Share News

గుర్రంగడ్డకు స్వచ్ఛమైన తాగునీరు

ABN , Publish Date - May 08 , 2024 | 11:53 PM

దీవి గ్రామం గుర్రంగడ్డకు ఎట్టకేలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది.

గుర్రంగడ్డకు స్వచ్ఛమైన తాగునీరు
గుర్రంగడ్డలో కొత్తగా ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌

-ఆర్‌వో ప్లాంటును ఏర్పాటు చేసిన అధికారులు

గద్వాల, మే 8 : దీవి గ్రామం గుర్రంగడ్డకు ఎట్టకేలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మూడు రోజుల క్రితం కొత్త ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేయడంతో చాలా కాలంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది. రాష్ట్రం అంతటా మిషన్‌ భరీరథ పథకం అమలై స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తుండగా, గుర్రంగడ్డ గ్రామానికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. గ్రామం చుట్టూ కృష్ణానది ఉండటంతో మిషన్‌ భగీరథ పథకం అమలు చేయడం సాధ్యం కాలేదు. అయితే 2014 పుష్కరాల సందర్భంగా భక్తులకు మంచినీటిని అందించేందుకు నదీ అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును గుర్రంగడ్డకు తరలించారు. కానీ నిర్వాహణ సరిగా లేకపోవడంతో కొన్ని రోజులకే మూలనపడింది. దీంతో గుర్రంగడ్డ గ్రామస్థులకు కృష్ణానది నీటిని నేరుగా పంపింగ్‌ చేస్తున్నారు. వరదల సమయంలో నదికి బురదనీరు వచ్చినా, ఆలానే తాగాల్సి వచ్చేంది. దీంతో స్థానికులు పలుమార్లు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఏడాది కృష్ణానది పూర్తిగా ఒట్టిపోవడంతో జక్కలగుంట మడుగునీరే వారికి దిక్కయ్యింది. మడుగులోని చేపలు ఎండవేడికి మృతి చెందడంతో దుర్వాసనతో కూడిన నీళ్లు సరఫరా కావడం ఇబ్బందిగా మారింది. దీంతో స్థానికులు పెబ్బేరులోని ప్రైవేట్‌ ఆర్వో ప్లాంటు నుంచి మంచినీటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి రావడంతో, జడ్పీ నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు, స్పెషల్‌ ఫండ్‌ నుంచి రూ.1.50 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు గ్రామంలో ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేయడంతో తాగునీటి ఎద్దడి పరిష్కారమైంది.

Updated Date - May 08 , 2024 | 11:53 PM