Share News

బాడిగ బండ్లకు భలే గిరాకీ

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:48 PM

ఎడ్లబండ్లలో ఇసుక తరలింపు

బాడిగ బండ్లకు భలే గిరాకీ

ప్రభుత్వం ఇంకా ప్రకటించని ఇసుక పాలసీ

స్థానిక అవసరాల అనుమతులపై రాని స్పష్టత

గత్యంతరం లేక ఎడ్లబండ్లను ఆశ్రయిస్తున్న కూడవెల్లి పరీవాహక ప్రజలు

దుబ్బాక, ఏప్రిల్‌ 28 : రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ తీసుకొస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చకపోవడంతో గ్రామాల్లో అవసరాలకు అవస్థలు తప్పడంలేదు. ఇళ్లు కట్టుకుందామనుకున్నా.. వర్షాకాలం రాకముందే పాతింటికి మరమ్మతులు చేసుకుందామనుకున్నా ట్రాక్టర్‌ ఇసుక ట్రిప్పునకు నానా తంటాలు పడాల్సివస్తోంది. గత్యంతరం లేక ఎడ్లబండ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో బాడిగ బండ్లకు భలే గిరాకీ ఏర్పడింది.

ఎనకటి కాలంలా ఎడ్లబండ్లపై..

దుబ్బాక మండలం కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల్లో బాడిగ బండ్లు(అద్దెకు ఇచ్చే ఎడ్లబండ్లు) దర్శనమిస్తున్నాయి. దుబ్బాక మండలం ఆకారం, అక్బర్‌పేట-భూంపల్లి మండలాలల్లో ఎడ్లబండ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలలో ఇసుక తెచ్చుకుంటే అనుమతుల పేరుతో ఆంక్షలు ఉండటంతో ఎడ్లబండ్లే దిక్కయ్యాయి. ఇంటిసూరు కప్పించుకోవడం, ఇళ్ల మరమ్మతులు, చిన్నచిన్న నిర్మాణాలకు కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల ప్రజలు ఇసుక తెచ్చుకోవడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేని బాడిగ బండ్లనే ఆశ్రయిస్తున్నారు. ఎడ్లబండ్లు కనుమరుగవుతున్న కాలంలో ప్రస్తుతం ఇసుకకు బాడిగ బండి అవసరం రావడంతో మళ్లీ ఎనకటి కాలం వచ్చిందా.. అంటూ ప్రజలు అనుకుంటున్నారు. ప్రతీరోజు ఉదయం పూట మూడు ట్రిప్పులు, సాయంత్రం పూట మూడు ట్రిప్పుల ఇసుకను తరలిస్తూ బాడిగ బండ్ల వారు జీవనం సాగిస్తున్నారు. ఎడ్లబండి ట్రిప్పుకు రూ.1200 వరకు పలుకుతుంది. బాడిగ బండి వెంట ఇద్దరు కూలీలను కూడా సమకూర్చుకుని వారికి రోజు వెయ్యి రూపాయల వరకు ఇస్తున్నారు. మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలోని వారికి ఇసుకను చేరవేస్తున్నారు.

స్థానిక అవసరాలకు అనుమతెప్పుడో..?

రాష్ట్ర ప్రభ్వుత్వం ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి నూతన ఇసుక పాలసీని రూపొందించనున్నట్టు ప్రకటించగా, స్థానిక అవసరాలకు తహసీల్దార్‌ అనుమతితో వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి క్వారీలలో మాత్రమే ఇసుక అనుమతులను సులభతరం చేశారు. అయితే, తమకు ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు రాలేవని తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో పేదలు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎక్కువ మొత్తం చెల్లించి క్వారీల నుంచి ఇసుకను తెప్పించుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇసుక ధర టన్నుకు రూ.1800 నుంచి రూ.2200 వరకు బ్లాక్‌లో అమ్మారు. ప్రస్తుతం క్వారీలలో టన్నుకు రూ.1,450కి తగ్గింది. అయితే సిద్దిపేట జిల్లాకు రెండువందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది కాళేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను తెప్పించుకోవాలంటే ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం 16 టైర్‌ వాహనాల్లో 36 టన్నులు, 14 టైర్‌ల వాహనంలో 32 టన్నులు, 12 టైర్‌ల వాహనంలో 28 టన్నులకు మాత్రమే అనుమతినివ్వడంతో రవాణా భారం కూడా ఏర్పడుతుంది. దీంతో పేదలు ఇసుకను కొనే స్థోమత లేక ఇళ్ల నిర్మాణం చేపట్టడంలేదు. స్థానిక అవసరాలకు, స్థానిక వనరులను వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు

Updated Date - Apr 28 , 2024 | 11:48 PM