Share News

పాతాళగంగ కోసం అన్వేషణ

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:10 AM

కాలు అడ్డంపెడితే సాగునీరు ప్రవహించే సాగర్‌ ఆయకట్టుపై కరువు ఛాయలు కమ్ముకున్నాయి. గడిచిన ఏడాదికాలంగా కర్షకులు సాగునీటి కోసం పడరాని పాట్లుపడుతున్నారు.

పాతాళగంగ కోసం అన్వేషణ

అశాస్త్రీయ పద్ధతిలో బోరుపాయింట్ల గుర్తింపు

తవ్వకాలు చేయించి నష్టపోతున్న రైతులు

ఏడాదిగా సాగర్‌ ఆయకట్టులో గడ్డుపరిస్థితులు

గణనీయంగా పడిపోయిన భూగర్భజలాలు

సాగునీటికోసం భగీరథ యత్నాలు

మిర్యాలగూడ అర్బన్‌: కాలు అడ్డంపెడితే సాగునీరు ప్రవహించే సాగర్‌ ఆయకట్టుపై కరువు ఛాయలు కమ్ముకున్నాయి. గడిచిన ఏడాదికాలంగా కర్షకులు సాగునీటి కోసం పడరాని పాట్లుపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడ్డ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఽధాన్యపు సిరులు కుమ్మరించే సాగ ర్‌ ఆయకట్టును ఎడారిగా మార్చేశాయి. రెండు దశాబ్దాల క్రితం రైతులు తవ్వుకున్న బోరుబావుల ఆధారంగా వరిసాగైతే, సాగర్‌ ప్రాజెక్టు నీటిపై ఆధారపడ్డ భూములన్నీ గత వానాకాలం, యాసంగి సీజన్లలో పడావుపడ్డాయి. దీంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.

వర్షాభావ పరిస్థితులతో ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో బో రుబావులకు నీరందక పొట్టదశలోనే వందలాది ఎకరాల్లో వరిపైరు నిలువునా ఎండిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఈ గడ్డుపరిస్థితులను అధిగమించేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాల పై దృష్టిపెట్టారు.పాతాళగంగను బయటికి తెచ్చుకునేందుకు అన్వేషణ మొదలుపెట్టారు. ప్రభుత్వపరం గా జియాలజికల్‌ సర్వేకు మోక్షం దక్కకపోవడంతో జలధారలు గుర్తించేందుకు అశాస్త్రీయ మార్గాలను ఎంచుకుంటున్నారు.కొబ్బరికాయ,తంగేడుపుల్ల, నిమ్మకాయ, కోడిగుడ్డుతో భూగర్భజలాలను గుర్తించి బోరుపాయింట్లు నిర్ధారిస్తున్నారు. గ్రామాల్లో ఒకటి, రెండుచోట్ల నిర్ధారించిన బోరుపాయింట్లు సఫలీకృ తం కావడంతో ఈ మార్గాన్ని రైతులు ఎంచుకుంటున్నారు.దీంతో అశాస్త్రీయపద్ధతిలో బోరుపాయింట్లను గుర్తించేందుకు కొందరు వ్యక్తులను ఆశ్రయిస్తున్నా రు. రైతులఅమాయకత్వం, అవసరాన్ని వారు సొ మ్ముచేసుకుంటున్నారు. వ్యవసాయ భూమిలో కలియదిరిగి బోరుపాయింట్‌ నిర్ధారించేందుకు రూ.2వే ల నుంచి రూ.3వేలవరకు డిమాండ్‌ చేస్తున్నారు. భూగర్భజలాలను బయటకు తెచ్చేందుకు పలుమా ర్లు చేసిన ప్రయత్నాలు విఫలమైన రైతులు విధిలేని పరిస్థితిలో మూఢ విశ్వాసానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

రిగ్గులకు భలే డిమాండ్‌

సకాలంలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టుల్లోకి వరద చేరడంలేదు. వాగులు, వంకలు పొంగిపొర్లి చెరువులు, కుంటలు నిండడం లేదు. దీంతో సాగునీటి ఇబ్బందులు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఫలితంగా బోరుబావుల డ్రిల్లింగ్‌ యంత్రాలకు డి మాండ్‌ ఏర్పడింది. సాగునీటి కోసం సాగర్‌ ఆయక ట్టు, ఆయకట్టేతర ప్రాంతాల రైతులతోపాటు తాగునీటి కోసం పట్టణవాసులు బోరుబావులు తవ్విస్తున్నారు. దీంతో రిగ్గుల వినియోగం పెరగడంతో వాటి యజమానులు అమాంతం ధర పెంచేశారు. వానాకాలం సీజన్‌లో ఒక ఫీట్‌ డ్రిల్లింగ్‌కు రూ.110 వసూ లు చేయగా, ప్రస్తుతం రూ.140కు పెంచారు. అదేవిధంగా 6ఇంచులకేసింగ్‌ ధరను రూ.280 నుంచి రూ. 350కు, 8 ఇంచుల కేసింగ్‌ ధరను రూ.600 నుంచి రూ.750కి పెంచారు. వర్షాలు కురిస్తే ఈ యంత్రాలు పొలాల్లో తిరగడం కష్టమవుతుందని భావిస్తున్న రైతులు ప్రస్తుతం బోరుబావులు తవ్వించేందుకు పోటీపడుతున్నారు. రైతుల అవసరాన్ని అదునుగా తీసుకొని రిగ్గుల యజమానులు ధరలను పెంచి వ సూలు చేస్తున్నారు. నాలా నిబంధనలను అతిక్రమించి బోరుబావులను తవ్వుతూ రైతుల మధ్య వి వాదాలకు కారణమవుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

అప్పుల ఊబిలోకి రైతులు

పంటలు పండక, చేతిలో చిల్లిగవ్వలేని రైతులు పడావుపడ్డ భూములను సాగులోకి తెచ్చేందుకు బోరుబావుల తవ్వకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొ బ్బరికాయ, నిమ్మకాయలు, కోడిగుడ్డు, తంగేడుపుల్లలతో నిర్ధారించిన ప్రాంతంలో బోరుబావులు త వ్వించినా చుక్కనీరు బయటకు రావడం లేదు. ఇష్టారీతిగా తవ్వకాలు జరిపి వేలాది రూపాయ లు ఖర్చుచేస్తున్నారు. కొందరు రైతులు స్థోమతకు మించి బోరుబావుల కోసం ఖర్చుచేస్తూ అప్పుల ఊబిలోకి వెళ్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు సాగునీటికోసం భగీరథ ప్రయత్నమే చే స్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు సైతం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ వేలాది రూపాయలు ఖర్చుచేసి ఆర్థికంగా చితికిపోతున్నారు. సాధారణంగా సాగర్‌ ఆయకట్టు భూముల్లో 50 నుంచి 80 ఫీట్ల మధ్యలో జల లభ్యత ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో 120 నుంచి 180 అడుగుల వరకు తవ్వకాలు జరిపినా ఫలితం దక్కడంలేదు.

రెండెకరాల కోసం 20 బోర్లు తవ్వించా : పుట్టల వెంకన్న, రైతు, వేములపల్లి

సాగర్‌ జలాశయం నుంచి ఏడాదిగా సాగునీటి విడుదల లేక ఉన్న సాగుభూమి పడావుపడింది. కాలం అయినా.. కాకపోయినా పొలాన్ని సాగులోకి తెచ్చేందుకు బోరుబావి ఉండాలని భావించా. మెట్టప్రాంతంలో నాకున్న రెండెకరాల భూమిని సాగులోకి తేవాలన్న ఆశతో బోరుబావిని తవ్వించేందుకు సిద్ధపడ్డా. కొబ్బరికాయతో జలాలు గుర్తించే వ్యక్తిని తీసుకొచ్చి బోరుపాయింట్లు పెట్టి సుమారు రూ.2.50లక్షలు ఖర్చుచేసి 20 బోరుబావులు తవ్వించినా చుక్కనీరు రాలేదు. సాగర్‌ ఆయకట్టులో భూగర్భ జలాలు ఇంతగా ఇంకిపోవడం ఇప్పుడే చూస్తున్నా. భూగర్భజలాల స్థాయిని గుర్తించేందుకు అధికారులు సర్వే నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 29 , 2024 | 12:10 AM