితో కాంటాక్ట్‌ ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలించారు. దీంతో మండలంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 27కి చేరింది.


తాడిమర్రి మండలంలో ఆరుగురికి..

మండలంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఆరు నమోదయ్యాయి. తాడిమర్రిలో వైద్యశాఖలో పనిచేస్తున్న ఓ మహిళ, 76 సంవత్సరాల వృద్ధుడు, మద్దలచెరువు గ్రామంలో మహిళ, పెద్దకోట్ల గ్రామంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, ఎస్కేయూ కొవిడ్‌-19 కేంద్రాలకు తరలించారు. సాయంత్రం తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రమణ, వైద్యాధికారి మహేంద్రనాథ్‌, ఎస్‌ఐ శ్రీహర్షలు ఆయా గ్రామాల్లో పర్యటించి, స్థానికులకు సూచనలించ్చారు.


కల్లగళ్లలో ముగ్గురు, ముద్దలాపురంలో ఒకరు..

మండలంలోని కల్లగళ్ల గ్రామంలో ఒకే కు టుంబానికి చెందిన ముగ్గురికి, ముద్దలాపురంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ సరిత పేర్కొన్నారు. ఇటీవల కరోనా సోకిన వ్యక్తి కల్లగళ్లకు వచ్చాడు. దీంతో కుటుంబంలో బాలింతతోపాటు మూడేళ్ల చిన్నారి, 56 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. బాలింతను చూసేందుకు ముద్దలాపురం గ్రామానికి చెందిన మహిళ రావటంతో ఆమెకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


కరోనా నుంచి కోలుకున్న ఆరుగురి డిశ్చార్జ్‌

కరోనా వైరస్‌ నుంచి కోలుకుని ఆరుగురు డిశ్చార్జ్‌ అయినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి నుంచి ఈ ఆరుగురిని డిశ్చార్జ్‌ చేసి, స్వస్థలాలకు పంపినట్లు తెలిపారు.


దుర్గంను  చుట్టేసిన కరోనా.. 

నియోజకవర్గంలో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  ఓ వృద్ధుడు మృతిచెందాడు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత నాలుగు కరోనా కేసు లు వెలుగులోకి వచ్చాయి. బాధితులను తిరుపతి, ఎస్కే యూ కొవిడ్‌ కేంద్రాలకు తరలించారు. పట్టణంలోని పార్వతీనగర్‌, కుర్లపల్లి, తూమకుంట గ్రామాలను అధికారులు రెడ్‌జోన్లుగా గుర్తించారు. గత ఏప్రిల్‌ నెలలో మానిరేవు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కరోనా సోకి మృతిచెందా డు. శెట్టూరు మండలం గంటయ్యదొడ్డి గ్రామానికి చెంది న ఓ వృద్ధురాలికి కరోనా సోకింది. వైద్య సేవల అనంత రం ఆమె స్వస్థత పొందింది. ఆమె కుమారుడికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, చికిత్స అందించారు.


ఈ క్రమంలో కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ రిటైర్డు ఉద్యోగికి, కుర్లపల్లికి చెందిన ఓ వృద్ధుడికి, కుందుర్పి మండలం తూమకుంట గ్రామానికి చెందిన ఓ గర్భిణీ, వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్లు వెల్లడించారు. అదేవిధంగా క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న ముంబైకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ప్రాంతలో కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి తండ్రికి కరోనా పాజిటివ్‌ రావడంతో 89మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ కృష్ణవేణి, కమిషనర్‌ వెంకట్రాముడు తెలిపారు.

Updated Date - 2020-06-19T10:40:32+05:30 IST