Share News

‘అసెంబ్లీ’ జోష్‌తోనే..

ABN , Publish Date - May 06 , 2024 | 11:58 PM

అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన జోష్‌తోనే.. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌ దూకుడు చూపుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పకడ్బందీ వ్యూహాలతో ఈ ఎన్నికలో విజయం సాధించే దిశగా అటు ఎమ్మెల్యేలు.. ఇటు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

‘అసెంబ్లీ’ జోష్‌తోనే..

క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ దూకుడు

మానుకోటలో ఇన్‌చార్జ్‌ మంత్రి తుమ్మల పకడ్బందీ వ్యూహం

లోక్‌సభ గెలుపు బాధ్యతల్లో ఎమ్మెల్యేలు

రేవంత్‌ సభ ఆలస్యంతోనే అధిష్ఠానం అప్రమత్తం

మహబూబాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన జోష్‌తోనే.. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌ దూకుడు చూపుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పకడ్బందీ వ్యూహాలతో ఈ ఎన్నికలో విజయం సాధించే దిశగా అటు ఎమ్మెల్యేలు.. ఇటు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం క్షేత్రంలో కాంగ్రెస్‌ దూసుకుపోతోందన్న చర్చ జరుగుతోంది. మంత్రి తుమ్మల... నిరంతరం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు బాధ్యతలను వారి భుజస్కందాలపైనే వేసుకోవాలంటూ చేసిన సూచనలు కార్యరూపం దాల్చుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవ ఊపుతోనే ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్‌ తగ్గకుండా మరింత పెంచే దిశగా సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ గెలుపు బాధ్యతలు మీదేసుకున్న ఎమ్మెల్యేలు గ్రామాలు, బూత్‌ల వారీగా ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి తమ పార్టీ వైపు దృష్టి సారించిన చోటామోటా నాయకులకు మంచి భవిష్యత్‌ కల్పిస్తామంటూ చేరికల తలుపులను బార్లా తెరిచారు. మొదట్లో ప్రతిపక్షాలను తమ పార్టీలో చేర్చుకోవద్దని అభ్యంతరాలు వ్యక్తం చేసిన స్థానిక నాయకత్వానికి నచ్చచెబుతూ.. ఎవరు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకుని మరీ చేరికలను ప్రొత్సహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో మౌనంగా ఉన్న మండల స్థాయి నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి ఏ కోణంలో కూడా కాంగ్రెస్‌ ఓట్లు చేజారిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇండియా కూటమి తరుపున సీపీఎం, సీపీఐ పార్టీల అగ్రనేతలు, స్థానిక నాయకత్వం కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం కోసం ప్రచార పర్వంలోకి దిగాయి.

సీఎం సభ నేర్పిన గుణపాఠంతో..

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల సమయంలో ఆశామాషీగానే తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజల మద్దతు అదే వస్తుందని తొలి పార్టీ ప్రచార ఎన్నికల జన జాతర సభకు నిర్ణీత సమయానికి జన సమీకరణ చేసే విషయంలో అంతగా దృష్టి సారించలేదు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి మండుటెండల్లో మానుకోటకు నిర్ణీత కాలానికి ముందుగానే చేరుకుని సభాస్థలి నిండే వరకు వేచి చూడాల్సి వచ్చింది. బస్సులోనే సుమారు గంటకు పైగా వేచివున్న ఆయన ఇంటలిజెన్స్‌ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని నిర్వాహకులకు చురకలు అంటించినట్లు సమాచారం. ఆపై రంగంలోకి దిగిన అధిష్ఠానం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రీతిన ప్రజా ఆమోదం పొందగలిగారో ఆస్థాయికి ఏమాత్రం తగ్గకుండా మరింత సింబల్‌ ఓట్లను పెంచాలని ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం సభ నేర్పిన గుణపాఠంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే(మంత్రి, ప్రభుత్వ విప్‌)లు మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, నర్సంపేట, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ బూత్‌ల వారీగా ఓటింగ్‌ పెంచేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో పట్టు సాధించాలంటే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పల్లెలోనూ ఓటు చేజారకుండా స్థానిక నాయకత్వం పాటుపడాలని ఉద్భోదిస్తూ కార్యరంగంలోకి దింపుతున్నారు. వచ్చే వివిధ స్థాయి ఎన్నికల్లో పోటీ పడాలని ఉవ్విలూరుతున్న యువ నాయకత్వానికి ఊతమిస్తూ సుదీర్ఘకాలంగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అలా గ్రామీణ నాయకత్వాన్ని ప్రొత్సహిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

లోక్‌సభ పరిధి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో

మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకచోట మినహా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించింది. ఆతర్వాత ఆ ఒక్క భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో మొత్తం ములుగు, నర్సంపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ప్రాతినిధ్యంలోనే ఉన్నట్టు తేలిపోయింది. ఓట్ల వారీగా చూస్తే ఈ ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు 6,85,897 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 4,43,910 ఓట్లు లభించాయి. బీజేపీకి 34,431 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఈ మూడు పార్టీల నుంచి పాతకాపులైన పోరిక బలరాంనాయక్‌, మాలోతు కవిత, అజ్మీర సీతారాంనాయక్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ ముగ్గురి రాజకీయ నేపథ్యంలో పోరిక బలరాంనాయక్‌ ఒక్కరే కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత రెండుసార్లు ఎంపీగా ఇక్కడ్నుంచే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు. ఇక సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ, ప్రస్తుత అభ్యర్థి మాలోతు కవిత తొలుత కాంగ్రెస్‌ రాజకీయ అరంగేట్రంతోనే 2009లో మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఓటమిపాలయ్యారు. ఆపై తన తండ్రితో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆమె 2019లో బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌పై విజయం సాధించారు. ప్రొఫెసర్‌ అజ్మీర సీతారాంనాయక్‌ తెలంగాణ ఉద్యమ నేతగా మొదట్నుంచి రాజకీయ ప్రాతినిధ్యం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. 2014 ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి పోరిక బలరాంనాయక్‌పై విజయం సాధించారు. 2019 ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆయనను పక్కనబెట్టి మాలోతు కవితకు సీటు ఇవ్వడంతో అప్పట్నుంచే అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ్నుంచైనా బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తుందని ఆశించి భంగపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా టికెట్‌ రాకపోవడంతో బీజేపీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురికి మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానంలోని ఏడు సెగ్మెంట్‌లలో పరిచయాలు, పట్టు ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది.

Updated Date - May 06 , 2024 | 11:58 PM