Share News

దిగుబడి, ధరలేక నిమ్మరైతు చిత్తు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:06 AM

పంట చేతికి వచ్చినప్పుడు ధర లేక, ధర పెరిగాక దిగుబడి లేక నిమ్మ రైతులు ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 20వేల ఎకరాల్లో రైతులు నిమ్మ తోటలు సాగు చేశారు.

దిగుబడి, ధరలేక నిమ్మరైతు చిత్తు

దిగుబడి తగ్గాక ధర రూ.3,500

పంట చేతికొచ్చిన సమయంలో టిక్కీ ధర రూ.1,500

ఉమ్మడి జిల్లాలో 20వేల ఎకరాల్లో నిమ్మ సాగు

కోదాడ: పంట చేతికి వచ్చినప్పుడు ధర లేక, ధర పెరిగాక దిగుబడి లేక నిమ్మ రైతులు ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 20వేల ఎకరాల్లో రైతులు నిమ్మ తోటలు సాగు చేశారు. అందుకు ఎకరాకు రూ.1,17,6 80 చొప్పున, రూ.235.36కోట్లు పెట్టబడి పెట్టారు. దిగుబడి బాగుందని ఈ ఏడాది ఆదాయం పొందవచ్చని రైతులు ఆశించగా, పంటచేతికి వచ్చే మార్చి నెలలో ధర తగ్గింది. ఏప్రిల్‌ మాసంలో ధర పెరిగినా దిగుబడి లేక రైతులు దిగాలు పడ్డారు.

నిమ్మ సాగులో పెట్టుబడులు పెరగడం, రవాణా ఖర్చులు, వ్యాపారు ల కమీషన్ల బెడద, దిగుబడి వచ్చే తరుణంలో ధర లేక నిమ్మతోటలు సాగుచేస్తున్న రైతులు ఏటా నష్టపోతున్నా రు. పంట దిగుబడి వచ్చిన మార్చి నెలలో నిమ్మకాయలు కిలో రూ.30 ధర ఉంది. దిగుబడి తగ్గగానే ఏప్రిల్‌ మాసంలో కిలో రూ.70కి ధర పెరిగింది. ధర పెరిగినా దిగుబడి లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. వర్షాకాలంలో కిలో నిమ్మ ధర కేవలం రూ.6 మాత్రమే ఉంది. ఆరుగా లం ఎండనక, వాననక కష్టపడినా, పంట చేతికి వచ్చిన సమయంలో ధర లేక పెట్టుబడులు కూడా వెళ్లలేదని, పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కలేదని రైతులు పేర్కొంటున్నారు. సీజన్‌తో నిమిత్తం లేకుండా కిలో నిమ్మకాయల ధర రూ.45 ఉండేలా ప్రభుత్వం నియంత్రిస్తేనే నష్టపోకుండా ఉంటామని రైతులు వేడుకుంటున్నారు. ఇప్పటికే మద్దతు ధరలేక ఏటా నష్టాలు భరించలేక, రైతులు నిమ్మసాగును తగ్గిస్తూ, ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు రైతులు రూ.1,17,680 ఖర్చు చేస్తే, రూ1,44,000 మాత్రమే ఆదాయం వచ్చింది. ఖర్చులు పోగా ఎకరాకు రూ.26వేలు మాత్రమే రైతుల కు మిగిలాయి. అంటే నెలకు రూ.2వేల చొప్పున మాత్రమే రైతు కు ఆదాయం లభించింది. ఐదు ఎకరాలు సాగు చేస్తే నెలకు రూ.10వేలు లాభం. ఈ నేపథ్యంలో పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇల్లు గడవడం, పిల్లల చదువులు ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిమ్మ రైతులు తోటలను కొనసాగించాలంటే ప్రభు త్వం మార్కెట్‌తో పనిలేకుండా నేరుగా కిలో రూ.45 చొప్పున కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

20వేల ఎకరాల్లో నిమ్మ సాగు

ఉమ్మడి జిల్లాలో రైతులు సుమారు 20వేల ఎకరాలలో నిమ్మతోటలు సాగు చేశారు. ఎకరాకు 80 నిమ్మ మొక్కలు నాటుతారు. నాలుగేళ్ల తరువాత నిమ్మ చెట్టు కాపునకు వస్తుంది. వర్షాకాలంలో ఎండుపుల్ల తీసేందుకు ఒక్కో చెట్టుకు రూ.50, పాదులు తీసేందుకు రూ.60, పైమందులకు రూ.375, సేంద్రీయ ఎరువు, దుక్కి మందుకు రూ.312, కూలీల రవాణాకు రూ.125, కమీషన్‌దారుడికి రూ.100కు రూ.12, కూలీలకు రూ.125 చొప్పున, నిమ్మకాయల టిక్కీ రవాణాకు రూ.100 మొత్తంగా ఒక నిమ్మచెట్టు కు ఏడాదిలో రూ.1,471 చొప్పున వ్యయం అవుతోంది. ఎకరాకు 80 మొక్కలకు రూ.1,17,680 ఖర్చు వస్తోంది. ఒక చెట్టు వానాకాలంలో 50కిలోలు, వేసవిలో 50 కిలోల (టిక్కీ) మేర దిగుబడి ఇస్తుంది. కాగా, వానాకాలంలో కిలో నిమ్మకాయల ధర రూ.6 ఉండగా, మార్చిలో రూ.30కి పెరిగింది. ఎకరాకు వానాకాలంలో ఒక చెట్టుకు (6 ఏళ్ల వయసు) 50కిలోల టిక్కీ దిగుబడి రాగా, కిలోకు రూ.6 చొప్పున రూ.300 మేర ఆదాయం వచ్చింది. మార్చి వచ్చేటప్పటికీ టిక్కీకి రూ.30 ధర పెరగ్గా, ఆదాయం రూ.1,500 వచ్చింది. మొత్తంగా క్వింటాకు రూ.1,800 ఆదాయం వచ్చింది. ఆ చొప్పున ఎకరాల్లో 80 నిమ్మ చెట్లకు రూ.1,44,000 ఆదాయం వచ్చింది. ఎకరా మొక్కల పెంపకానికి రూ.1,17,680 పోగా రైతుకు రూ.26,320 మాత్రమే మిగిలింది. ఉమ్మడి జిల్లాలో 20వేల ఎకరాల్లో రైతులు నిమ్మ తోటలు సాగు చేయగా, అందుకు రూ.235.36కోట్లు ఖర్చు చేయగా, ఆదాయం మాత్రం రూ.288కోట్లు వచ్చింది. ఖర్చులు పోగా రూ.52.64కోట్లు మిగిలాయి. అంటే ఎకరాకు నెలకు రూ.2,000 మాత్రమే రైతుకు దక్కాయి.

కిలో రూ.45కు కొనుగోలు చేయాలి : షేక్‌ పెంటుసాహెబ్‌, నిమ్మరైతు

సీజన్‌తో పని లేకుండా ప్రభు త్వం కిలో నిమ్మకాయలు రూ.45 కొనుగోలు చేసినప్పడే రైతుకు లాభం ఉంటుంది. అప్పుడు ఖర్చులు పోగా ఎకరాకు రూ.3లక్షలకు పైబడి ఆదాయం వస్తుంది. ఒక ఏడాది లాభం వచ్చి, ఒక రాకపోయినా ఇబ్బంది ఉండదు. కానీ ఏటా ఖర్చుకు తగ్గట్టు ఆదాయం లేకపోవడంతో నిమ్మ తోటలు సాగు చేయాలనే ఆలోచన రావడం లేదు. బహిరంగ మార్కెట్‌లో ఒక నిమ్మకాయ ధర రూ.10 నుంచి రూ.12 వరకు పలుకుతోంది. ఆ ధర రైతుకు వస్తే సాగువైపు ఉత్సాహంగా మొగ్గుచూపుతారు. డీజిల్‌, కూలి, మందుల ధరలు, రవాణా ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. వాటికి అనుగుణంగా మార్కెట్‌లో నిమ్మకాయల ధర ఉండం లేదు. ఫలితంగా నిమ్మసాగు వైపు రైతులు మొగ్గుచూపడంలేదు. ఉమ్మడి జిల్లాకు ఒకప్పుడు నిమ్మసాగులో రాష్ట్రస్థాయిలో పేరు ఉండేది. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ఏటా 100 నుంచి 150 ఎకరాల్లో రైతుల నిమ్మచెట్లు తొలగించి ఇతర పంటలను సాగుచేస్తున్నారు. కొత్తగా ఎవ్వరూ నిమ్మసాగుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని మద్దతు ధర కల్పిస్తేనే నిమ్మతోటల మనుగడ ఉంటుంది.

కాలం అనుకూలించకపోతే అప్పులపాలే : రమణారెడ్డి, నిమ్మ రైతు

కాలం అనుకూలిస్తే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30 వేలు వస్తాయి. మంగులాంటి తెగుళ్లు వస్తే పెట్టిన పెట్టుబడు లు కూడా రావు. పలు రకాల ఉత్పత్తుల్లో నిమ్మను వాడుతున్న క్రమంలో ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి రైతులను ప్రోత్సహించాలి. లేదంటే చివరకు నిమ్మకాయలను సైతం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే నిమ్మకాయల కిలో ధర రూ.40 నుంచి రూ.50 ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతులు నిమ్మసాగు చేసేలా ప్రోత్సహించాలి.

Updated Date - Apr 29 , 2024 | 12:06 AM