Share News

మరోసారి మోదీని గెలిపించాలి

ABN , Publish Date - May 09 , 2024 | 12:48 AM

దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి కూడా ప్రధాని కావడం కోసం బీజేపీకి ఓటు వేసి, డీకే అరుణమ్మను గెలిపించాలని సినీనటి, బీజేపీ ఎంపీ నవనీత్‌కౌర్‌ అన్నారు. దేశ భద్రత, అభివృద్ధి, సంక్షేమం కోసం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేస్తే పాకిస్థాన్‌ను సమర్థించినట్టే అవుతుందన్నారు.

మరోసారి మోదీని గెలిపించాలి
మాట్లాడుతున్న ఎంపీ నవనీత్‌ కౌర్‌

షాద్‌నగర్‌ రోడ్‌షోలో బీజేపీ ఎంపీ, సినీ నటి నవనీత్‌కౌర్‌

షాద్‌నగర్‌ అర్బన్‌/ కొత్తూర్‌/కేశంపేట, మే 8: దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి కూడా ప్రధాని కావడం కోసం బీజేపీకి ఓటు వేసి, డీకే అరుణమ్మను గెలిపించాలని సినీనటి, బీజేపీ ఎంపీ నవనీత్‌కౌర్‌ అన్నారు. దేశ భద్రత, అభివృద్ధి, సంక్షేమం కోసం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేస్తే పాకిస్థాన్‌ను సమర్థించినట్టే అవుతుందన్నారు. షాద్‌నగర్‌ కేంద్రంలో బుధవారం రాత్రి బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. నవనీత్‌కౌర్‌ హాజరై ప్రసంగించారు. 2014కు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రావాలని పాకిస్థాన్‌ కోరుతున్నదన్నారు. రాహుల్‌ గాంధీ గెలవాలని, ప్రధాని కావాలని పాకిస్థాన్‌ నుంచి ప్రేమ పూర్వక సందేశాలు వస్తున్నాయన్నారు. దాయాది దేశాలను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు ఓటు వేయడం అవసరమా? అని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళ అయిన డీకే అరుణను అవహేళన చేస్తూ మాట్లాడడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలని, దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న బీజేపీకి ఓటు వేయాలని నవనీత్‌కౌర్‌ కోరారు. డీకే అరుణ మాట్లాడుతూ బీజేపీకి ఓటు వేసి, తనను గెలిపించాలని కోరారు. నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, బాబయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, తదితరులున్నారు. రేవంత్‌రెడ్డికి నా ముందు నిలబడి సవాళ్లు ఎదుర్కొనేందుకు ధైర్యం ఉందా అని డీకే అరుణ సవాలు విసిరారు. కొత్తూర్‌ మండలం ఇన్ముల్‌నర్వలో రోడ్‌షోతో పాటు మున్సిపాలిటీ కొత్తూర్‌, తిమ్మాపూర్‌లలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లలో ఆమె మాట్లాడారు. కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. దేశానికి మోదీ గ్యారెంటీ అని, మరోసారి ఆయన ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఎంపీగా తనను గెలిపిస్తే పాలమూరుకు డీకే అరుణమ్మ గ్యారెంటీగా ఉంటుందని అరుణ అన్నారు. కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, వేముల్‌నర్వ, కేశంపేట, కొత్తపేట, అల్వాల, ఎక్లా్‌సఖాన్‌పేటలలో ప్రచారం నిర్వహించారు. అలాగే మంగళగూడకు చెందిన కొట్టం సుధాకర్‌రెడ్డి అనుచరులతో కలిసి అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. విష్ణువర్ధన్‌ రెడ్డి, శ్రీవర్ధన్‌ రెడ్డి, బాబయ్య, మండలాధ్యక్షుడు రాఘురాములు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:48 AM