Share News

ట్రాన్స్‌కోకు నష్టం రూ.1.36కోట్లు

ABN , Publish Date - May 09 , 2024 | 12:11 AM

మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానలతో ట్రాన్స్‌కో సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. కొంచెం బలంగా గాలి వీచినా, పిడుగు పడినా విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం పరిపాటిగా మారింది.

ట్రాన్స్‌కోకు నష్టం రూ.1.36కోట్లు

ఉమ్మడి జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు

సబ్‌స్టేషన్ల పరిధిలో దెబ్బతిన్న ఫీడర్లు

గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న మరమ్మతు పనులు

మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానలతో ట్రాన్స్‌కో సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. కొంచెం బలంగా గాలి వీచినా, పిడుగు పడినా విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం పరిపాటిగా మారింది. అయితే ఈదురుగాలులకు పెద్ద పెద్ద స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. నేలకూలిన స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చి, మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్‌ఫార్మలను బాగు చేసే పనిలో ట్రాన్స్‌కో సిబ్బంది నిమగ్నమయ్యారు. మూడు రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో మరమ్మతులు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో ట్రాన్స్‌కోకు రూ.1.36 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.21లక్షలు, సూర్యాపేట జిల్లాలో రూ.80లోలు, నల్లగొండ జిల్లాలో రూ.30లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

నల్లగొండ టౌన్‌: గడిచిన మూడు రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో విద్యుత్‌ శాఖకు రూ.30లక్షల నష్టం వాటిల్లింది. జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నల్లగొండ పట్టణంతోపాటు కనగల్‌, తిప్పర్తి, శాలిగౌరారం, మునుగోడు, త్రిపురారం తదితర మండలాల్లో ఈదురుగాలులు సృష్టించిన బీభత్సానికి అనేక చోట్ల స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ శాఖ అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో 90 విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం కాగా విద్యుత్‌ లేన్లు తెగిపడ్డాయి. మరో ఐదు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమై ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం తలెత్తింది. ఈదురు గాలులతో రూ.30లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు విద్యుత్‌ మరమ్మత్తులను వెంటనే చేపట్టి సరఫరాను పునరుద్ధరించినట్లు ఎస్‌ఈ చంద్రమోహన్‌ తెలిపారు.

భానుపురి: సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల కు, వర్షాలతో విద్యుత్‌ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. రెండ్రోజుల క్రితం వీచిన ఈదురుగాలు లు, ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు కు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు సైతం పని చేయని పరిస్థితి ఏర్పడింది. వీటి మరమ్మతు పనుల్లో సిబ్బంది తలమునకలయ్యారు. విద్యుత్‌ శాఖకు సుమారు రూ.80లక్షల నష్టం వాట్లిందని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్టీ స్తంభాలు 192 ధ్వంసం కాగా ఇప్పటి వరకు 86 స్తంభాలను వాటి స్థానాల్లో అమర్చారు. మిగిలిన స్తంభాలను అమర్చే పనుల్లో సి బ్బంది నిమగ్నమయ్యారు. 11 కేవీ విద్యుత్‌ స్తంభాలు 124 కూలిపోగా 60 స్తంభాలను అ మర్చారు. మిగతా 64 స్తంభాలను అమర్చే పనుల్లో సిబ్బంది ఉన్నారు. జిల్లాలో అకాల వర్షం, పిడుగుపాటు కు మూడు ఉపకేంద్రాలు తప్ప ఏవీ కూడా పని చేయలేదని, సిబ్బంది పనుల్లో నిమగ్నమై మరమ్మతు పనులను పూర్తి చేసి విద్యుత్తుకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొన్నారు. సూ ర్యాపేట జిల్లాలో మునగాల, రామాపురం, ఆత్మకూర్‌(ఎస్‌), నూతనకల్‌, మద్దిరాల, చివ్వెంల, సూర్యాపేట, పెన్‌పహాడ్‌, హుజూర్‌నగర్‌ డివిజన్‌లలో అక్కడక్కడ నష్టం జరిగింది. ఆత్మకూర్‌, నూతనకల్‌, మద్దిరాలలో 38 స్తం భాలు కూలిపోగా, ఫీడర్లు సైతం ధ్వంసమయ్యాయి. మా రుమూల గ్రామాల్లో మరమ్మతు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో పనులను పర్యవేక్షణ చేయడానికి ము గ్గురు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 14ఫీడర్లకు 13 ఫీడ ర్లు పిడుగుపాటుకు గురై మరమ్మతులకు వచ్చాయి. ము నగాల మండలంలో నాలుగు ఫీడర్లు ధ్వంసమయ్యాయి.

ట్రాన్స్‌కోకు రూ.21లక్షల ఆస్తి నష్టం

భువనగిరి టౌన్‌: ఇటీవల కురిసిన వరుస వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగడంతో పాటు ట్రాన్స్‌కోకు భారీ ఆస్తినష్టం సంభవించింది. అయితే ధ్వంసమైన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చుతూ విద్యుత్‌ సరఫరాను పునరుద్దరిస్తున్నారు. ఈ నెల 5న జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, వీచిన గాలులతో 11కేవీ స్తంభాలు 55, ఎల్‌టీ స్తంభాలు 108, ఎనిమిది ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. అలాగే 7వ తేదీన కురిసిన భారీ వర్షాలతో 11కేవీ స్తంభాలు 18, ఎల్‌టీ స్తంభాలు 39, రెండు ట్రాన్స్‌పార్మర్లు ధ్వంసమయ్యాయి. దీంతో జిల్లా ట్రాన్స్‌కోకు రూ.21.70లక్షల ఆస్తినష్టం జరిగింది. ఆస్తినష్టంతో నిమిత్తం లేకుండా విద్యుత్‌ సరఫరాను పునరుద్దరిస్తూ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాను చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఐ శ్రీనాథ్‌ తెలిపారు.

మూడు రోజులుగా మరమ్మతులు : పాల్‌రాజ్‌, ఎస్‌ఈ, సూర్యాపేట

మూడు రోజుల నుంచి విద్యుత్‌ సిబ్బంది తీరిక లేకుండా ఉన్నారు. రాత్రింబవళ్లు గ్రామాల్లో, విద్యుత్‌ సబ్‌స్టేషన్లలోనే ఉంటున్నారు. మరమ్మతులకు వచ్చిన వాటిని సరిచేసి ఎప్పటికప్పుడు విద్యుత్‌ సరఫరాను చేస్తున్నాం. ప్రత్యేకంగా అధికారులను నియమించి ఈదురు గాలుల పనులను పర్యవేక్షణ చేయిస్తున్నాం. ఇంకా నాలుగురోజుల పాటు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. జిల్లాలో రూ.80 లక్షల నష్టం వాటిల్లింది.

Updated Date - May 09 , 2024 | 12:11 AM