మైనారిటీలు కాంగ్రెస్ వైపే!
ABN , Publish Date - May 12 , 2024 | 06:04 AM
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? గత పదేళ్లుగా బీఆర్‌ఎ్‌సకు మద్దతుగా నిలిచిన ముస్లింలు ఈసారి హస్తం పార్టీకి అండగా ఉండాలనుకుంటున్నారా?
రాష్ట్రంలో సగానికి పైగా ఎంపీ స్థానాల్లో
10 శాతానికి పైనే ముస్లిం మైనారిటీల ఓట్లు
దేశవ్యాప్తంగా ‘ఇండియా’ వైపే వారి చూపు
బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రె్‌సకు మద్దతు
హిందూ ఓటర్ల పోలరైజేషన్‌పై బీజేపీ గురి
గతంలో బీఆర్‌ఎ్‌సకు మైనారిటీల మద్దతు
లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి దూరం
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? గత పదేళ్లుగా బీఆర్‌ఎ్‌సకు మద్దతుగా నిలిచిన ముస్లింలు ఈసారి హస్తం పార్టీకి అండగా ఉండాలనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా నిలువరించడం కోసం వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. అయితే ఈ పరిణామాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని, హిందూ ఓటర్లను తమకు మద్దతుగా పోలరైజ్ చేయవచ్చని పేర్కొంటున్నారు. తెలంగాణలో ముస్లిం మైనారిటీల జనాభా 14 శాతం ఉంటుంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా చూస్తే.. సగానికిపైగా ఎంపీ స్థానాల పరిధిలో 10, అంతకంటే ఎక్కువ శాతం మైనారిటీ ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని వీరిలో అత్యధికులు బీఆర్‌ఎ్‌సకు మద్దతుగా నిలిచారు. ఆ పార్టీకి ఎంఐఎం బహిరంగంగా మద్దతు తెలపడం, కేసీఆర్ సర్కారు మైనారిటీల సంక్షేమం కోసం పలు ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టడం వంటి కారణాలతో ఎక్కువమంది ముస్లింలు బీఆర్‌ఎ్‌సకు జైకొట్టారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రెండోసారి గెలవడంలో మైనారిటీల పాత్ర గణనీయంగా ఉందని ఆ పార్టీ వర్గాలే చెబుతుంటాయి.
జాతీయ రాజకీయాలతో..
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న సమీకరణలకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ.. కేంద్ర బిందువుగా మారడంతో తెలంగాణలోని మైనారిటీల ఆలోచనా విధానంలోనూ మార్పు రావడం ప్రారంభమైంది. ఈ సమీకరణ గడిచిన రెండేళ్ల నుంచీ జరుగుతున్న నేపథ్యంలో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే 2018 ఎన్నికల స్థాయిలో కాకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో బీఆర్‌ఎ్‌సకూ ముస్లిం ఓటర్లు మద్దతు పలికారు. కానీ, లోక్‌సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమి ఏర్పడి.. దేశ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీల ఓట్లు చీలకుండా పోలరైజేషన్ జరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని ముస్లింలూ కాంగ్రె్‌సకు అనుకూలంగా మారారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సగానికి పైగా సీట్లలో 10 నుంచి 28 శాతం మేరకు ముస్లిం మైనారిటీల ఓట్లు ఉన్నట్లు ఓటరు జాబితా వివరాలు చెబుతున్నాయి. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలోనైతే ఏకంగా 70 శాతం మంది ముస్లిం ఓటర్లే ఉంటారు. సికింద్రాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ వంటి చోట్ల వీరి ఓట్లు 10 నుంచి 28 శాతం వరకు ఉన్నట్లు చెబుతుంటారు. కాగా, ఈ స్థానాల్లో నల్లగొండ మినహా ఇతర అన్ని చోట్లా బీజేపీ అభ్యర్థులే కాంగ్రె్‌సకు ప్రధాన ప్రత్యర్థులుగా మారారు.
ఓట్లు పోలరైజ్ అవుతున్నాయని..
ఆయా నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీల జనాభా కాంగ్రెస్ పార్టీకి పోలరైజ్ అవుతుండడంతో ప్రతి చర్యగా హిందూ ఓటర్లు తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒక రకంగా మైనారిటీల పోలరైజేషన్ అన్నది తమకు లాభం చేకూరుస్తోందని పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, స్థానిక అవసరాలు, ఇండియా కూటమి ప్రకటించిన పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీల పట్ల ఆకర్షితులైన పేద, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంగ్రె్‌సకే మద్దతుగా నిలుస్తారని హస్తం పార్టీ వర్గాలు ఽఅంటున్నాయి. దీనికి ముస్లిం ఓటు బ్యాంకూ తోడై రాష్ట్రంలో 14 సీట్లు గెలుచుకుంటామని అంచనా వేస్తున్నాయి.
బీఆర్‌ఎస్‌కు దెబ్బే..!
ముస్లిం ఓటుబ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లడం బీఆర్‌ఎ్‌సకు నష్టం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల వరకూ బీఆర్‌ఎస్ గట్టి మద్దతుదారుగా నిలిచిన ఎంఐఎం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందని, ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన కూడా చేశారు. హైదరాబాద్‌యేతర నియోజకవర్గాల్లో ఎంఐఎం సానుభూతిపరుల మద్దతు కోసం బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తే.. నిరాకరణే ఎదురవుతోందని అంటున్నారు. ఇది బీఆర్‌ఎ్‌సకు మింగుడుపడని పరిణామమేనంటున్నారు. పలు మతసంస్థల పెద్దలు కూడా హైదరాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది.