Share News

ఆర్టీసీ కార్మికులపై పనిభారం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:08 AM

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పనిభారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక పనులతో అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. సిబ్బంది కొరతను సాకుగా చూపి అదనపు పనులు అప్పగిస్తున్నారని ఉద్యోగులు గగ్గోలుపెడుతున్నారు.

ఆర్టీసీ కార్మికులపై పనిభారం

అదనపు డ్యూటీతో తీవ్ర ఇబ్బందులు

అనారోగ్యానికి గురవుతున్న ఉద్యోగులు

ప్రశ్నించిన వారిని టార్గెట్‌ చేస్తున్న అధికారులు

తీవ్ర ఆందోళనకు గురవుతున్న ఉద్యోగ, కార్మికులు

నల్లగొండ: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పనిభారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక పనులతో అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. సిబ్బంది కొరతను సాకుగా చూపి అదనపు పనులు అప్పగిస్తున్నారని ఉద్యోగులు గగ్గోలుపెడుతున్నారు. ఇదేంటని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే టార్గెట్‌ చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

నల్లగొండ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, దేవరకొండ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి డిపోలు ఉన్నాయి. మోటార్‌ వెహికల్‌ చట్టం ప్రకారం 8గంటల వరకు మాత్రమే డ్యూటీ చేయాలి. కానీ, నల్లగొండ రీజియన్‌లో 16 నుంచి 18గంటలు విధుల్లో ఉండే పరిస్థితులు కల్పిస్తుండటంతో ఉద్యోగులు, కార్మికులు అవస్థ పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, ఇతర నగరాలకు వెళ్లి రావాలంటే ఒక్కోసారి అర్ధరాత్రి 1గంట వరకు అవుతోంది. ట్రాఫిక్‌ కారణంగా అదనంగా డ్యూటీ చేయాల్సి వస్తోందని ఉద్యోగులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనారోగ్యం పాలవుతున్న కార్మికులు

రాష్ట్రంలో ప్రభుత్వం మారాక తమ జీవితాలు బాగు పడుతాయని ఆర్టీ సీ కార్మికులు ఆశ పెట్టుకున్నారు. అయితే ఆర్థిక అంశాల పరిస్థితి ఎలా ఉ న్నా పెరిగిన పని భారంతో అష్టకష్టాలు పడుతున్నారు. విధి నిర్వహణలో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు కూడా గురవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళ ల ఆదరణకు నోచుకుంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరిగి ఉద్యోగులపై పని భారం పెరిగింది. పాత బస్సుల కారణంగా అధిక లోడ్‌తో బస్సులవేగం, మైలేజీ తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. సంస్థ వైఖరిని కార్మిక సంఘాలు, సంక్షేమ మండళ్లు పట్టించుకోకపోవడంతో కార్మికులకు ఎటూ పాలుపోవ డం లేదు. కొన్ని డిపోల్లో అధికారులు కార్మికులపై ప్రతాపం చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ డిపోలో రన్నింగ్‌ టైమ్‌ను కుదించి అదనంగా ట్రిప్పులు పెంచడంతో ఉద్యోగులు లబోదిబో మంటున్నారు. ఉదయం 5గంటలు లేదా 6గంటలకు డ్రైవర్‌, కండక్టర్లకు డ్యూటీ మొదలైతే రాత్రి 12గంటలు, అర్ధరాత్రి 2గంటల వర కువిధుల్లో ఉండాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ హిళా ఉద్యోగులుసైతం అదనపు సమయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సెలవుల మంజూరుకు పలు కొర్రీలు

ఆర్టీసీలో ఉన్నతాధికారులు డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కార్మికులకు, ఇతర సిబ్బందికి సెలవులు మంజూరు చేయకుండా పలు కొర్రీలు పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మహిళా కండక్టర్లకు సైతం సెలవులు మంజూరు చేయడం లేదని తెలుస్తోంది. సెలవు అవసరమైతే డబుల్‌ డ్యూటీ చేయాలని నిబంధన పెడుతున్నట్టు వినికిడి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత వేసవిలో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా తమపై కనికరం చూ పించడం లేదని, అదనపు డ్యూటీలతో సతాయిస్తున్నారని వాపోతున్నారు. కొన్ని డిపోల అధికారులు, సూపర్‌వైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా కార్మిక సంఘాలు, సంక్షేమ మండళ్లు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయని, ఇక తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఉద్యోగ, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు ఆయా డిపోల అధికారులతో చర్చించి అధిక పనిభారాన్ని తగ్గించేలా చూడాలి. అదనపు డ్యూటీలతో నిద్ర కరువై ప్రమాదాలబారిన పడే అవకాశం ఉంది. దీంతో డ్రైవర్లతోపాటు బస్సులో ఉండే ప్రయాణికులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదనపు పనిభారం తగ్గించాలని కోరుతున్నారు.

అవసరమైన వారికి సెలవులు ఇస్తున్నాం : రాంమోహన్‌రెడ్డి, నల్లగొండ డీఎం

అవసరం ఉన్న ఉద్యోగులతో పాటు డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులు మంజూ రు చేస్తున్నాం. ఒకోక్కసారి ట్రాఫిక్‌ ఉన్నప్పుడు అదనపు సమయం పట్టి బస్సు లు ఆలస్యంగా డిపోకు చేరుతున్నాయి. సంస్థ నిబంధనల మేరకు మహిళా కండక్టర్లకు కూడా సెలవులు ఇస్తున్నాం. అదనపు డ్యూటీ చేసిన డ్రైవర్లకు, కండ్లక్టర్లకు స్పెష ల్‌ ఆఫ్‌ కూడా ఇస్తున్నాం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా బస్సులు నడపాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత లేదు.

Updated Date - Apr 29 , 2024 | 12:08 AM