Share News

ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం!

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:47 PM

ఒకవైపు లోక్‌సభ ఎన్నికల సమరాంగణం కొనసాగుతుండగానే.. మరోవైపు మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.

ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం!
వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయం

లోక్‌సభ ఎలక్షన్లు ముగియగానే ‘స్థానిక’ ఎన్నికలకు సన్నాహాలు

ఏర్పాట్లు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ఒకవైపు లోక్‌సభ ఎన్నికల సమరాంగణం కొనసాగుతుండగానే.. మరోవైపు మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు మగిసి ఫలితాలు వెలువడగానే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. బ్యాలెట్‌ బాక్సులకు బదులు ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన ఉన్నా.. ఈ సారికి ప్రాదేశిక ఎన్నికలను బ్యాలెట్‌ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు సైతం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సూచించింది. 2019, మే నెలలో విడతల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 4న ముగియనుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బ్యాలెట్‌ బాక్సులు, పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్‌లు సమకూర్చుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్‌లను హైదరాబాద్‌ చంచల్‌గూడలో గల ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లో వచ్చే నెల 15వ తేదీలోగా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయా జిల్లాలకు అవసరం అయ్యే ఎన్నికల సామగ్రి, స్టేషనరీ, ఇతర అంశాలపై జెడ్పీ ఉన్నతాధికారులు లెక్కగట్టే పనులు ప్రారంభించారు. మండల పరిషత్‌ అధికారుల నుంచి సమగ్ర సమాచారాన్ని జిల్లా కేంద్రానికి తెప్పించుకొని అక్కడి నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌కు తెలియపరుస్తున్నారు.

బీసీ రిజర్వేషన్లపై స్పష్టతొచ్చిన తరువాతనే?

ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాల సంఖ్య, రిజర్వేషన్లకు సంబంధించిన సమాచారం జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్ష స్థానాల రిజరే ్వషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సేకరించింది. పాత మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన మండలాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో చౌడాపూర్‌, దుద్యాల మండలాలు కొత్తగా ఏర్పాయ్యాయి. ఇవి గత స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యాయి. అలాగే మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి మండలం కొత్తగా ఏర్పడింది. ఇలా కొత్తగా ఏర్పాటైన ఈ మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సి ఉంది. ఎన్నికల మార్గదర్శకాల హ్యాండ్‌బుక్స్‌, శిక్షణ కార్యక్రమాల పత్రాలు, పుస్తకాలను ముద్రించే విధంగా, సామగ్రిని సిద్ధం చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. రిజర్వేషన్లపై స్పష్టతొచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం కానుంది.

జిల్లాకు అవసరమయ్యే ఎన్నికల స్టేషనరీపై వివరాల సేకరణ

2019, మేలో జరిగిన ఎన్నికల్లో వికారాబాద్‌ జడ్పీ పరిధిలో 18 మండలాల పరిధిలో 1,250 పోలింగ్‌ కేంద్రాలకు 5,625 పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్‌లు అవసరమయ్యాయి. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో నాలుగు వంతున పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్‌లు అవసరమవుతాయి. జిల్లా అవసరం మేరకు పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్‌లకు అదనంగా మరో 20శాతం ముద్రించాల్సి ఉంది. బ్యాలెట్‌ బాక్సులకు పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్‌లు అతికించాలి. పేపర్‌ సీళ్లతో పాటు పోలింగ్‌ కేంద్రం, గ్రామం, మండలం, జిల్లా వివరాలను సూచించే ట్యాగ్‌లపై తెలుగు, ఇంగ్లిష్‌ అక్షరాల్లో ముద్రిస్తారు. జిల్లాలో అందుబాటులో ఉన్న బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జడ్పీ అధికారులకు సూచించింది.

Updated Date - Apr 28 , 2024 | 11:47 PM