Share News

సీఎం తమ్ముడితో సంబంధాలున్నాయ్‌..

ABN , Publish Date - May 07 , 2024 | 10:42 PM

మాట వినకుంటే వ్యాపారాలు మూయిస్తా.. పోలీసుల పేరు చెప్పి వసూళ్లు.. నిందితుడి అరెస్ట్‌

సీఎం తమ్ముడితో సంబంధాలున్నాయ్‌..
నిందితుడిని చూపుతున్న మెదక్‌ పట్టణ సీఐ దిలీ్‌పకుమార్‌

మెదక్‌ అర్బన్‌, మే 7: సీఎం తమ్ముడితో దగ్గరి సంబంధాలు ఉన్నాయి.. మాట వినకుంటే వ్యాపారాలు మూయిస్తా.. నా వెనుక పోలీసులు, ఎమ్మెల్యే ఉన్నారంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. ఏకంగా లాఠీ పట్టుకుని వాహనాలను వెంబడించి మరీ వసూళ్లకు తెగబడ్డాడు. ఈ మేరకు ఫిర్యాదులు అందడంతో మెదక్‌ పోలీసులు నిందితుడికి అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి పంపించారు. మంగళవారం సీఐ దిలీ్‌పకుమార్‌ మెదక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. మెదక్‌ పట్టణంలోని ఇందిరాపూరి కాలనీకి చెందిన ఆముదా రఘు తన వెంట పోలీసులు, ఎమ్మెల్యే ఉన్నారని చెబుతూ వ్యాపారులతో పాటు, ఇసుక వ్యాపారులను బెదిరిస్తున్నాడు. లాఠీ పట్టుకుని వాహనాలను వెంబడించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇసుక దందా చేయవద్దని సీఎం చెప్పారని, సీఎం, అతని తమ్ముడితో దగ్గర సంబంధాలు ఉన్నాయంటూ బెదిరించాడు. ఉన్నతాధికారుల ఫోన్‌ నంబర్లను సేకరించి వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి వారి పేర్లు చెబుతూ.. అధికారులకు ఫోన్లు చేస్తున్నట్లు నటిస్తూ.. బెదిరించేవాడు. తన మాట వినకుంటే వ్యాపారాలు మూసి వేయిస్తానని.. తన మాట వినని వారిపై తప్పుడు ఫిర్యాదులు చేసేవాడు. ఈ మేరకు ఫిర్యాదులు అందడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో అత్యాచార కేసు, హవేళిఘన్‌పూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దోపిడీ కేసు, మెదక్‌ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఏడు కేసులు ఉన్నాయని సీఐ వివరించారు. వివిధ కేసుల్లో శిక్షలు కూడా పడినప్పటికీ తీరు మార్చుకోకుండా డబ్బులు వసూలు చేస్తున్నాడని వివరించారు.

Updated Date - May 07 , 2024 | 10:42 PM