Share News

ఐదు నెలల్లోనే ఆగం చేశారు

ABN , Publish Date - May 09 , 2024 | 12:11 AM

బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి జిల్లా అన్ని విధాల అభివృద్ధి

ఐదు నెలల్లోనే ఆగం చేశారు
నర్సాపూర్‌ పట్టణంలో రోడ్‌షోకు హాజరైన జనం, మాట్లాడుతున్న కేసీఆర్‌

పారిశ్రామికవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

నర్సాపూర్‌, పటాన్‌చెరు రోడ్‌షోలలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

నర్సాపూర్‌, మే 8: రేవంత్‌ ప్రభుత్వం ఐదు నెలలకే ఆగమాగం చేసిందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి మెదక్‌ జిల్లా అన్ని విధాల అభివృద్ధిలో ముందుకుసాగేదని, కాంగ్రెస్‌ పాలనలో ఈ ప్రాంత ప్రగతి కుంటుపడిందని విరుచుకుపడ్డారు. మెదక్‌ పార్లమెంటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి మద్దతుగా బుఽధవారం సాయంత్రం నర్సాపూర్‌ పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్డుషోలో కేసీఆర్‌ ప్రసంగించారు. నర్సాపూర్‌ నియోజకవర్గానికి సాగునీటి కోసం కోమటిబండ నుంచి ప్రత్యేక పైపులైన్‌ వేయించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. మల్లన్నసాగర్‌ నుంచి కాళేశ్వరం కాలువ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పనులు మొదలుపెట్టామని, అది పూర్తయితే నియోజకవర్గం బంగారుతునక అయ్యేదన్నారు. గిరిజనులకు ప్రత్యేకంగా పదిశాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని, దాని గురించి ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిచ్చి వారికి సర్వహక్కులు కల్పించిన ఘనత తమదేనన్నారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.25 కోట్లు మంజూరు చేస్తే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని వాపస్‌ తీసుకుని పనులు కాకుండా అడ్డుకుందని కేసీఆర్‌ విమర్శించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ఇచ్చిన వాటిని అమలు చేయాలంటే యుద్ధం చేయాల్సిందే అని, అందుకు మెదక్‌ ఎంపీగా వెంకట్రామారెడ్డిని గెలిపించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ వల్ల తెలంగాణకు పైసా లాభం లేదన్నారు. పేదలు, యువకులు, రైతులు కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి వారి ఉచ్చులో పడొద్దని సూచించారు.

ముసలితనానికి కుసుమ గుడాలన్నట్లు..

నర్సాపూర్‌ రోడ్డుషోలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మదన్‌రెడ్డి తెలుగుదేశంలో ఉన్న సమయంలో రెండుసార్లు ఓడిపోయాడని, తాను బీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేను చేశానని గుర్తుచేశారు. ‘ఆయన పార్టీ ఎందుకు మారారో.. ఈ ముసలితనానికి కుసుమ గుడాలన్నట్టు ఇప్పుడెల్లి ఏమి చేస్తాడు’ అని కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.

పటాన్‌చెరు పోలీసులు అతి చేస్తున్నారు జాగ్రత్త!

పటాన్‌చెరు, మే 8: పటాన్‌చెరు పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అతి చేస్తున్నారని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పటాన్‌చెరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని జాగ్రత్త అని హెచ్చరించారు. పోలీసులు తమ బాధ్యత నిర్వర్తించాలని రాజకీయాలలో వేలు పెట్టొదన్నారు. ఉపాధికి కేంద్రంగా ఉన్న పటాన్‌చెరును మరింత అభివృద్ధి చేయాలని, తాము పారిశ్రామికవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ 24 గంటలు ఇవ్వడమ వల్లే ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. మంచి పారిశ్రామిక విధానాల వల్ల అనేక కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు. ఈ రోడ్‌షోలలో ఎంపీ అభ్యర్ధి వెంకట్రామారెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌ తదితరులు పాలొన్నారు.

దారిపొడవునా జననీరాజనం

గజ్వేల్‌/తూప్రాన్‌, మే 8: ఎర్రవెల్లి ఫాంహౌజ్‌ నుంచి కేసీఆర్‌ నర్సాపూర్‌కు రోడ్డు మార్గం గుండా భారీ కాన్వాయ్‌తో బయలుదేరగా దారిపొడవునా జనం నీరాజనం పలికారు. గజ్వేల్‌, తూప్రాన్‌ పట్టణాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:11 AM