దారి తప్పాయా?

ABN , First Publish Date - 2020-07-18T10:36:04+05:30 IST

ఇటీవలే జిల్లాకు వచ్చిన కొత్త 108 వాహనాలు కనిపించట్లేదు. వాటి సైరన్‌ వినిపించట్లేదు.

దారి తప్పాయా?

కష్టకాలంలో వినిపించని కుయ్‌.. కుయ్‌..

వాహనాలు దండి.. సేవలకు గండి..

మండలానికి ఒక 108..

ఇటీవల కొత్తగా 38 వాహనాలు..

రోగులకు తప్పని తిప్పలు..

గాల్లో కలుస్తున్న ప్రాణాలు..


మొన్నమొన్నే

జిల్లాకు కొత్త 108 వాహనాలొచ్చాయి..

ఒకటి కాదు.. రెండు కాదు..

ఏకంగా 38 చేరాయి..


రాజధానిలో ముఖ్యమంత్రి జగన్‌..

జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులు..

ఆర్భాటంగా ప్రారంభించారు..

వాహన దండులా తరలించారు..


వాటిని చూసిన జనం..

ఇక ఫోన్‌ చేస్తే 108 వస్తుందనుకున్నారు..

నాయకులైతే నిమిషాల్లో చేరుతుందన్నారు..

ఎన్నెన్నో ప్రగల్భాలు పలికారు..


తీరు.. ప్రాణాపాయంలో వాటికి ఫోన్‌ చేస్తే..

గంటైనా.. రెండు గంటలైనా రావట్లేదు..

ఇళ్ల వద్ద.. రోడ్ల పైన.. ఆస్పత్రికి తరలించేలోపే..

ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి..


మరి.. కొత్త 108 వాహనాలు

ఏమైనట్లు? ఎక్కడున్నట్లు?

దారి తప్పాయా? దాక్కున్నాయా?

సైరన్‌ మోత వినపడదేం?


108 సకాలంలో రాక..

రోజుకో ప్రాణం పోతుంటే..

కుయ్‌.. కుయ్‌.. కోతలు కోసిన..

నేతలు మాట్లాడరేం?


అనంతపురం వైద్యం, జూలై17: ఇటీవలే జిల్లాకు వచ్చిన కొత్త 108 వాహనాలు కనిపించట్లేదు. వాటి సైరన్‌ వినిపించట్లేదు. జిల్లా కేంద్రం నుంచి ర్యాలీగా వెళ్లిన వాహనాల్లో ప్రాణాపాయంలో గంటలైనా ఒక్క వాహనం రావట్లేదు. మరి.. అవి ఉండీ ఏం ప్రయోజనం?


‘ఫోన్‌ చేసిన నిమిషాల్లోనే 108 వాహనం వస్తుంది. ఆస్పత్రికి తీసుకెళ్తుంది. ప్రాణాలు కాపాడుతుందం’టూ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో కొత్త 108 వాహనాలను పెద్దఎత్తున కొనుగోలు చేసి, ఆర్భాటంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. వాటిలో జిల్లాకు 38 కొత్త 108 వాహనాలను కేటాయించారు. వాటిని జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరోసారి ఆర్భాటంగా ప్రారంభించారు. జిల్లాలోని వాహనాల్లేని మండలాలకు కేటాయించారు. ఆయా ప్రాంతాలకు పంపించారు. దీంతో ప్రజలు ఇక ఏ సమయంలో ఫోన్‌ చేసినా వెంటనే 108 వాహనం వస్తుందనీ, ఆస్పత్రికి తీసుకెళ్తుందని ఆనందపడ్డారు.


వారి ఆశలు అడియాసలవుతున్నాయి. కొత్త వాహనాలు వచ్చినా జిల్లాలో పాత కథే పునరావృతమవుతోంది. జిల్లాలో మొత్తంగా 108 వాహనాలు 69 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 20 వాహనాలను కరోనా బాధితులకు సేవలందించేందుకు వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 49 వాహనాలను సాధారణ రోగులకు కేటాయించామంటున్నారు. అత్యవసర సమయాల్లో 108 వాహనాలు సేవలందించలేకపోతున్నాయి. ఈ కారణంగా ప్రజలు ప్రాణాలు పోతున్నాయి.


ఇటీవల బత్తలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు కొన ఊపిరితో ఉన్నారు. 108 వాహనానికి ఫోన్‌ చేసిన గంటసేపటికి కూడా చేరుకోలేదు. చివరికి ప్రైవేట్‌ వాహనంలో తరలించారు. ఆతర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారిద్దరూ చనిపోయారు. 108 వాహనం వెంటనే స్పందించి ఉంటే బతికేవారని బంధువులు ఆరోపించారు. ఉరవకొండ ఆర్టీసీ బస్టాండులో ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో కుప్పకూలిపోయింది. అక్కడ చూసిన జనం ఆమెకు కరోనా ఉందేమోనని భయపడి 108కు ఫోన్‌ చేశారు. వాహనం రాలేదు. చివరికి పోలీసులకు సమాచారం అందించటంతో అక్కడకు చేరుకుని, ప్రైవేట్‌ వాహనంలో మహిళను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


రెండ్రోజుల క్రితం ఓడీసీ మండలానికి చెందిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మామిళ్లపల్లి ప్రధాన రహదారిలో మూర్ఛ వచ్చి, నడిరోడ్డుపై పడిపోయారు. స్థానికులు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. గంటైనా రాలేదు. దీంతో పోలీసుల సాయంతో మరో వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉరవకొండలో కరోనా పాజిటివ్‌ బాధితుడిని తరలించేందుకు 108, 104 వాహనాలు రాలేదు. గంటలకొద్దీ ఫోన్లు చేసి, పడిగాపులు కాసినా.. ఫలితం లేకపోయింది. చివరికి ఎస్‌ఐ స్పందించి ప్రైవేట్‌ వాహనంలో అనంతపురం తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉరవకొండ పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు చేయించారు. ఫోన్‌ చేసిన వెంటనే 108 వాహనం వచ్చి ఉంటే తన భర్త చనిపోయేవాడుకాదని భార్య కన్నీటిపర్యంతమైంది. ఈ ఘటన రాష్ట్రంలోనే దుమారం రేపింది.


కావాల్సినన్ని ఉన్నా..

జిల్లాలో ప్రస్తుతం 108 వాహనాలు 69 నడుస్తున్నాయి. వీటిలో 20 వాహనాలను కోవిడ్‌ బాధితులను తరలించేందుకు వినియోగిస్తున్నారు. 104 వాహనాలు 61 నడుస్తున్నాయి. డిశ్చార్జ్‌ అయిన కొవిడ్‌ బాధితులను తరలించేందుకు 10 వాహనాలను వాడుతున్నారు. ఇలా 108, 104 వాహనాలు జిల్లాలో దండిగా ఉన్నాయి. అయినా.. సకాలంలో సేవలు అందించలేకపోతున్నాయి. బాధితుల ప్రాణాలతో ఈ వాహన నిర్వహణ సంస్థ చెలగాటమాడుతోందన్న విమర్శలున్నాయి. గతంలో జీవీకే సంస్థ వాహనాలను నిర్వహించేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ వాహనాల బాధ్యతను అరబిందో సంస్థకు అప్పగించారు.


కరోనా సమయంలో 108 వాహనాల పాత్ర కీలకంగా మారింది. ఆ మేరకు సేవలు అందించకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇలా జిల్లాలో వారం, పది రోజుల్లోనే వరుస ఘటనలు జరుగుతుండటం గమనార్హం. ఫోన్‌ చేసిన వెంటనే చేరుకోవాల్సిన 108 వాహనాలు ఎక్కడున్నాయి? ఏం చేస్తున్నాయనేదే? ఇప్పుడు ప్రజల్లో ప్రధాన చర్చ సాగుతోంది. అత్యవసర పరిస్థితుల్లోనే 108 వాహనానికి ఫోన్‌ చేస్తారు. సమయానికి వచ్చి, ఆదుకోకపోతే.. ప్రమాదంలో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు మాత్రం సకాలంలో సేవలందిస్తున్నామని చెబుతున్నారు.


ఈ విషయాన్ని జిల్లా కో-ఆర్డినేటర్‌ వరప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లగా.. అన్ని వాహనాలూ పనిచేస్తున్నాయన్నారు. సకాలంలో స్పందిస్తున్నాయన్నారు. ప్రధానోపాధ్యాయుడి విషయంలో ఆలస్యంగా ఫోన్‌ చేయటం వల్లే అలా జరిగిందని చెప్పుకొచ్చారు. బత్తలపల్లి, ఉరవకొండ  ఘటనల్లో పోలీసులు సంఘటన స్థలంలోనే ఉన్నారు. మరి 108 వాహనం వచ్చి ఉంటే పోలీసులు గంట తర్వాత ప్రైవేట్‌ వాహనాల్లో బాధితులను పంపాల్సిన అవసరం వచ్చి ఉండేదికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


కొవిడ్‌ బాదితులకు ప్రత్యేక వాహనాలు... డాక్టర్‌ అనిల్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి

కొవిడ్‌ బాధితులను తరలించేందుకు ప్రత్యేకంగా 108 వాహనాలను ఏర్పాటు చేశాం. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో 20 వరకూ 108 వాహనాలను కొవిడ్‌కు వినియోగిస్తున్నాం. అనంతపురంలో 12, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, కదిరి, పెనుకొండ, హిందూపురంలో ఒక్కొక్కటి, ఆర్డీటీ బత్తలపల్లిలో 2 వాహనాలను ఏర్పాటు చేశాం. ఉరవకొండ ఘటనపై ఆరా తీశాం.


బాధితుడికి కరోనా లక్షణాలుండటంతో గుంతకల్లు వాహనానికి కనెక్ట్‌ చేశారు. దీంతో కొంత ఆలస్యమైంది. మరోసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే మరో వాహనంలో వెళ్తున్నట్లు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిని ఇంటికి తరలించేందుకు పది 104 వాహనాలను వినియోగిస్తున్నాం. మిగిలినవి నిబంధనల మేరకు ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి ఘటనలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నాం. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-07-18T10:36:04+05:30 IST