Share News

కూరెళ్ల విఠలాచార్యకు నేడు పద్మశ్రీ ప్రదానం

ABN , Publish Date - May 09 , 2024 | 12:24 AM

సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చిరెండు లక్షలకు పైగా పుస్తకాలు సమకూర్చి సమాజానికి అంకితం చేసిన మధుర కవి కూరెళ్ల విఠలాచార్య డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు.

కూరెళ్ల విఠలాచార్యకు నేడు పద్మశ్రీ ప్రదానం

రాష్ట్రపతి భవన నుంచి పిలుపు

ఢిల్లీలో రాష్ట్రపతి నుంచి అందుకోనున్న సాహితీవేత్త

రామన్నపేట, మే 8: సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చిరెండు లక్షలకు పైగా పుస్తకాలు సమకూర్చి సమాజానికి అంకితం చేసిన మధుర కవి కూరెళ్ల విఠలాచార్య డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనలో గురువారం జరిగే కార్యక్రమంలో ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పురస్కారాన్ని అందజేయనున్నారు. రాష్ట్రపతి భవన ఆహ్వానం మేరకు ఆయన బుధవారం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన విఠలాచార్య 1938, జూలై 9న కూరెళ్ల వెంకటరాజయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. విద్యార్థి దశలోనే రచనా వ్యాసంగానికి ఆయన శ్రీకారం చుట్టారు. విఠలేశ్వర శతకం, స్మృత్యంజలి, కూరెళ్లపద్యకుసుమాలు వంటి రచనలు బాగా ప్రాచుర్యం పొందాయి. 1959లో రామన్నపేట మండలంలోని మునిపంపులలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. జీవితమంతా మారుమూల గ్రామాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లుతూ ఎందరో కళాకారులను వెలుగులోకి తెచ్చారు. సాహితీ సంచారి అయిన ఆయన భుజాలకు వేలాడే సంచుల నిండా పుస్తకాలు పంచుతూ వట్టికోట ఆళ్వార్‌స్వామి వారసుడిగా గుర్తింపు పొందారు. 1961లో ‘బాపూ భారతి’అనే చిన్న లిఖిత పత్రికను స్థాపించారు. విఠలాచార్యను అభినవ పోతన, మధురకవి, సుధీతిలకం బిరుదులతో వివిధ సందర్భాల్లో సన్మానించారు. మధురకవిగా ప్రాచుర్యం పొందారు. చదువుకోవడానికి పుస్తకాలు దొరక్కపోవడంతో తనలా మరొకరు అవస్థలు పడకూడదని భావించి 2014లో తన సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. అందులో రెండు లక్షలకు పైగా పుస్తకాలు సమకూర్చి సమాజానికి అంకితం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక సాహితీ సంస్థలు స్థాపించి ఎందరో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కవులు, కళాకారులను వెలికి తీసేందుకు ఈ సంస్థలు కృషి చేశాయి. సాహిత్య ప్రజాసేవ అందిస్తున్న ఆయనను ‘మనకీ బాత’ కార్యక్రమంలో 2021 సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోదీ ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటీవల దాశరథి పురస్కారంతో తెలంగాణ ప్రభుత్వం విఠలాచార్యను గౌరవించింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అభిమానించారు. అనంతరం తొలి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.

===================

Updated Date - May 09 , 2024 | 12:24 AM