Share News

భగభగలు..!

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:36 PM

భానుడు భగ్గుమంటున్నాడు. ఉమ్మడి జిల్లా ప్రజలపై సెగలు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయి.

భగభగలు..!
ఎండ వేడిమి తట్టుకోలేక కానుగ మండలు కప్పుకొని బైక్‌పై ప్రయాణం చేస్తున్న వాహనదారులు

ఘన్‌పూర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

రంగారెడ్డి అర్బన్‌ /వికారాబాద్‌ (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 28 : భానుడు భగ్గుమంటున్నాడు. ఉమ్మడి జిల్లా ప్రజలపై సెగలు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. దీంతో రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. జనం అడుగు బయటకు పెట్టేందుకు జంకుతున్నారు. రేపు, ఎల్లుండి జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఘన్‌పూర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం మృగవణి పార్కు సమీపంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం నాగారంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఇదే జిల్లా పూడూరు మండలం మన్నేగూడలో 42.9, కులకచర్ల మండలం పుట్టపహడ్‌లో 42.9, మోమిన్‌పేట్‌లో 42.6, మర్పల్లిలో 42.6, కోట్‌పల్లిలో 42.5, బంట్వారంలో 42డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే జల్లాలోని అన్ని మండలాల్లోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. మండుతున్న ఎండలతో రోడ్లపైకి రావడానికి ప్రజలు జంకుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్న పిల్లలు రోజురోజుకూ పెరిగిపోతున్న ఎండలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 10 గంటల మొదలు సాయంత్రం 6గంటల వరకు సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి మధ్యాహ్నం వేళల్లో వారం రోజులుగా ఎండల తాకిడికి బోసిపోయి కన్పిస్తోంది. ఎండలతో కొనుగోళ్లు లేక గిరాకులు కూడా తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా మండుతున్న ఎండ లు సీజనల్‌ వ్యాపారులకు మాత్రం కలిసొచ్చింది. తాపాన్ని తీర్చుకుందుకు ప్రజలు పండ్లు, శీతల పానీయాలపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాటి విక్రయాలు జోరందుకున్నాయి.

Updated Date - Apr 28 , 2024 | 11:36 PM