Share News

అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:26 PM

చేగుంట, ఏప్రిల్‌ 26: మండలంలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌ సూచించారు.

అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి
గుమ్మడిదల: సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడ్డి

చేగుంట, ఏప్రిల్‌ 26: మండలంలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌ సూచించారు. చేగుంట మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొని గ్రామాల్లోని శ్మశానవాటికలకు కనెక్షన్‌ కోసం డీడీలు చెల్లించామని, కానీ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వలేదని ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. డీడీలు చెల్లించిన శ్మశానవాటికలకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకపోవడం సరికాదని, వెంటనే విద్యుత్‌ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఎంపీపీ ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో చిన్నారెడ్డి, ఎంపీటీసీలు రవి, గణేష్‌, హోలియనాయక్‌, లక్ష్మీరమేష్‌, వెంకటలక్ష్మీ, కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌అలీ, ట్రాన్స్‌కో ఏఈ రాములు పాల్గొన్నారు.

ప్రత్యేకాధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే

గుమ్మడిదల, ఏప్రిల్‌ 26: ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాల ఎంపీటీసీలు, ప్రత్యేకాధికారులు హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రత్యేకాధికారుల వల్ల పనులు జరగడం లేదని ఆరోపించారు. భూగర్భ జలాలు ఉన్నా మోటార్లకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొన్నదని చెప్పారు. ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు పని చేయాలన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:27 PM