Share News

కామారెడ్డిలో చెల్లని రూపాయి కేసీఆర్‌

ABN , Publish Date - May 08 , 2024 | 11:25 PM

సిద్దిపేట, ఆంధ్రజ్యోతి, మే 8: దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో చెల్లుతుందా అని మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కామారెడ్డిలో చెల్లని రూపాయి కేసీఆర్‌
వర్గల్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో ప్రచార రథంపై నుంచి మాట్లాడుతున్న రఘునందన్‌రావు

తెలంగాణలో 17 సీట్లు ఎలా గెలిపిస్తారు

రాష్ట్ర రాజకీయాలను దిగజార్చింది ఆయనే

నేను గెలవగానే ఊచలు లెక్కబెట్టిస్తా

బీజేపీ మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావు

సిద్దిపేట, ఆంధ్రజ్యోతి, మే 8: దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో చెల్లుతుందా అని మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన సిద్దిపేటలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్‌ ఈ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లను ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. తాను మెదక్‌లో ఓట్లు అడుగుతుంటే ఓర్వలేని కేసీఆర్‌.. తెలంగాణ అంతటా ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ’తెలంగాణ నీ అయ్య జాగీరా’ అంటూ ధ్వజమెత్తారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే దుబ్బాకలో గెలిచి చూపించానని గుర్తుచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులతో డబ్బులు పంచిపెట్టి దుబ్బాకలో గెలిచారని, ఇది తప్పయితే సిద్దిపేట వెంకటేశ్వరస్వామి గుడిలో ప్రమాణం చేద్దామని సవాల్‌ విసిరారు. పోలీస్‌ అధికారి రాధాకిషన్‌రావు ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. మాలాంటి ఉద్యమకారులను తరిమికొట్టి కూతురు, కొడుకు, అల్లుడికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. తాను గెలవగానే శ్రీకృష్ణ జన్మస్థానంలో వీరందరినీ ఊచలు లెక్కబెట్టిస్తానని హెచ్చరించారు. తెలంగాణలో రాజకీయాలను దిగజార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తనను ఒకటంటే తాను నాలుగు అంటానని, మరోసారి తన జోలికి రావొద్దని రఘునందన్‌ సూచించారు.

నరేంద్రమోదీ నాయకత్వంలోనే దేశం సుభిక్షం

వర్గల్‌, మే 8: దేశ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే దేశం సుభిక్షంగా ఉన్నదని బీజేపీ మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. బుధవారం వర్గల్‌ మండల కేంద్రంలో రోడ్‌ షో నిర్వహించగా పార్టీ మండల శ్రేణులు బోనాలు, గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నందన్‌గౌడ్‌, పార్టీ మండలాధ్యక్షుడు టేకులపల్లి బాల్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాంరెడ్డి పాల్గొన్నారు.

కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలే

మెదక్‌ అర్బన్‌, మే 8: మాజీ సీఎం కేసీఆర్‌ బస్సుయాత్రలో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బార్‌ అసోసియేషన్‌ మెదక్‌ అధ్యక్షుడు సుభా్‌షగౌడ్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్‌ పాల్గొన్నారు.

గజ్వేల్‌: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావుకు మద్దతుగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనవెంట బీజేపీ పట్టణ కార్యదర్శి సందీప్‌ ఉన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:25 PM